ఎమ్మెల్యేగా లోకేశ్ తోడల్లుడు..? విశాఖ రాజకీయాల్లో కీలక చర్చ
యువ నేత, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ పార్లమెంటు సభ్యుడు శ్రీభరత్ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 31 Dec 2025 10:00 PM ISTయువ నేత, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ పార్లమెంటు సభ్యుడు శ్రీభరత్ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. విశాఖ ఎంపీగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న భరత్ వచ్చేసారి అసెంబ్లీకి మారతారంటూ కొన్నాళ్లుగా ప్రచారం మొదలైంది. గత ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచిన శ్రీభరత్ వచ్చేసారి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని విస్తృతంగా చర్చించుకుంటున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం ఈ ప్రచారాన్ని స్వాగతించారు. ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే తాను తప్పుకుంటానని ప్రకటించడం జిల్లా రాజకీయాల్లో సంచలనమైంది.
కొద్దిరోజులుగా ఈ ప్రచారం విస్తృతంగా సాగుతుండటంతో ఎంపీ శ్రీభరత్ స్పందించారు. తాను పార్లమెంటు సభ్యుడిగానే కొనసాగాలని కోరుకుంటున్నట్లు స్పష్టత ఇచ్చారు. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపడేశారు. గీతం వర్సిటీకి ప్రెసిడెంటుగా ఉన్న తాను ఎమ్మెల్యే పదవికి న్యాయం చేయలేనని వ్యాఖ్యానించారు. ఇప్పుడు, ఎప్పుడు ఎంపీగానే ఉంటానని శ్రీభరత్ చేసిన వ్యాఖ్యలతో భీమిలి సీటుపై ఇన్నాళ్లు జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లైందని అంటున్నారు.
మంత్రి లోకేశ్ కు స్వయాన తోడల్లుడు. బాలయ్య చిన్న అల్లుడు శ్రీభరత్ గత ఎన్నికల్లో విశాఖ నుంచి రికార్డు స్థాయి మెజార్టీతో ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల సమయంలో కేవలం నాలుగు వేల ఓట్లతో ఓడిన శ్రీభరత్ 2024లోనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఆయన ఎంపీగానే పోటీకి మొగ్గు చూపారు. పట్టుబట్టి ఎంపీగా బరిలో దిగి గెలుపొందారు. ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి పెద్దదిక్కుగా ఉంటున్నారు. అయితే ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ప్రభుత్వంలో ఇంకా పవర్ ఫుల్ గా పనిచేయొచ్చిని భావిస్తూ ఆయన అభిమానులు కొన్నాళ్లుగా భీమిలి నుంచి ఎంపీగా పోటీపై ప్రచారం చేస్తున్నారు.
శ్రీభరత్ కు చెందిన విద్యాసంస్థలు అన్నీ భీమిలి పరిధిలో ఉంటాయి. ఆ నియోజకవర్గం ఎప్పటి నుంచో టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒకటి రెండు సార్లు తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ పసుపు జెండాయే రెపరెపలాడింది. ఈ నేపథ్యంలో ఎంపీ శ్రీభరత్ ఎమ్మెల్యేగా పోటీచేస్తే భీమిలినే ఎంచుకుంటారన్న ప్రచారం విస్తృతంగా సాగింది. ఇదే సమయంలో స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు సైతం శ్రీభరత్ పోటీ చేస్తానంటే తాను తప్పుకుంటానని, ఆయన స్థానంలో ఎంపీగా వెళ్తానని చెప్పడం చర్చనీయాంశం అయింది.
కొన్నేళ్లుగా ఈ ప్రచారం ఉధృతంగా సాగుతున్నా, ఎంపీ భరత్ ఎప్పుడూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే గంటా కూడా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న ప్రచారాన్నినమ్మడంతో వివరణ ఇవ్వక తప్పదని భావించినట్లు చెబుతున్నారు. ఇలాంటి ప్రచారం వల్ల తప్పుడు అభిప్రాయాలు వ్యాపించడమే కాకుండా, లేనిపోని అపార్థాలు, మనస్పర్థలకు అవకాశం కల్పించినట్లు అవుతుందనే ఆలోచనతో శ్రీభరత్ తన ఆలోచనను బయటపెట్టారని అంటున్నారు.
