Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ... కాంబోడియాలో తెలుగు యువత నరకయాతన!

ఈ సమయంలో... కొంతమందికి ఆశించిన స్థాయిలో అవకాశాలు దొరగ్గా... మరికొంతమంది మాత్రం ఏజెంట్ల చేతుల్లో మోసపోయి చిత్రవద అనుభవిస్తుంటారు

By:  Tupaki Desk   |   19 May 2024 12:30 PM GMT
వైరల్ ఇష్యూ... కాంబోడియాలో తెలుగు యువత నరకయాతన!
X

స్వదేశంలో ఎలాగూ ఆశించిన స్థాయిలో సంపాదన లేదు అనో.. కోరుకున్న ఉద్యోగాలు రావడం లేదనో.. మరో కారణంతోనో చాలామంది యువత విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో... కొంతమందికి ఆశించిన స్థాయిలో అవకాశాలు దొరగ్గా... మరికొంతమంది మాత్రం ఏజెంట్ల చేతుల్లో మోసపోయి చిత్రవద అనుభవిస్తుంటారు. తాజాగా అలాంటి ఘటన తెరపైకి వచ్చింది.

అవును... మంచి ఉద్యోగం సంపాదించి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఆశతో చాలా మంది యువత పలువురు ఏజెంట్ల మాటలు నమ్మి విదేశాలకు వెళ్తుంటారు. అలా వెళ్లిన కొంతమంది విశాఖకు చెందిన యువకులు సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారని తెలుస్తుంది. ఈ సమయంలో వారు పెట్టే నరకయాతన అనుభవిస్తూ మగ్గిపోతున్నారని అంటున్నారు. తాజాగా పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాళ్లోకి వెళ్తే... కాంబోడియాలోని చైనా దేశీయుల గుప్పిట్లో బలైపోతున్న విశాఖ యువకుల కష్టాలు పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఆ దుర్మార్గుల బారి నుంచి తప్పించుకొన్న ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వివరాలు రాబట్టారు. ఈ క్రమంలో విశాఖ నగరం నుంచి వెళ్లిన సుమారు 150 మంది ఆ క్రూరుల బారినపడినట్లు భావిస్తున్నారు. బాధితుల్లో మహిళలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ విషయాలపై స్పందించిన విశాఖ పోలీసులు... ఆకర్షణీయ జీతం, ఏసీ గదుల్లో కంప్యూటర్‌ ముందు కూర్చుని పనిచేయటమే, పైగా బ్యాంకాక్ లో కొలువు అనే తీయని మాటలు నమ్మిన నిరుద్యోగులు లక్ష నుంచి లక్షన్నర రూపాయలు చెల్లించి మోసపోయారని చెబుతున్నారు. ఈ క్రమంలో డబ్బులు చెల్లించిన అనంతరం జిల్లా నుంచి నుంచి నిరుద్యోగులను ముందుగా బ్యాంకాక్‌ తీసుకువెళతారట ఏజెంట్లు.

ఈ సమయంలోనే బాధితులకు విమాన టికెట్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, హోటల్‌ బుకింగ్, పాస్ పోర్టు సదుపాయాలతోపాటు కొంత నగదు సమకూరుస్తారట. అనంతరం వీరిని బ్యాంకాక్‌ లో ఏజెంట్లకు అప్పగించేస్తారట. అక్కడ మరో ట్రావెల్ ఏజెంట్ వీరిని కాంబోడియాలోని చైనా సంస్థలకు అప్పగిస్తారట. అక్కడ వీరి ఏడాది పాటు అగ్రిమెంట్ చేయాల్సి ఉంటుంది. తిరిగి వెళ్లాలంటే ఆ అగ్రిమెంట్ ప్రకారం 400 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది.

ఆ సంతకాలు చేసిన అనంతరం అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. నిరుద్యోగులను కాంబోడియాలోని చైనా కంపెనీ ప్రతినిధులు తమ వెంట తీసుకువెళ్లి ముందుగా చీకటి గదుల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేస్తారట.. చెప్పినట్లు వినకపోతే కనీసం నీరు, భోజనం అందించకుండా ఇబ్బందులకు గురిచేసి.. చివరికి చెప్పినట్లు చేస్తామనే స్థాయికి తెస్తారని అంటున్నారు. అలా దారికి వచ్చిన వారికి శిక్షణ ఇచ్చి ఇండియన్స్ లక్ష్యంగా సైబర్‌ మోసాల వల విసురుతారట.

ఈ సమయంలో వీరి నైపుణ్యం ప్రకారం దోచిన సొమ్ములో ఒక శాతం మాత్రమే కమీషన్‌ గా ఇస్తారని చెబుతున్నారు. ఈ సమయంలో వారు చెప్పిన రీతిలో సైబర్‌ మోసాలకు పాల్పడితేనే భోజనం పెడతారట. మరోవైపు... ఈ క్రమంలో పలు రకాల వ్యసనాలకు బానిసలుగా మార్చేస్తారట. ఈ క్రమంలోనే... భారతీయుల ద్వారానే భారతీయులను మోసం చేస్తున్నారత. పొరపాటున ఒక్కసారి వీరి వలలో చిక్కితే బయటకు రావటం కష్టమని పోలీసులు చెబుతున్నారు.

బాధితుల్లో ప్రధానంగా ఉత్తరాంధ్ర, అనంతపురం ప్రాంతాలకు చెందినవారితో పాటు తెలంగాణ, కోల్‌ కతాకు చెందిన బాధితులు పెద్ద సంఖ్యలో కాంబోడియాలో ఉన్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారని తెలుస్తుంది. ఈ సమయంలో ఎవరైనా ఇలాంటి ఏజెంట్ల చేతిలో ఈ తరహాలో మోసపోతే, వెంటనే "+91 9490617917" ఫోన్‌ నెంబరుకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు.