Begin typing your search above and press return to search.

అచ్చం ఖైదీ నంబర్ 150 సినిమాలో సీన్ రిపీట్ !

కట్ చేస్తే అచ్చం అలాంటి సీన్ నే విశాఖ వాసులకు చూపించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ సీన్ రిపీట్ అయింది.

By:  Tupaki Desk   |   28 Jun 2025 2:21 PM IST
అచ్చం ఖైదీ నంబర్ 150 సినిమాలో సీన్ రిపీట్ !
X

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరువాత నటించిన మొదటి సినిమా ఖైదీ నంబర్ 150. ఈ సినిమా మొత్తం నీటి సమస్య మీద తిరుగుతుంది. అందులో పట్టణ ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు తెలియాలని చిరంజీవి పాత్రధారితో పాటు ఆయన బృందం అంతా పట్టణాలకు సరఫరా అయ్యే కుళాయి నీటి ట్యాంకులను బంద్ చేస్తూ అక్కడే తిష్ట వేస్తారు. దాంతో నగర వాసులు అల్లల్లాడిపోతారు.

కట్ చేస్తే అచ్చం అలాంటి సీన్ నే విశాఖ వాసులకు చూపించారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ సీన్ రిపీట్ అయింది. జీవీఎంసీ తాత్కాలిక కార్మికులుగా పనిచేస్తున్న వాటర్ విభాగం సిబ్బంది అంతా కలసి తమ డిమాండ్ల సాధన కోసం ఏకంగా 30 గంటలకు పైగా కుళాయి నీటి సరఫరాను బంద్ చేశారు. దాంతో నగరంలోని లక్షలాది మంది తాగు నీటికి కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విశాఖకు తాగునీరు అందించే జలాశయాలు ఏలేరు, తాటిపూడి, గంభీరం, రైవాడల నుంచి వచ్చే నీటిని జీవీఎంసీ వర్కర్లు పూర్తిగా నిలిపివేశారు. ఇక విశాఖలో ఏకంగా మూడు లక్షలకు పైగా కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. వాటితో పాటుగా ఆసుపత్రులకు పరిశ్రమలకు కూడా కుళాయి రాక మంచి నీరు నిలిచిపోయింది.

ఒక వైపు మోటార్లు ఉండి ఇతర అవసరాలకు ఇబ్బంది లేకపోయినా అత్యధిక శాతం కుళాయి నీటినే తాగునీటిగా ఉపయోగిస్తారు. దాంతో లక్షలాది మంది ప్రజానీకం మీద ఈ ప్రభావం పడింది. విశాఖలో ఉన్న పేదల వాడలు చిన్న తరహా ఇళ్ళలోని జనాలకు కుళాయి నీరే ఆధారం. దాంతో వారంతా గత రెండు రోజులుగా నీరు లేక రోడ్ల మీదకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేయడం కనిపించింది.

ఇలా గురువారం నుని శనివారం దాకా నీటిని బంద్ చేసిన జీవీఎంసీ వాటర్ వర్కర్స్ ఎట్టకేలకు దిగి వచ్చారు. వారి డిమాండ్ల విషయంలో మేయర్ స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. దాంతో సమ్మెని తాత్కాలికంగా విరమించినట్లుగా ప్రకటించారు.

మరో వైపు చూస్తే మొత్తానికి మొత్తం ట్యాంకర్లలో నీరు చుక్క కూడా లేకుండా ఎండిపోవడంతో వాటిని పూరితా నింపి నీటిని వదలాలంటే అది గంటలకు పైగా సమయం పడుతుంది అని అంటున్నారు. దాంతో శనివారం రాత్రికి కానీ విశాఖ వాసులు కుళాయి నీటిని చూడలేరు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే చిరంజీవి సినిమాలో జరిగినట్లుగానే నీటి కష్టాలు ఏమిటో విశాఖ ప్రజానీకం చూసింది అని అంటున్నారు. గతంలో ఎపుడు సమ్మెలు చేసినా నీటికి ఇబ్బందులు లేకుండా చూసుకునే వారు. ఎమర్జెన్సీ సేవలుగా వాటర్ సర్వీస్ ని ఉంచేవారు. కానీ ఇపుడు కార్మికులు నీటినే బంధించి సమ్మెను ఉధృతం చేయడంతో ఇదే తొలిసారి అనుభవమని అంతా అంటున్నారు.