Begin typing your search above and press return to search.

ఆ ఫొటో.. క‌విత‌కు హైప్.. బీఆర్ఎస్ కు బీపీ.. విష్ణుకు ప్ల‌స్.

By:  Tupaki Desk   |   16 Sept 2025 4:20 PM IST
ఆ ఫొటో.. క‌విత‌కు హైప్.. బీఆర్ఎస్ కు బీపీ.. విష్ణుకు ప్ల‌స్.
X

ఒక్క సిరా చుక్క వేల మెద‌ళ్ల‌కు క‌ద‌లిక అన్నారు.. ఒక్క ఫొటో వంద‌ల వార్త‌ల‌కు స‌మానం అని కూడా అనుకోవాలి.. ల‌క్ష‌ల అక్ష‌రాలు చెప్ప‌లేని భావాన్ని ఒక్క ఫొటో చాటుతుంది.. అందుకే మీడియాలో ఫొటోల‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంది.. ఇలాంటి ఫొటోనే ఒక‌టి తెలంగాణ రాజ‌కీయాల్లో, ముఖ్యంగా హైద‌రాబాద్ లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఒక పార్టీలో బీపీ రేపింది. రాబోయే పార్టీగా చెప్పుకొనేలా మ‌రో పార్టీలో హైప్ తెచ్చింది.. ఓ నాయ‌కుడికి ప్ల‌స్ పాయింట్ అయింది.

బీఆర్ఎస్ సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మ‌ర‌ణంతో త్వ‌ర‌లో తెలంగాణ‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. అధికార పార్టీ కాంగ్రెస్ త‌ర‌ఫున టికెట్ కోసం న‌లుగురు నాయ‌కుల పేర్లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాత్రం మాగంటి స‌తీమ‌ణికి టికెట్ ఖాయం అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

కేటీఆర్ ప‌రోక్షంగా హింట్ ఇవ్వ‌డ‌మే దీనికి కార‌ణం. అయితే, గ‌త ఎన్నిక‌ల ముందు బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి ఉండ‌గా మాగంటి స‌తీమ‌ణికి టికెట్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ఊహాగానాలు చెల‌రేగాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే విష్ణు.. తాజాగా బీఆర్ఎస్ నుంచి స‌స్పెన్ష‌న్ కు గురైన క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను క‌లిశారు. ఈ మేరకు ఫొటో బ‌య‌ట‌కు రావ‌డం క‌ల‌క‌లం రేపింది.

బీఆర్ఎస్ నుంచి టికెట్ రాద‌ని తేల‌డంతోనే విష్ణు.. తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు క‌విత‌ను క‌లిశార‌నే చ‌ర్చ వైర‌ల్ అయింది. దీంతో బీఆర్ఎస్ ఉలిక్కిపడింది. త‌మ సిటింగ్ స్థానం కావ‌డం, విష్ణు వంటి కీల‌క నాయ‌కుడు క‌విత వ‌ర్గం వైపు వెళ్తున్న‌ట్లు సంకేతాలు క‌నిపించ‌డంతో అప్ర‌మ‌త్త‌మైంది. ఈ ప‌రిణామాల‌తో వెంట‌నే విష్ణు తెలంగాణ భ‌వ‌న్ లో ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ తోనే నా ప్ర‌యాణం అని స్ప‌ష్టం చేశారు. బీఆర్ఎస్ గ‌నుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో గెల‌వ‌కుంటే ఆ పార్టీకి మ‌రిన్ని క‌ష్టాలు ఎదుర‌వుతాయి. అందుకే ప‌రిణామాలు చేజార‌కుండా చూసుకుంది.

సొంత సంస్థ కార్యాల‌యం ఉన్న‌చోట‌నే...

జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధి బంజారా హిల్స్ లో జాగృతి పార్టీ కార్యాల‌యాన్ని స్థాపించిన క‌వితకు విష్ణుతో భేటీ అంశం క‌లిసొచ్చింది. మంచి హైప్ తెచ్చింది. త‌న‌ను స‌స్పెండ్ చేసిన బీఆర్ఎస్ ను సైతం క‌దిలించిన ఈ ప‌రిణామం ఎంతైనా క‌విత‌కు ప్ల‌స్ పాయింటేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఒక‌వేళ క‌విత సొంతంగా పార్టీ పెడితే ఎలా ఉంటుందో అనే ముంద‌స్తు సంకేతం ఇచ్చింద‌ని వివ‌రిస్తున్నాయి.

ఈసారీ టికెట్ రాకుంటే...

ఇక విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి 2014, 2018 ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేదు.. 2023లో టికెట్ రాక‌పోవ‌డంతో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ లేనందున జూబ్లీహిల్స్ లో బ‌ల‌మైన నాయ‌కుడు విష్ణునే. కానీ, ఆయ‌న‌కు ఈసారికి బీఆర్ఎస్ టికెట్ వ‌చ్చే ప‌రిస్థితి లేదు. తాజా ప‌రిణామాలు మాత్రం ఆయ‌న ఉనికి చాటుకునేందుకు ప‌రోక్ష అవ‌కాశం క‌ల్పించాయి.

ఇంత‌కూ క‌విత‌ను విష్ణు క‌లిసిన నేప‌థ్యం ఏమిటంటే.. జూబ్లీహిల్స్ పెద్ద‌మ్మ గుడి ద‌స‌రా ఉత్స‌వాలు. ఈ ఆల‌యం విష్ణు తండ్రి దివంగ‌త పీజేఆర్ మాన‌స పుత్రిక. పీజేఆర్ కుటుంబానికి కూడా త‌ర్వాతి కాలంలో అంతే అనుబంధం ఏర్ప‌డింది. ద‌స‌రా ఉత్స‌వాల‌కు క‌విత‌ను ఆహ్వానించేందుకే విష్ణు ఆమెను క‌లిశారు. కానీ, రాజ‌కీయ ప‌రిణామాల రీత్యా భిన్న‌మైన విశ్లేష‌ణ‌లు వ‌చ్చాయి.