విశాఖలో భూప్రకంపనలు.. అతి చేస్తున్న మీడియా
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
By: Sivaji Kontham | 12 July 2026 4:14 PM ISTఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బంగాళాఖాతంలో సంభవించిన ఈ భూకంపం ప్రభావం విశాఖపట్నంతో పాటు కాకినాడ నుంచి విజయనగరం వరకు పలు ప్రాంతాల్లో స్వల్పంగా కనిపించింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) రిపోర్ట్ ప్రకారం.., ఆదివారం తెల్లవారుజామున 5:05 గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. కాకినాడ తీరానికి దాదాపు 225 కిలోమీటర్ల దూరంలో, సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ల లోతున దీని కేంద్రం ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
ఈ భూప్రకంపనలు చాలా స్వల్పంగా ఉండటంతో ఎటువంటి ప్రాణనష్టం గానీ.. ఆస్తి నష్టం గానీ సంభవించలేదు. తెల్లవారుజామున 5 గంటల సమయం కావడంతో అత్యధిక శాతం మంది ప్రజలు గాఢ నిద్రలో ఉండటం వల్ల అసలు భూప్రకంపనలు వచ్చాయనే విషయమే చాలామందికి తెలియలేదు. మేల్కొని ఉన్న కొద్దిమంది మాత్రమే స్వల్పంగా భూమి కంపించినట్లు గుర్తించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. భయపడాల్సిన పరిస్థితి అస్సలు లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. అయినా ఈ చిన్న విషయాన్ని కొందరు సామాజిక మాధ్యమాల్లో, వార్తల్లో పెద్దదిగా చూపే ప్రయత్నం చేశారు.
వాస్తవం ఇలా ఉంటే కొన్ని మీడియా సంస్థలు మాత్రం వ్యూస్, టీఆర్‌పీ రేటింగుల కోసం ఈ ఘటనపై తీవ్రంగా `అతి` చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ``వైజాగ్ లో భారీ భూకంపం`` అంటూ దారుణమైన, భయానకమైన హెడ్డింగులతో లైవ్ ప్రోగ్రామ్‌లు, తప్పుడు థంబ్‌నైల్స్ పెట్టి సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానెళ్లలో హల్చల్ చేయడం స్థానిక ప్రజలకు అస్సలు నచ్చడం లేదు. వాస్తవ తీవ్రతను దాచిపెట్టి... కేవలం క్లిక్ బైట్స్- విజిబిలిటీ పెంచుకోవాలనే కొన్ని మీడియా ఛానెళ్ల మూర్ఖత్వాన్ని నెటిజన్లు, విశ్లేషకులు తప్పుపడుతున్నారు.
ఇలా మీడియా అతి చేయడం విశాఖ విషయంలో ఇదే మొదటిసారి కాదు. ఇటీవల పరవాడ పరిసరాల్లోని ఫార్మా కంపెనీలలో జరిగిన కొన్ని చిన్నపాటి, చెదురుముదురు ప్రమాదాలపైనా కొన్ని మీడియా సంస్థలు ఇలాగే ఘోరమైన హెడ్డింగులు పెట్టి టీఆర్‌పీ గేమ్స్ ఆడటానికి ప్రయత్నించాయి. పరిశ్రమల్లో జరిగిన చిన్న సాంకేతిక లోపాలను కూడా నగరానికేదో ముప్పు ముంచుకొచ్చినట్లు కలరింగ్ ఇస్తూ వార్తలు ప్రసారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా అబద్ధపు హైప్ క్రియేట్ చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రకృతి విపత్తులు లేదా ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడం, వారికి ధైర్యం చెప్పడం మీడియా ప్రాథమిక బాధ్యత. అంతేకాని చిన్నపాటి స్వల్ప ప్రకంపనలను కూడా భారీ భూకంపాలుగా చిత్రీకరించి సమాజంలో అనవసర భయాందోళనలు సృష్టించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తూ..బాధ్యతాయుతమైన జర్నలిజం వైపు మీడియా అడుగులు వేయాలని..రేటింగుల పిచ్చిని పక్కనపెట్టి వాస్తవాలను మాత్రమే ప్రజల ముందుంచాలని విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.
భూకంపంపై ప్రజా స్పందన :
విశాఖపట్నం తీరంలో సంభవించిన స్వల్ప భూప్రకంపనలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు భిన్నమైన అనుభవాలను, అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. విశాఖ నగరంలోని మద్దిలపాలెం, మధురవాడ, సీతమ్మధార, ఎన్ఏడి, కూర్మన్నపాలెం.. అలాగే విజయనగరం వంటి పరిసర ప్రాంతాల ప్రజలు తెల్లవారుజామున 5:00 నుండి 5:15 గంటల మధ్యలో తమకు ఎదురైన అనుభవాలను లైవ్ చాట్‌లో రాసుకొచ్చారు. కొందరు నిద్రలో ఉన్నప్పుడు వింత శబ్దాలు వచ్చాయని.. మరికొందరు బెడ్‌రూమ్‌లోని మంచం, అల్మారా కొన్ని సెకన్ల పాటు కదిలాయని పేర్కొన్నారు. ఉదయాన్నే పూజ చేసుకుంటున్న సమయంలో లైట్‌గా షేక్ అవ్వడంతో మొదట భ్రమ అనుకున్నామని... కానీ మీడియా లైవ్ చూశాకే అది భూకంపమని తెలిసిందని కొందరు నెటిజన్లు ధృవీకరించారు.
ఈ ప్రకంపనలపై కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం ``ఇది చాలా స్వల్ప తీవ్రత కలిగింది..అంతా పిచ్చ లైట్, భయపడాల్సిన పనిలేదు`` అంటూ ధైర్యం చెప్పారు. ఇదే సమయంలో ఈ ప్రకృతి పరిణామాన్ని కొందరు దైవచింతనతో - పాపపుణ్యాలతో ముడిపెడుతూ కామెంట్లు చేయడం గమనార్హం. సమాజంలో పాపాలు పెరిగిపోవడం వల్లే భగవంతుడు ఇలాంటి హెచ్చరికలు ఇస్తున్నాడని... ఇప్పటికైనా మనుషులు మంచితనంతో నడుచుకోవాలని దైవభక్తితో కూడిన హితవులు పలికారు. మొత్తానికి మీడియా చూపిస్తున్న అతితో సంబంధం లేకుండా, నెటిజన్లు తమ స్వంత అనుభవాలను షేర్ చేయడంతో వాస్తవం ఏమిటో అవగతమవుతోంది.
