ఉత్తరాంధ్ర కల సాకారం...రైల్వే జోన్ కూత స్టార్ట్ !
ఉత్తరాంధ్రా వాసుల కలకు కచ్చితంగా 55 ఏళ్ళు. అలాంటి సుదీర్ఘమైన కల నిజం అవుతోంది. జూన్ 1 నుంచి అధికారికంగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ తన కార్యకలాపాలను ప్రారంభించుకోబోతోంది.
By: Satya P | 1 Jun 2026 9:45 AM ISTఉత్తరాంధ్రా వాసుల కలకు కచ్చితంగా 55 ఏళ్ళు. అలాంటి సుదీర్ఘమైన కల నిజం అవుతోంది. జూన్ 1 నుంచి అధికారికంగా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ తన కార్యకలాపాలను ప్రారంభించుకోబోతోంది. ఇప్పటిదాకా తూర్పు కోస్తాలో ఉన్న విశాఖ ఇపుడు తానే ఒక జోన్ కి కేంద్రంగా మారుతోంది. ఇది నిజంగా విశాఖ సహా ఉత్తరాంధ్ర చరిత్రలో సరికొత్త అభివృద్ధి విప్లవంగా అంతా భావిస్తున్నారు.
మొదటిసారి డిమాండ్ :
విశాఖకు రైల్వే జోన్ కావాలని 1970 ప్రాంతంలో విశాఖ నుంచి లోక్ సభ సభ్యుడిగా ఉన్న తెన్నేటి విశ్వనాధం పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. అప్పటికే విశాఖలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. అంతే కాదు భవిష్యత్తు నగరంగా ఒక బలమైన ముద్ర ఉంది. ఇవన్నీ ఊహించిన తెన్నేటి విశాఖకు జోన్ ఇవ్వాలని లోక్ సభలో గట్టిగా నినదించారు. అలా మొదటి డిమాండ్ రైల్వే జోన్ మీద వచ్చింది. ఇక ఆ మీదట తరచూ ఎవరో ఒకరు పార్లమెంట్ లో ఈ ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. అయితే 1996 తరువాత దేశ రాజకీయాలు పూర్తిగా సంకీర్ణం వైపుగా మారాయి. ఆ సమయంలో ఉత్తరాదిన అనేక చోట్ల కొత్తగా జోన్లు ప్రకటించారు. దాంతో విశాఖ రైల్వే జోన్ కోసం ప్రతిపాదన మరింత గట్టిగా ఆనాడు వినిపించింది. అది మెల్లగా ఒక ఉద్యమ రూపం కూడా తీసుకుంది.
జాప్యం జరుగుతూనే ఉంది :
అయితే యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఆనక వాజ్ పేయి ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం ఇలా 2014 దాకా ప్రభుత్వాలు సాగాయి, జోన్ డిమాండ్ వినిపిస్తూనే ఉంది. జాప్యం జరుగుతూనే ఉంది. మొత్తానికి విభజన చట్టంలో విశాఖ రైల్వే జోన్ గురించి పెట్టారు. అయినా అది ఒక జీవో గా రావడానికి 2019 అయింది. ఆ మీదట కూడా పెద్దగా అడుగు పడలేదు.తిరిగి 2024 లో కూటమి ప్రభుత్వం ఏపీలో ఏర్పాటు అయ్యాక జోన్ కదలిక వేగం పుంజుకుంది. దాంతో జోన్ కోసం శాశ్వత భవనాలకి 2025 జనవరి 8న ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఆ తరువాత జోన్ కి సంబంధించి అధికారిక ప్రకటన రావడానికి ఏణ్ణర్థం సమయం పట్టింది. ఎట్టకేలకు విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు అయింది.
ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి ఊతం :
ఇదిల ఉంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో పరిపాలనా వికేంద్రీకరణకు బలమైన పునాది పడటమే కాకుండా రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ,కొత్త ప్రాజెక్టుల అమలు, సరకు రవాణా సామర్థ్యాల పెంపు, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణకు విస్తృత అవకాశాలు ఏర్పడనున్నాయి. విశాఖపట్నాన్ని దేశంలోని ప్రముఖ రవాణా, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దే ప్రక్రియలో రైల్వే జోన్ కీలక పాత్ర పోషించనుంది. మరో వైపు చూస్తే స్థానిక యువతకు మరింత ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం కోరుతోంది. భవిష్యత్తులో విశాఖ కేంద్రంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టు రూపుదిద్దుకునే అవకాశాలపై కేంద్ర రైల్వే శాఖ చేసిన ప్రకటన సైతం ఉత్తరాంధ్ర ప్రజలలో కొత్త ఆశలను నింపుతోంది.
