టీడీపీ సిగ్గు తీసిన బీజేపీ ఎమ్మెల్యే
తాజాగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు కూటమిలో కొత్త మంటలు పుట్టిస్తున్నాయి.
By: Tupaki Desk | 2 July 2025 12:32 PM ISTబీజేపీలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా విశాఖకు చెందిన నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఉంటున్నారు. ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తారు, అది స్వపక్షమా విపక్షమా అన్నది కూడా చూసుకోరు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉంటూ చంద్రబాబుని పొగిడిన ఘనత ఆయనదే. ఇక ఇపుడు కూటమిలో ఉంటూ పెద్దన్నగా ఉంటున్న టీడీపీని నిలదీస్తున్న గొప్పతనమూ ఆయనదే.
తాజాగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు కూటమిలో కొత్త మంటలు పుట్టిస్తున్నాయి. ఏపీలో టీడీపీ కూటమికి అధికారం బీజేపీ పుణ్యమే అని కుండబద్దలు కొట్టారు రాజు గారు. ఏపీ బీజేపీ కొత్త ప్రెసిడెంట్ గా పీవీఎన్ మాధవ్ ఎంపికైన తరువాత జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కూటమిలో మూడు పార్టీలకు సమాన అవకాశాలు రావాలని కొత్త పాయింట్ ని లేవనెత్తారు.
కూటమిలో బీజేపీ లేకపోతే ఏపీలో అసలు టీడీపీకి అధికారం వచ్చేది కాదు అని రాజు గారు అసలు గుట్టు కూడా చెప్పేశారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతోనే అన్ని విధాలుగా కలసి వచ్చింది అన్నది ఆయన మాటల ద్వారా వ్యక్తం అయింది. ఇక పదవుల విషయానికి వచ్చేసరికి మాత్రం టీడీపీ ఎనభై శాతం తీసుకుంటోందని, జనసేనకు 15 శాతం పోతే బీజేపీకి అయిదు శాతం ఇస్తున్నారు అని తీవ్ర అసంతృప్తిని వెళ్ళగక్కారు.
ఇదెక్కడి అన్యాయం అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం అయిదు శాతం పదవుల కోసమా కూటమి కట్టింది అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి కూటమిలో సమన్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. పార్టీ కోసం కూటమి కోసం త్యాగాలు చేసిన పార్టీ క్యాడర్ అయితే ఇక ఊరుకోరని కూడా ఆయన స్పష్టం చేశారు. వారికి ఎగనామం పెట్టడం అసలు కుదరదని కూడా ఆయన అన్నారు.
ఇక విష్ణు కుమార్ లేవనెత్తిన ఈ 80 శాతం 15 శాతం 5 శాతం లెక్కలు చూస్తే కనుక ఏపీ కేబినెట్ లో 20 మంది మంత్రులు టీడీపీకి ఉన్నారు, అలాగే 15 శాతంతో మూడు మంత్రి పదవులు జనసేనకు దక్కాయి. అయిదు శాతంతో ఒకే ఒక్క పదవి బీజేపీకి ఇచ్చారు. దాని మీద గతంలోనూ ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు.
2014లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటే ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారని ఆయన చెప్పారు. కానీ ఈసారి ఎనిమిది మంది ఉంటే ఒక్కరికే మంత్రిగా చాన్స్ ఇచ్చారు, ఇదేమి లెక్క అని కూడా అన్నారు. రెండు సార్లు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా కూడా ఉన్న విష్ణు కుమార్ రాజు మంత్రి పదవిని ఆశిస్తున్నారు. అయితే కూటమిలో టీడీపీ జనసేనలకే ప్రాధాన్యత దక్కుతోంది. బీజేపీకి ఒకటీ అరా పదవులే ఇస్తున్నారు.
దీని మీద బీజేపీలో చాలా మంది కూడా మధనపడుతున్నారు. గతంలో పురంధేశ్వరి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకుని వెళ్ళారు అయితే ఆమె అంతా అధినాయకత్వం చేతులలోనే అని తప్పించుకున్నారు అని ప్రచారం సాగింది. ఇపుడు ఎటూ ఆమె లేరు, మాధవ్ కి చార్జి ఇచ్చారు కాబట్టి ఆయనను ముందు పెట్టి తమకు ఎక్కువ పదవులు దక్కించుకోవాలని బీజేపీ నేతలు చూస్తున్నారు.
వారందరికీ రాజు గారు అన్న మాటలు అయితే వినసొంపుగా ఉన్నారు. వారు ఆయనకు మద్దతుగా ఉన్నారు. అదే సమయంలో బీజేపీ లేకపోతే టీడీపీ లేదు అన్న రాజు గారి మాటలు మాత్రం ములుకులుగా టీడీపీకి గుచ్చుకుంటున్నాయని అంటున్నారు.
రాజు గారు అసలు గుట్టుని నర్మగర్భంగా చెప్పేశారు అని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో ఎంత బలం ఉందని కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతే 2024 ఎన్నికల్లో అత్యంత కీలకం అయింది అన్నది ఆయన మాటల అంతరార్ధం అని అంటున్నారు. మార్చి లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన దగ్గర నుంచే ఏపీలో మొత్తం వ్యవస్థలు వైసీపీ ప్రభుత్వ పెద్దల మాట వినడం మానేసి కూటమి వైపు తిరిగాయి అంటే దాని వెనక ఉన్నది ఎవరు అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నగా ఉంది. అంటే బీజేపీ మద్దతు ఎంతటి కీలకమో ఆయన స్పష్టంగా చెప్పదలచుకున్నారు అని అర్ధం అవుతోంది అంటున్నారు.
