విశాఖకు అద్భుత వరం
ఇక మూడవ అంతస్తుని టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దనున్నారు. ఇక్కడ నుంచి చూస్తే కనుక ఎదురుగా సముద్రం కనిపిస్తుంది.
By: Tupaki Desk | 3 May 2025 3:32 AMకేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం కలసి విశాఖకు అధ్బుత వరాన్ని ఇచ్చాయి. సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గడించిన వైజాగ్ లో ఎన్నో పరిశ్రమలు సంస్థలు ఉన్నాయి. ఇక కొత్తగా రావాల్సినవి కూడా వస్తున్నాయి. ఇప్పటికే విశాఖ సాగర తీరం వద్ద లులూ మార్ట్ వచ్చింది. ఇపుడు మరో మాల్ కి ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి వేదికగా శ్రీకారం చుట్టారు. యూనిటీ మాల్ గా దానిని విశాఖలో నిర్మిస్తున్నారు
విశాఖలో బీచ్ రోడ్డులో రుషికొండకు కిలోమీటర్ దూరంలో మధురవాడ కొండ వాలు ప్రాంతంలో ఈ యూనిటీ మాల్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అయిదు ఎకరాల భూమిని కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం 172 కోట్లను 50 ఏళ్ల కాలానికి వడ్డీ లేని రుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ కోసం మంజూరు చేస్తోంది. దాంతో విశాఖలో మరో అద్భుతమైన ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది ఇక ఈ ప్రాజెక్ట్ లో అనేక ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.
దీనిని జీ ప్లస్ 4 గా నిర్మించనున్నారు. ఇందులో మొదటి రెండు అంతస్తులలో ఏకంగా అరవై నుంచి అరవై అయిదు దాకా షాపులను ఏర్పాటు చేస్తున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరుతో ఆయా ప్రాంతాలకు ఉన్న భౌగోళిక గుర్తింపు కింద దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్పత్తుల అమ్మకాలను ఈ షాపులలో చేయనున్నారు.
ఇక మూడవ అంతస్తుని టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దనున్నారు. ఇక్కడ నుంచి చూస్తే కనుక ఎదురుగా సముద్రం కనిపిస్తుంది. అలా సీ వ్యూని ఏర్పాటు చేయనున్నారు . దాంతో విశాఖకు వచ్చే పర్యాటకులకు ఇది మరో కొత్త టూరిజం స్పాట్ గా ఉండబోతోంది.
ఆ మీదట నాలుగవ అంతస్తులో కన్వెన్షన్ హాల్, రెండు మినీ థియేటర్లని ఏర్పాటు చేయనున్నారు . అలాగే రిటైల్ స్టోర్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ ఔట్‌లెట్లు, వినోద సదుపాయాలు, ఫిట్‌నెస్ సెంటర్లు, బ్యాంకు శాఖలు, ఫర్నిచర్ స్టోర్లు ఇలా ఈనాటి జనరేషన్ కి ఏమి కావాలో అన్నీ అక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ఈ యూనిటీ మాల్ ని తీర్చిదిద్దనున్నారు. ఈ మాల్ పైన వచ్చే ఆదాయం ఆధారంగా కేంద్రం ఇచ్చిన రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా తీర్చేసి దానిని విశాఖకు శాశ్వత ఆస్తిగా మార్చనుంది.
ఈ యూనిటీ మాల్ కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయింది. 2026 మార్చి నాటికి యూనిటీ మాల్‌ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. దీంతో సిటీ ఆఫ్ డెసిటీకి ఇది మరో కలికితురాయి గా నిలవనుంది. అలా విశాఖలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ఇంకో అభివృద్ధిగా కూడా అంతా చూస్తున్నారు.