Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ విమర్శలు.. బీజేపీ నేత కౌంటర్

తాజాగా ఆయన తన మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీతో జనసేన పొత్తుపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి.

By:  Tupaki Desk   |   6 May 2025 7:19 AM
పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ విమర్శలు.. బీజేపీ నేత కౌంటర్
X

తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రకాశ్‌రాజ్, రాజకీయాలపై, ముఖ్యంగా బీజేపీ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం తెలిసిందే. సామాజిక కార్యకర్త గౌరీ లంకేష్ హత్య తర్వాత రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయిన ప్రకాశ్‌రాజ్, బీజేపీకి మద్దతిస్తున్న వారిపైనా విరుచుకుపడుతుంటారు. తాజాగా ఆయన తన మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీతో జనసేన పొత్తుపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపాయి.

-ప్రకాశ్‌రాజ్ విమర్శల పదును

గతంలో స్వతంత్ర అభ్యర్థిగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ప్రకాశ్‌రాజ్, అప్పటి నుంచి రాజకీయ విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ పరిశ్రమపై మాట్లాడుతూ, చాలా మంది సెలబ్రిటీలు అమ్ముడుపోయారని, నిజాలు మాట్లాడటం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తుపై మరోసారి పెదవి విరిచారు. బీజేపీతో పవన్ ప్రయాణం "ముంబై లోకల్ ట్రైన్ జర్నీ లాంటిది" అంటూ ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యానించారు. పవన్‌కు ఏం తెలియదని, బీజేపీ వాళ్లే ఎక్కించుకున్నారని, వాళ్లే దించేస్తారని సంచలన ఆరోపణలు చేశారు. సొంత నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా ఇతర రాష్ట్రాల గురించి మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ పవన్‌ను వాడుకుని పైకొస్తుందని, ఈ కొద్ది సమయం పవన్ ఎంజాయ్ చేయమంటూ ఎద్దేవా చేశారు.

-బీజేపీ నేత స్ట్రాంగ్ రిప్లై

ప్రకాశ్‌రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ, జనసేన శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో, బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రకాశ్‌రాజ్‌కు ధీటైన జవాబిచ్చారు. "బీజేపీపై నిత్యం విమర్శలు చేయడం, పవన్ కళ్యాణ్‌పై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం తప్ప, రాజకీయంగా మీరు ఏం సాధించారు?" అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రకాశ్‌రాజ్‌ను నిలదీశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని గుర్తు చేస్తూ, ఎంపీగా పోటీ చేసి ఘోరంగా ఓటమి పాలైన మీరు ఏం సాధించారని చురకలంటించారు. జనసేన పార్టీకి బీజేపీ పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేసిన విష్ణువర్ధన్ రెడ్డి, ప్రకాశ్‌రాజ్ ఇకనైనా ప్రశాంతంగా ఉండాలని హితవు పలికారు. విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్... రాజకీయాల్లో ఓటమి పాలైనవారు సైలెంట్‌గా ఉండాలనే అర్ధం వచ్చేలా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలు, వాటిపై వచ్చిన స్పందన ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.