భోగాపురం బహు దూరం...కూటమి ఎమ్మెల్యేతో ఇరకాటం !
భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి అయితే ఉత్తరాంధ్ర స్వర్ఘ ధామమే అని కూటమి ప్రభుత్వ పెద్దలు నినదిస్తున్నారు.
By: Satya P | 15 Jun 2026 9:05 AM ISTభోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి అయితే ఉత్తరాంధ్ర స్వర్ఘ ధామమే అని కూటమి ప్రభుత్వ పెద్దలు నినదిస్తున్నారు. అంతే కాదు మొత్తం ఏపీలోనే గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వస్తుందని కూడా భారీ ప్రకటనలు ఇస్తున్నారు. ఈ ఎయిర్ పోర్టు ఒక్కసారి ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తే ఏపీతో పాటు ఉత్తరాంధ్ర దశ తిరిగినట్లే అని కూడా అంటున్నారు. అలాంటి నేపధ్యంలో అదే ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కూటమి ఎమ్మెల్యే ఒకరు మాత్రం భోగాపురం బహు దూరం అంటూ ఒక్కటే స్లోగన్ వినిపిస్తున్నారు.
ఏకైక ఎమ్మెల్యేగా :
నిజానికి భోగాపురం విశాఖకు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. అంత దూరం ట్రాఫిక్ ని దాటుకుని వెళ్ళాలీ అంటే రెండు నుంచి మూడు గంటలు పడుతుందని లెక్క వేస్తున్నారు. ఇక విమానం ఎక్కడానికి రెండు గంటల ముందే అక్కడ ఉండాలని అంటున్నారు. ఈ విధంగా లెక్క తీస్తే కనుక అయిదు గంటలకు పైగా సమయం పడుతుందని అంటున్నారు. విశాఖకు అవతల వైపు ఉన్న గాజువాక వంటి చోట్ల నుంచి వచ్చే ఎయిర్ ట్రావెలర్స్ పరిస్థితి ఇంకా దూరాభారం అని అంటున్నారు. సరిగ్గా ఈ విషయం మీదనే విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గళమెత్తుతున్నారు.
విశాఖ ఎయిర్ పోర్టు కోసం :
ప్రస్తుతం విశాఖ ఎయిర్ పోర్టు ఉంది. దీని వల్ల డొమెస్టిక్ జర్నీకి ఎంతో సానుకూలంగా ఉంది. ఇక్కడ నుంచి విజయవాడ హైదరాబాద్ కి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువ. అందువల్లనే ఈ ఎయిర్ పోర్టుని కొనసాగించాలని విష్ణు కుమార్ రాజు కోరుతున్నారు భోగాపురం ఎయిర్ పోర్టుని స్టార్ట్ చేసినంత మాత్రాన విశాఖ ఎయిర్ పోర్టు మూసేయాల్సిన అవసరం లేదని అన్నారు. డొమెస్టిక్ పర్పస్ కోసం అయినా దానిని కంటిన్యూ చేయాలని ఆయన అంటున్నారు.
మిగిలిన వారిలోనూ :
ఏపీకి అమరావతి రాజధాని. అందువల్ల విశాఖ నుంచి ఎక్కువ మంది విజయవాడకు తరచూ వెళ్తూంటారు. వారికి ఇపుడు ఇబ్బంది అని అంటున్నారు. కూటమిలో మిగిలిన ప్రజా ప్రతినిధులే కాదు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులలోనూ ఇదే రకమైన భావన ఉంది. అయితే వారు బయటకు గట్టిగా చెప్పడం లేదు. కానీ విష్ణు కుమార్ రాజు డేరింగ్ గా తన గొంతుని వినిపిస్తున్నారు. ఆయన మీడియా ముందు చెబుతున్నారు. అలాగే పార్టీ సమావేశాలలోనూ చెబుతున్నారు. తాజాగా మరో మారు విష్ణు కుమార్ రాజు ఇదే మాటను చెప్పుకొచ్చారు.
ఇబ్బందికరంగానే :
ఇక చూస్తే కూటమి ఎమ్మెల్యేనే భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో బహు దూరం అంటూ చేస్తున్న ప్రకటనలు చెబుతున్న కారణాలు కూటమికి ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు గ్రేట్ అని ఒక వైపు ప్రభుత్వ పెద్దలు చెబుతూంటే ఇప్పట్లో అక్కడికి వెళ్ళడం సాధ్యం కాదని రాజు చెబుతున్నారు. దాంతో ఆయన వ్యాఖ్యల మీద ఏమీ చేయలేక కక్కలేక మింగలేక అన్నట్లుగా కూటమి పెద్దల పరిస్థితి ఉందని అంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే మాటలనే ఇపుడు వైసీపీ కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. నెమ్మదిగా విశాఖ ఎయిర్ పోర్టుని కొనసాగించాలన్నది ఒక డిమాండ్ గా ముందుకు వస్తోంది. భోగాపురం ఎయిర్ పోర్టు స్టార్ట్ చేయడానికి కౌంట్ డౌన్ మొదలైన వేళ విశాఖ ఎయిర్ పోర్టు మీద ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అన్నది చూడాల్సిందే అని అంటున్నారు.
