Begin typing your search above and press return to search.

రెండేళ్ల క్రితం ప్రేమపెళ్లి.. ప్రసవ వేళలో గొంతు నులిమి హత్య

విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. మనసంతా చేదుగా మారేలా చేస్తుంది ఈ ఉదంతం.

By:  Tupaki Desk   |   15 April 2025 11:00 AM IST
Man Murders Pregnant Wife Days Before Delivery
X

విన్నంతనే ఉలిక్కిపడటమే కాదు.. మనసంతా చేదుగా మారేలా చేస్తుంది ఈ ఉదంతం. మనుషుల మీద.. మానవ సంబంధాల మీదా నమ్మకం తగ్గేలా చేసే ఈ తరహా ఉదంతాలకు కారణమైన వారిని కనివినీ ఎరుగని రీతిలో శిక్షించాల్సిన అవసరం ఉంది. కేవలం తమ స్వార్థం కోసం నిండు ప్రాణాల్ని బలి తీసుకునే ఇలాంటి వారిని ఊరికే క్షమించకూడదు. విశాఖపట్నంలో చోటు చేసుకున్న ఈ దారుణ హత్య.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. విశాఖలోని మధురవాడలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే..

దువ్వాడకు చెందిన జ్ఞానేశ్వర్.. అనూషలు దంపతులు. రెండేళ్ల క్రితం వారు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కలిసి విశాఖలోని మధురవాడలోని ఒక అపార్టుమెంట్ లో నివసిస్తున్నారు. వేర్వేరు కులాలకు చెందిన వారు 2022లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అనూష తల్లికి కంటిచూపు లేదు. తండ్రి ఇటీవల చనిపోయారు. ప్రస్తుతం విశాఖలో రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను నడుపుతున్న జ్ఞానేశ్వర్.. తాను పెళ్లి చేసుకున్న విషయాన్ని తన ఇంట్లో చెప్పలేదు. రహస్యంగా ఉంచేసేవాడు.

పెళ్లైంది కదా.. మీ ఇంటికి వెళదామని చెబితే.. ఏదో ఒకటి చెప్పి తప్పించేవాడే కానీ.. తీసుకెళ్లేవాడు కాదు. ఇదిలా ఉండగా.. కొద్దికాలం క్రితం తాను క్యాన్సర్ బారిన పడ్డానని.. తనను వదిలేసి వేరే వారిని పెళ్లి చేసుకోవాలంటూ నాటకం ఆడాడు. అయితే.. చావు అయినా బతుకైనా అతడితోనే అంటూ తేల్చి చెప్పటంతో కామ్ గా ఉండిపోయాడు. ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు.

ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఏదో ఒక అంశంపై మాటల యుద్ధం జరిగేది. నిండు గర్భిణిగా ఉన్న అనూషకు డెలివరీ డేట్ ఇచ్చేశారు. సోమవారం ఆమెను ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంది. దీంతో.. ఆసుపత్రిలో సాయంగా ఉండేందుకు అనూష తన అమ్మమ్మను రెండు రోజుల క్రితం ఇంటికి పిలిపించింది. ఆదివారం రాత్రి భర్తతోనే కలిసి పడుకుంది. ఇదే అదనుగా భావించిన జ్ఞానేశ్వర్.. తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్యను పీక నులిమి చంపేశాడు. ఏమీ ఎరగనట్లుగా ఉండిపోయాడు.

తెల్లారిపోయినా నిద్రపోతున్న మనమరాలిని లేపే ప్రయత్నం చేసింది అనూష అమ్మమ్మ. ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో కంగారుపడ్డ ఆమె.. జ్ఞానేశ్వర్ కు చెప్పగా.. ఆందోళనను నటిస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు స్పష్టం చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా.. అసలు దుర్మార్గాన్ని చెప్పేశాడు. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లాడిన అనూషను వదిలించుకోవటానికి ఈ నాటకం ఆడినట్లుగా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఒప్పుకున్నాడు. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. డెలివరీకి రోజుల ముందు ఇంత దారుణానికి పాల్పడటమా? అంటూ విస్మయానికి గురవుతున్న పరిస్థితి.