Begin typing your search above and press return to search.

ప్రపంచ కప్ పోయింది.. మన వైజాగ్ పిలుస్తోంది టి20లకు

ఎన్నో ఆశలు పెట్టుకున్న వన్డే ప్రపంచ కప్ చేజారింది. టీమిండియా ప్రపంచ విజేతగా నిలుస్తుందనే కచ్చితమైన అంచనా తప్పింది

By:  Tupaki Desk   |   22 Nov 2023 2:30 AM GMT
ప్రపంచ కప్ పోయింది.. మన వైజాగ్ పిలుస్తోంది టి20లకు
X

ఎన్నో ఆశలు పెట్టుకున్న వన్డే ప్రపంచ కప్ చేజారింది. టీమిండియా ప్రపంచ విజేతగా నిలుస్తుందనే కచ్చితమైన అంచనా తప్పింది. మరో నాలుగేళ్లకు గాని వన్డే ప్రపంచ కప్ రాదు. ఇప్పటికే 12 ఏళ్లుగా మన జట్టుకు ప్రపంచ చాంపియన్ హోదా లేదు. 2013 నాటి చాంపియన్స్ ట్రోఫీ ఫైనలే మనకు దక్కిన ఆఖరి ఐసీసీ ట్రోఫీ. ఇప్పుడిక వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచ కప్ మీదనే ఫోకస్. అందులోనూ మన జట్టు 2007 తర్వాత టి20 కప్ కొట్టనేలేదు. అంటే.. వచ్చే ఏడాది పొట్టి ఫార్మాట్ లో విజేతగా నిలిచి 17 ఏళ్లు అవుతుందన్నమాట.

బాధను దిగమింగుదాం..

ప్రస్తుత విషయానికి వస్తే.. ఇటీవలి ప్రపంచ కప్ ఫైనల్ పరాజయం ఇప్పుడప్పట్లో మర్చిపోలేం. మనకిక తిరుగులేదు.. కప్ కొట్టేస్తాం అనుకుంటుండగా.. ఆస్ట్రేలియా గద్దలా ఎగరేసుకుపోయింది. లీగ్ దశలో భారత్ చేతిలో ఓడిపోయిన ఆసీస్.. ఫైనల్లోనూ ప్రతిఘటించదని భావిస్తే విరుద్ధంగా జరిగింది. అయితే, క్రికెట్ అన్నాక గెలుపోటములు సహజం. అన్నిటినీ దిగమింగుకుని ముందుకెళ్లాలి. ఈ క్రమంలోనే మనకు ఓదార్పు ఇవ్వనుంది టి20 సిరీస్.

ప్రతీకారం తీర్చుకుందాం..

వన్డే ప్రపంచ కప్ ఫైనల్ పరాజయానికి బదులు తీర్చుకునే అవకాశం టి20 సిరీస్ రూపంలో దక్కనుంది. ఆస్ట్రేలియాతోనే ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ జరగనుంది. వైజాగ్ వేదికగా గురువారం తొలి టి20 మ్యాచ్ జరగనుంది. సోమవారం ప్రకటించిన జట్టులో హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మకు చోటుదక్కింది. కాగా, ఈ నెల 26న తిరువనంతపుంలో రెండో టి20, 28న గువాహటిలో మూడోది, నాగపూర్ లో నాలుగో మ్యాచ్ జరగనున్నాయి.

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మ్యాచ్

వాస్తవానికి భారత్-ఆసీస్ ఐదు టి20ల సిరీస్ లో చివరి మ్యాచ్ కు హైదరాబాద్ ఉప్పల్ మైదానం ఆతిథ్యం ఇవ్వాల్సింది. ప్రపంచ కప్ లో తెలుగు రాష్ట్రాల్లోని ఒక్క మైదానానికీ మ్యాచ్ రాకపోవడంతో విమర్శలు వచ్చాయి. దానికి జవాబుగా విశాఖపట్టణం, హైదరాబాద్ లకు టి20లు కేటాయించారు. అయితే, డిసెంబరు 3న హైదరాబాద్ లో ఆసీస్ తో చివరి టి20 జరగాల్సిన రోజునే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. అటు మ్యాచ్, ఇటు ఎన్నికల ఫలితాల సందర్భంగా బందోబస్తు ఇబ్బంది అవుతుందని పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరి టి20ని బెంగళూరుకు మార్చారు.

బాదేసి బాధను దాటేద్దాం..

ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా సెప్టెంబరు చివర్లో భారత్ కు వచ్చింది. అంతకుముందు దక్షిణాఫ్రికాతో ఐదు వన్డేల సిరీస్ ఆడింది. మొత్తం రెండు నెలల పైగా స్వదేశానికి దూరంగా ఉంది. ఇప్పుడు డిసెంబరు 5 వరకు భారత్ లోనే ఉండనుంది. అయితే ,ప్రపంచ చాంపియన్ గా నిలిచి హోం సిక్ ను పోగొట్టుకుంది. మరోవైపు టీమిండియా ప్రపంచ కప్ పరాజయానికి బదులుగా ఆసీస్ ను టి20 సిరీస్ లో ఓడిస్తే లెక్క సరి అవుతుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టు ధనాధన్ బాదేసి బాధను దాటేస్తుందని ఆశిద్దాం.