సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోల్ కొడతారుట !
వాహనాల కాలుష్యం వల్ల విశాఖ ఎంతగానో నష్టపోతోందని అనేక రకాలైన వ్యాధులు ప్రబలుతున్నాయని అందువల్ల వీలైనంతవరకూ తగ్గించాలని పోలీసులు అంటున్నారు.
By: Satya P | 5 Feb 2026 9:38 AM ISTవిశాఖలో చూస్తే కాలుష్యం పెరిగిపోతోంది. గాలి నాణ్యతలో తేడా బాగా కనిపిస్తోంది. దాంతో కాలుష్యం కోరలలో చిక్కుకున్న నగరాల జాబితాలో విశాఖ కూడా చేరిపోయింది. ఈ పరిస్థితి మీద తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాలుష్యం తగ్గించడానికి ఏమి చేయాలి అన్న దాని మీద కూడా అంతా కలిసి చర్చిస్తున్నారు. అనుకున్న ఫలితాలు రావాలీ అంటే కఠినంగా వ్యవహరించక తప్పదని అంటున్నారు.
పొల్యూషన్ సర్టిఫికేట్ తో :
విశాఖలో కాలుష్యం వివిధ రకాలుగా వ్యాప్తి చెందుతోంది.రసాయన పరిశ్రమల వల్ల వెదజల్లే కాలుష్యం పెద్ద స్థాయిలో ఉంటోంది. దాంతో పాటుగా ట్రాఫిక్ భారీగా ఉండటం వల్ల వచ్చే కాలుష్యం అదే మోతాదులో ఉంటోంది. కాలుష్య పరిశ్రమల సంగతి సంబంధిత శాఖలు చూస్తాయి. ట్రాఫిక్ వల్ల తలెత్తే కాలుష్యానికి విశాఖ పోలీసు విభాగం కఠిన చర్యలకు దిగుతోంది. దీని కోసం అన్ని రకాలైన వాహనాలకు నో పొల్యూషన్ సర్టిఫికెట్ కోరుతోంది. ఆ సర్టిఫికేట్ ఉంటేనే తప్ప పెట్రోల్ బంకులలో పెట్రోల్ కొట్టవద్దని బంక్ యజమానులను కూడా ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.
అవగాహన కార్యక్రమాలతో :
వాహనాల కాలుష్యం వల్ల విశాఖ ఎంతగానో నష్టపోతోందని అనేక రకాలైన వ్యాధులు ప్రబలుతున్నాయని అందువల్ల వీలైనంతవరకూ తగ్గించాలని పోలీసులు అంటున్నారు. అందుకే నో పొల్యూషన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని వాహన దారులకు సూచిస్తున్నారు. అలా లేకపోతే పెట్రోల్ కొట్టరని అంతే కాదు ట్రాఫిక్ పోలీసులు చేసే తనిఖీలలో కూడా ఈ సర్టిఫికేట్ చూపించకపోతే 1530 రూపాయలను అపరాధ రుసుముగా వేస్తామని హెచ్చరిస్తున్నారు. కాలుష్యం విశాఖలో పెద్ద ఎత్తున పెరుగుతోందని ఈ నేపథ్యంలో వాహనదారులు అంతా సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.
పవన్ హెచ్చరిక :
మరో వైపు ఇటీవల నగరానికి వచ్చిన పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ కాలుష్య కారక పరిశ్రమల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ విషయంలో రెండవ ఆలోచన ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో కాలుష్యం ప్రమాదం ఎక్కువగా ఉందని అన్నారు. పరిశ్రమలు రావాల్సిందే అదే సమయంలో కాలుష్యం కూడా పెరగకుండా బాలెన్స్ చేసుకోవాలని అన్నారు అధికారులు కూడా నిబద్ధతతో పనిచేయాలని పారిశ్రామికవేత్తలు కూడా తమ సంస్థలలో కాలుష్యం పెరగకుండా ముందే జాగ్రత్తలు తీసుకుని సమాజ హితానికి సహకరించాలని పవన్ కోరారు.
