Begin typing your search above and press return to search.

రైల్వే జోన్ వచ్చేసినట్లేనా....ఇంకా డౌట్లున్నాయా ?

విశాఖకు రైల్వే జోన్ వచ్చేసినట్లేనా అంటే ఇంకా కొన్ని ఉన్నాయని విపక్షాలు అంటూనే ఉంటాయి.

By:  Tupaki Desk   |   7 Jun 2025 9:25 AM IST
రైల్వే జోన్ వచ్చేసినట్లేనా....ఇంకా డౌట్లున్నాయా ?
X

విశాఖకు రైల్వే జోన్ వచ్చేసినట్లేనా అంటే ఇంకా కొన్ని ఉన్నాయని విపక్షాలు అంటూనే ఉంటాయి. అయితే ఎపుడో 2014 లో ఉమ్మడి ఏపీ విభజన హామీలలో పెట్టిన రైల్వే జోన్ అది. ఇక బీజేపీ తాము అధికారంలోకి వస్తే విశాఖకు జోన్ ఇస్తామని చెప్పి ఉంది. కానీ అది కాస్తా ఒక ప్రకటన రూపంలో రావడానికి 2019 దాకా సమయం తీసుకుంది. అయితే వైసీపీ అధికారంలో ఉన్న అయిదేళ్ళ కాలంలో కూడా రైల్వే జోన్ కి ఏ మాత్రం అడుగులు పడలేదు.

భూములు అవసరమైనవి ఇవ్వలేదని కేంద్ర రైల్వే శాఖ చెబితే తాము భూములు ఇచ్చామని వైసీపీ నేతలు నాడు చెప్పారు. ఇలా వాదనలు ప్రతివాదనలు జరిగాయి కానీ జోన్ కూత మాత్రం పెట్టలేదు. ఇక 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాకనే రైల్వే జోన్ స్పీడ్ అందుకుంది. విశాఖలోని ముడసర్లోవ వద్ద భూములను రైల్వే జోన్ భవనాల కోసం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

ఇది జరిగి నెలలు గడచినా కూడా రైల్వే జోన్ విషయంలో ఇంకా కదలిక రాలేదు. మళ్ళీ కధ మొదటికి వచ్చిందా అని అంతా అనుకుంటున్న వేళ అది కాదు అన్నట్లుగా మరో కీలక అడుగు పడింది. విశాఖ రైల్వే జోన్ కి జనరల్ మేనేజర్ పోస్టుని ఏర్పాటు చేస్తూ సందీప్ మాధుర్ ని కేంద్రం నియమించింది. దీంతో జనవరి 8న మోడీ విశాఖ వచ్చి రైల్వే జోన్ కి శంకుస్థాపన చేసిన అయిదు నెలలకు పట్టాలెక్కిందని అంటున్నారు.

అయితే రైల్వే జోన్ విశాఖ వచ్చేసింది అనుకోవచ్చా జోరుగా పరుగులు పెడుతుందా అంటే ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయని అంటున్నారు అవేంటి అంటే కొత్త రైల్వే జోన్ ఎప్పటి నుంచి ప్రారంభిస్తుందో తెలిపే గెజిట్ ని ప్రకటించాలని లోక్ సత్తా నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి విశాఖ రైల్వే జోన్ తన అధికార కార్యకలాపాలు ప్రారంభించేలా కేంద్ర రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇంతకీ ఈ గెజిట్ ఎందుకు ప్రకటించాలి దీని వల్ల రైల్వే జోన్ ఏ విధంగా పరుగులు తీస్తుంది అంటే చాలానే ఉంది అని అంటున్నారు. విశాఖలో రైల్వే జోన్ అని గెజిట్ ని విడుదల చేసి కేంద్ర రైల్వే శాఖ కార్యాచరణ ప్రకటిస్తే కేవలం జనరల్ మేనేజర్ మాత్రమే జోన్ కి ఉండరు, ఆయనతో పాటు సహాయ జీఎం కూడా వస్తారు. అలాగే మరో పది విభాగాలు వస్తాయి. వాటికి ప్రిన్సిపల్ హెచ్ఓడీలు వస్తారు. వీరితో పాటు మరో 170 మంది దాకా అధికారులు వస్తారు.

వీరందరి నియామకం జరిపించిన తరువాతనే విశాఖ నుంచి రైల్వే జోన్ పరిపాలన మొదలైంది అని అంతా అధికారికంగా అనుకోవచ్చు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జీఎం నియామకానికి అయిదు నెలలు పట్టింది, మిగిలిన అధికారులు కీలక విభాగాలు వచ్చి పాలన మొదలవడానికి ఎంత సమయం పడుతుందో చూడాలని అంటున్నారు. సాధ్యమైనంత వేగంగా పాలనను విశాఖ రైల్వే జోన్ కేంద్రంగా మొదలు పెట్టాలని అంతా కోరుతున్నారు.