Begin typing your search above and press return to search.

సన్యాసం బెటర్ అంటున్న రాజు గారు

అదేంటి రాజకీయాల్లో బ్రహ్మాండమైన పదవి ఉంది. చేతిలో అధికారం ఉంది. ఎమ్మెల్యేగా చక్రం తిప్పవచ్చు కదా. మధ్యలో ఇవేంటి వైరాగ్యం మాటలు అంటే ఆయన మాత్రం కాషాయం పార్టీలోనే ఉంటూ కాషాయం కట్టేయ్ బ్రదర్ అనే పాట పాడుతున్నారట.

By:  Tupaki Desk   |   28 July 2025 9:38 AM IST
సన్యాసం బెటర్ అంటున్న రాజు గారు
X

అదేంటి రాజకీయాల్లో బ్రహ్మాండమైన పదవి ఉంది. చేతిలో అధికారం ఉంది. ఎమ్మెల్యేగా చక్రం తిప్పవచ్చు కదా. మధ్యలో ఇవేంటి వైరాగ్యం మాటలు అంటే ఆయన మాత్రం కాషాయం పార్టీలోనే ఉంటూ కాషాయం కట్టేయ్ బ్రదర్ అనే పాట పాడుతున్నారట. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు అంటే విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున 2024 ఎన్నికల్లో గెలిచిన విష్ణు కుమార్ రాజు. మరి ఆయనకు ఎందుకు ఇంత సడెన్ గా వేదాంతం పొంగుకొస్తుంది అంటే మ్యాటర్ చాలానే ఉంది అని అంటున్నారు.

అధికారంలో ఉండి ఏమి లాభం :

అవును పవర్ లో ఉంటే దానిని చూపించాలి. లేకపోతే లాభమేంటి. బీజేపీ రాజు గారు ఇదే మాట అంటున్నారు. ఆయన తన నియోజకవర్గంలో ఉన్న ప్రత్యర్ధి అయిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మీద మండిపోతున్నారు. ఆయన ఈ మధ్య ప్రమోషన్ కూడా పార్టీ తరఫున అందుకుని జిల్లా అధ్యక్షుడిగా దూకుడు పెంచేశారు. దాంతో ఆయనను కట్టడి చేయాల్సిందే అన్నది బీజేపీ రాజు గారి మాట. అదే ఆయన పట్టుదలట.

ఎందుకు అరెస్టు చేయడం లేదో :

వైసీపీ అయిదేళ్ళ పాలనలో విశాఖ ఉత్తరం నుంచి అనధికార ఎమ్మెల్యేగా కేకే రాజు జోరు చేశారు అని చెబుతారు. ఆ సమయంలో విశాఖ రావాలని చూసిన చంద్రబాబుని ఎయిర్ పోర్టులో వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆ ఆందోళనకు నాయకత్వం వహించింది కేకే రాజు అని బీజేపీ రాజు చెబుతున్నారు. అంతే కాదు 2022లో పవన్ కళ్యాణ్ విశాఖ వస్తే ఆయనను సైతం అడ్డుకుని వైసీపీ ఆందోళనలు చేస్తే అక్కడ కూడా కేకే రాజు నాయకత్వం వహించారు అని ఆయన అంటున్నారు. మరి ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదు అని బీజేపీ రాజు తెగ ఫీల్ అవుతున్నారుట.

చుక్కలు చూపించాల్సిందే :

కూటమికి చెందిన ఇద్దరు అతిరధులకు విశాఖలో వైసీపీ ఇబ్బంది పెడితే నాయకత్వం వహించిన కేకే రాజుని అలా వదిలేశారు ఏంటి అని బీజేపీ రాజు గారు తెగ మధన పడిపోతుంటారు. ఇటీవల కాలంలో ఆయన పూర్తిగా ఓపెన్ అయిపోయారట. ఏమిటో ఈ రాజకీయం అని కూడా అంటున్నారట. వైసీపీ సమయంలో ఇబ్బంది పడిన వారిలో ప్రస్తుత హోం మంత్రి అనిత కూడా ఉన్నారు కదా అని ఆయన అంటున్నారట. మరి అంతా దేవుడే చూసుకుంటాడు అనుకుంటే రాజకీయాలు అధికారం ఎందుకు అని ఆయన అంటున్నారు.

ఆయనను టార్గెట్ చేశారా :

విశాఖ ఉత్తరం నుంచి తనకు ఎదురు లేకుండా చేసుకోవాలని విష్ణుకుమార్ రాజు చూస్తున్నారు కేకే రాజు దూకుడు పెంచితే ఇబ్బంది అని భావిస్తున్నారు ప్రత్యర్ధులను అరెస్ట్ చేస్తూ వస్తున్న కూటమి కేకే రాజు విషయంలో ఉదాశీనంగా ఉండడం ఆయనకు అసలు నచ్చడం లేదు అని అంటున్నారు. మొత్తం మీద తనలోని అసంతృప్తిని బాహాటంగా వెళ్లగక్కుతున్న విష్ణు కుమార్ రాజు కేకే రాజుని అరెస్టు చేసేంతవరకూ ఊరుకునేలా లేరు అని అంటున్నారు. చూడాలి మరి విశాఖ వైసీపీ అధ్యక్షుడు కూటమికి టార్గెట్ అవుతారా లేదా వేచి చూస్తారా అన్నది.