Begin typing your search above and press return to search.

విష్ణు గారి సొంత అజెండా వ‌ర్క‌వుట‌య్యేనా ..!

రాజకీయాల్లో నాయకులకు అజెండాలు ఉండొచ్చు. పార్టీలపరంగా ఉన్న సిద్ధాంతాలను బట్టి నిర్ణయం తీసుకునే లేదా నిర్మించే అజెండాలను ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు.

By:  Tupaki Desk   |   20 Jun 2025 9:15 AM IST
విష్ణు గారి సొంత అజెండా వ‌ర్క‌వుట‌య్యేనా ..!
X

రాజకీయాల్లో నాయకులకు అజెండాలు ఉండొచ్చు. పార్టీలపరంగా ఉన్న సిద్ధాంతాలను బట్టి నిర్ణయం తీసుకునే లేదా నిర్మించే అజెండాలను ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. వాటిపై పోరాటం చేయడం ద్వారా వాటిని ఫాలో కావడం ద్వారా నాయకులు పదవులు కూడా పొందవచ్చు. కానీ సొంత అజెండాలు పెట్టుకుంటే మాత్రం అది చాలా ప్రమాదకరం. కొంతమందికి మాత్రమే ఈ విషయంలో కలిసి వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో చూసాం. చాలామంది సొంత అజెండాలు పెట్టుకుని రాజకీయంగా మనుగడ కోల్పోయిన వారు ఉన్నారు.

ఇలా చూసుకుంటే బీజేపీలో సొంత అజెండాని అమలు చేస్తున్నారనే వాదన విష్ణుకుమార్ రాజు విషయంలో బలంగా వినిపిస్తోంది. విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విష్ణు కుమార్ రాజు బిజెపి లో ఇతర నాయకులకు భిన్నంగా సొంతంగా అజెండాను ఏర్పాటు చేసుకుని దానిని సాధించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని వాదన వినిపిస్తోంది. గత ఏడాది ఎన్నికలకు ముందు కూడా ఇలానే సొంత అజెండా పెట్టుకున్నారని నాయకులు అంతర్గత చర్చల్లోనే కాదు బహిరంగంగా కూడా వ్యాఖ్యానించారు.

టిడిపికి మద్దతుగా ఉన్నారని చంద్రబాబుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని సోము వీర్రాజు లాంటి వాళ్ళు బహిరంగంగానే విమర్శించారు. దీంతోనే పార్టీలో ఆయన ఒకరకంగా ఏకాకిగా మారిన పరిస్థితి గత ఐదేళ్లలో చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన తన విధానాన్ని మార్చుకోలేకపోతుం డడం ప్రస్తుతం పార్టీలో అంతర్గత చర్చిగా మారింది. సొంత అజెండాను పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులను ఆయన టార్గెట్ చేస్తున్నారని ఇది పార్టీకి మంచిది కాదని కూడా సోము వీర్రాజు లాంటి నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా విశాఖపట్నంలో భూముల కుంభకోణం విషయంలో విష్ణుకుమార్ రాజు లేవ‌నెత్తుతున్న అభిప్రాయాలను చంద్రబాబు సైతం యావగించుకునేలాగా ఉన్నాయనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. సాధారణంగా వైసిపి పై విష్ణుకుమార్ రాజు నిప్పులు చేరుగుతారు. అసెంబ్లీలో అయినా ఇటు బయటైనా ఎక్కడ అవకాశం వచ్చినా తనకు ఇవ్వాల్సిన కాంట్రాక్టు సొమ్ములు ఇవ్వకుండా ఏడిపించారని తనను కూడా వైసీపీలో చేరాలని ఒత్తిడి చేశారని గతంలో ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కూడా జగన్ను పదేపదే టార్గెట్ చేస్తూ వచ్చారు. దీంతో కూటమి నాయకులు విష్ణును ఓన్ చేసుకుని వారి పక్కన సీటు కూడా కల్పించిన సందర్భాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు కూటమి నాయకుల్ని విష్ణుకుమార్ రాజు టార్గెట్ చేయటం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్రంగా రాజకీయాలను చేస్తుండడం భూకబ్జాల విషయంలో పోరాటం చేస్తానంటూ ప్రకటనలు చేయటం వంటివి ఇటు బిజెపిలోను, అటు కూటమి నాయకులను కూడా అసంతృప్తిని రేపు తోంది. తద్వారా విష్ణుకుమార్ రాజు అందరికీ దూరం అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి విష్ణుకుమార్ రాజు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ముఖ్యంగా విశాఖపట్నంలో ఒక పద్ధతి అయిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు.

కానీ ఇటీవల కాలంలో ఆయన వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న‌ నిర్ణయాలు అమలు చేస్తున్న సొంత అజెండా వంటివి అన్ని పార్టీల్లోనూ విస్మయాన్ని కలిగిస్తున్నాయి. అలానే ఆయనేమి బిజెపి నుంచి బయటకు వచ్చేస్తారని ఎవరు అనడం లేదు. కానీ ఉన్న పార్టీలోనే మద్దతు లేకపోతే ఆయనకు పదవులు గాని అవకాశాలు కానీ ఎలా లభిస్తాయి అన్నది అయినా ఆలోచించుకోవాలి. సొంత అజెండా మంచిదా కాదా అనేది ఆయన ఆత్మ విమర్శ చేసుకుని అడుగులు వేస్తే పార్టీలో ఆయనకు బలమైన ప్రాతినిధ్యం దక్కుతుందని సీనియర్ నాయకులే అభిప్రాయపడుతుండడం గమనార్హం.