Begin typing your search above and press return to search.

అమెరికాలో ఘోర ప్రమాదం.. పర్వతాలెక్కి తిరిగిరాని లోకాలకు భారతీయ ఇంజినీర్

ఈ ప్రమాదంలో త్సేలిఖ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైనప్పటికీ, అతడు సుమారు 64 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి అధికారులకు ప్రమాదం గురించి తెలియజేశాడు.

By:  Tupaki Desk   |   15 May 2025 6:52 PM IST
అమెరికాలో ఘోర ప్రమాదం.. పర్వతాలెక్కి తిరిగిరాని లోకాలకు భారతీయ ఇంజినీర్
X

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. నార్త్ క్యాస్కేడ్స్ పర్వత శ్రేణిలో సాహస యాత్రకు వెళ్లిన నలుగురు సభ్యుల బృందం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో భారత సంతతికి చెందిన 48 ఏళ్ల విష్ణు ఇరిగిరెడ్డితో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ప్రాణాలతో బయటపడిన మరొక యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ వార్త సియాటెల్‌లోని భారతీయ సమాజంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సియాటెల్‌కు చెందిన విష్ణు ఇరిగిరెడ్డి అక్కడి ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ 'ఫ్లూక్ కార్పొరేషన్'లో ఇంజినీరింగ్ విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆయన తన ముగ్గురు స్నేహితులు టిమ్ న్గుయెన్ (63), ఒలెక్సాండర్ మార్టినెంకో (36), ఆంటన్ త్సేలిక్‌లతో (38) కలిసి నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్స్ ప్రాంతంలో పర్వతారోహణకు వెళ్లారు. వారు పైకి ఎక్కుతుండగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తుఫాను వస్తుందని గ్రహించిన వారు వెంటనే వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నారు. కానీ విధి మరోలా తలచింది. వారు కిందకు దిగుతున్న సమయంలో వారి సేఫ్టీ త్రెడ్ (యాంకర్ పాయింట్) ఒక్కసారిగా తెగిపోవడంతో దాదాపు 200 అడుగుల లోతులో పడిపోయారు.

ఈ ప్రమాదంలో త్సేలిఖ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైనప్పటికీ, అతడు సుమారు 64 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి అధికారులకు ప్రమాదం గురించి తెలియజేశాడు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు హెలికాప్టర్ల సహాయంతో మృతదేహాలను వెలికి తీశాయి. గాయపడిన త్సేలిఖ్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతనికి అంతర్గత రక్తస్రావం, మెదడుకు గాయాలైనట్లు వైద్యులు తెలిపారు.

భారత్‌కు చెందిన విష్ణు ఇరిగిరెడ్డి సియాటెల్‌లో స్థిరపడ్డారు. ఆయన గ్రేటర్ సియాటెల్‌లో ఒక పేరుగాంచిన టెక్ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అంతేకాకుండా స్థానికంగా జరిగే అనేక కార్యక్రమాల్లో ఆయన చురుకుగా పాల్గొనేవారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విష్ణు పనిచేస్తున్న ఫ్లూక్ కార్పొరేషన్ కూడా ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఒక గొప్ప టీమ్ లీడర్‌ అని, ఆయన మరణం సంస్థకు తీరని లోటని పేర్కొంది.