Begin typing your search above and press return to search.

విశాఖ రామానాయుడు స్టూడియోస్‌కి షోకాజ్.. కార‌ణ‌మిదే

అయితే ఈ భూమిలో 15.17 ఎకరాలలో నివాస స్థ‌లాల‌ లేఅవుట్ కోసం అనుమతి పొందేందుకు వైకాపా ప్ర‌భుత్వ హ‌యాంలో ప్రయత్నించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

By:  Tupaki Desk   |   3 April 2025 10:01 PM IST
విశాఖ రామానాయుడు స్టూడియోస్‌కి షోకాజ్.. కార‌ణ‌మిదే
X

విశాఖ‌లో సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి ధ్యేయంగా, వైజాగ్ రామానాయుడు స్టూడియోస్ కోసం 34.44 ఎక‌రాల భూమిని నాటి ప్ర‌భుత్వాలు కేటాయించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ స్టూడియోలో షూటింగులు జ‌రుగుతున్నాయి. అయితే ఈ భూమిలో 15.17 ఎకరాలలో నివాస స్థ‌లాల‌ లేఅవుట్ కోసం అనుమతి పొందేందుకు వైకాపా ప్ర‌భుత్వ హ‌యాంలో ప్రయత్నించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. సురేష్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

స్టూడియో కోసం ఇచ్చిన భూమిని కేవ‌లం సంబంధిత ప్ర‌యోజ‌నాల‌కు మాత్ర‌మే ఉప‌యోగించాల్సి ఉండ‌గా, నివాస స్థ‌లాలుగా మార్చ‌డం కుద‌ర‌దంటూ విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌.పి.ఎల్‌) దాఖలు చేశారు. ఫిబ్ర‌వ‌రిలో జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వులలో స్టూడియో కోసం కేటాయించిన‌ భూమిని మరే ఇతర ప్రయోజనాలకు ఉపయోగించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్.పి. సిసోడియా ఏప్రిల్ 3న ఆదేశాలు జారీ చేస్తూ విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను 15.17 ఎకరాల భూమికి సంబంధించి అన్యాక్రాంతదారునికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ తన వాదనను వినిపించడానికి ఈ కేసులో అవ‌కాశం క‌ల్పించారు.

సురేష్ ప్రొడక్షన్ ప్రై. లిమిటెడ్ నుండి భూవినియోగంలో మార్పులు కోరుతూ వచ్చిన ఎటువంటి దరఖాస్తులను స్వీకరించవద్దని విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డిఏ) కమిషనర్, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కమిషనర్‌లను ఆదేశించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా వారు ఎలాంటి మార్ప‌లు చేసినా అది చ‌ట్ట‌బ‌ద్ధం కాద‌ని పేర్కొన్నారు.