Begin typing your search above and press return to search.

పల్స్ ఉందని పీకనొక్కి చంపేశాడు.. వైజాగ్‌ మౌనిక హత్య కేసులో షాకింగ్ నిజాలు

విశాఖపట్నంలో జరిగిన మౌనిక హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకప్పుడు ప్రేమగా ప్రారంభమైన పరిచయం చివరికి దారుణ హత్యగా మారడం సమాజాన్ని కలచివేస్తోంది.

By:  A.N.Kumar   |   31 March 2026 11:37 PM IST
పల్స్ ఉందని పీకనొక్కి చంపేశాడు.. వైజాగ్‌ మౌనిక హత్య కేసులో షాకింగ్ నిజాలు
X

విశాఖపట్నంలో జరిగిన మౌనిక హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒకప్పుడు ప్రేమగా ప్రారంభమైన పరిచయం చివరికి దారుణ హత్యగా మారడం సమాజాన్ని కలచివేస్తోంది. నిందితుడు రవీంద్ర పోలీసుల ముందు ఇచ్చిన వాంగ్మూలం విన్నవారిని గడగడలాడిస్తోంది.

పోలీసుల వివరాల ప్రకారం.. కోవిడ్ కాలంలో ఒక డేటింగ్ యాప్ ద్వారా రవీంద్ర, మౌనిక పరిచయం ఏర్పడింది. మొదట స్నేహంగా మొదలైన ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ చాలాకాలం పాటు దగ్గరగా మెలిగారు. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల వారి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ దూరమయ్యారు.

అనంతరం 2024లో రవీంద్ర మరో యువతిని వివాహం చేసుకున్నాడు. అతనికి ఒక చిన్న పాప కూడా ఉంది. అయితే ఇటీవల అతని భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో రవీంద్ర మౌనికను మళ్లీ సంప్రదించాడు. గతంలో కలిసి తీసుకున్న ఫోటోలు, వీడియోలు తొలగించాలనే ఉద్దేశంతో ఆమెకు ఫోన్ చేశాడు. ఈ సంభాషణలో మళ్లీ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

ఈ వాగ్వాదం క్రమంగా ఉద్రిక్తతకు దారితీసింది. మౌనిక గట్టిగా అరవడం రవీంద్రకు అసహనంగా మారింది. కోపావేశంలో ఆమెను సోఫాపైకి నెట్టేసి, గొంతు నులిమాడు. మొదట స్పృహ తప్పినట్టుగా కనిపించిన మౌనికను మరలా గొంతు నులిమి హత్య చేశాడు. ఈ దారుణానికి తర్వాత కూడా అతని క్రూరత్వం ఆగలేదు. మౌనిక మృతదేహాన్ని బయట నుంచి తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ముక్కలు ముక్కలు చేశాడు.

ఈ ఘటన తర్వాత రవీంద్ర స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. విచారణలో భాగంగా పోలీసులు అతడిని సంఘటన స్థలానికి తీసుకువెళ్లగా, అక్కడ జరిగిన సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో అతడు చెప్పిన వివరాలు పోలీసులను సైతం భయపెట్టాయి. ముఖ్యంగా అతడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ప్రశాంతంగా ప్రతి విషయాన్ని వివరించడం అధికారులను షాక్‌కు గురిచేసింది.

ఇదిలా ఉండగా మౌనిక శరీర భాగాల్లో కొన్ని మాత్రమే లభించగా, తల ఇంకా కనిపించకపోవడం విచారణను మరింత క్లిష్టం చేస్తోంది. సంఘటన స్థలానికి రవీంద్రను తీసుకువచ్చిన సమయంలో అక్కడికి చేరుకున్న మౌనిక కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేయడానికి యత్నించారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ కేసు ప్రస్తుతం తీవ్ర విచారణలో ఉంది. రవీంద్ర ప్రవర్తనను గమనించిన పోలీసులు అతడిని “మానవత్వం కోల్పోయిన వ్యక్తి”గా అభివర్ణిస్తున్నారు. ప్రేమ, విభేదాలు, కోపం అన్ని కలిసి ఒక ప్రాణాన్ని ఎలా బలిగొన్నాయో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. సమాజంలో పెరుగుతున్న ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.