ఆలయంలో జరిగే ప్రోగ్రాంకు వచ్చి స్ప్రహ తప్పిన హీరో విశాల్
తాజాగా ఒక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన విశాల్ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అసలేమైంది? అన్న వివరాల్లోకి వెళితే..
By: Tupaki Desk | 12 May 2025 5:08 AMతమిళ సినీ నటుడు విశాల్ అనారోగ్యానికి గురయ్యారు. దేవాలయంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన.. ఉన్నట్లుండి ఒక్కసారిగా వేదికపై స్ప్రహ తప్పి పడిపోవటంతో కలకలం రేగింది. ఆ వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యంపై పలు వార్తలు వస్తున్న వేళ.. తాజాగా ఒక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన విశాల్ ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అసలేమైంది? అన్న వివరాల్లోకి వెళితే..
తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని కూవాగంలోని కూత్తాండవర్ ఆలయంలో చిత్తిరై వేడుకల్్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి ట్రాన్స్ జెండర్లకు మిస్ కూవాగం 2025 పోటీల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో విశాల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా విశాల్ స్ప్రహ తప్పి పడిపోయారు. దీంతో అక్కడి వారిలో ఆందోళన నెలకొంది.
వెంటనే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే.. ఆయన ఆహారం తినకపోవటం వల్లే నీరసానికి గురై.. స్ప్రహ తప్పినట్లుగా తెలుస్తోంది. అక్కడే ఉన్న తమిళనాడు మాజీ మంత్రి పొన్ముడి ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేశారు. దీంతో విశాల్ కోలుకున్నారు. అరగంట తర్వాత తిరిగి కార్యక్రమానికి హాజరు కావటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవల మదగజ రాజా సినిమా ప్రమోషన్స్ లోనూ విశాల్ నీరసంగా కనిపించటం.. దానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో విశాల్ ఆరోగ్యానికి ఏమైంది? అన్న ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. ఆ రోజు తీవ్రమైన జ్వరంతో విశాల్ బాధ పడుతున్నారని.. అందుకే అలా ఉన్నారే తప్పించి..ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని ఆయనటీం స్పష్టం చేసింది. తాజాగా మరోసారి అనారోగ్యానికి గురి కావటం హాట్ టాపిక్ గా మారింది.