Begin typing your search above and press return to search.

మేయర్ పై అవిశ్వాసం: బలమైన సామాజిక బంధం షాక్ ఇస్తుందా ?

విశాఖ మేయర్ గా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిని తొలగిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన వారికే ఆ పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 April 2025 6:35 PM IST
మేయర్ పై అవిశ్వాసం: బలమైన సామాజిక బంధం షాక్ ఇస్తుందా ?
X

విశాఖలో వైసీపీ మేయర్ ని దించడానికి అంతా రంగం సిద్ధం అయిపోయింది. అవసరమైన బలం కూడా టీడీపీ కూటమి నేతలు సమకూర్చుకుంటున్నారు. ఈ నెల 19న అవిశ్వాసంపై ప్రత్యేక సమావేశం ఉంది. ఆ రోజున మేయర్ ని దించేయడం లాంచనం అని కూటమి నాయకులు చెబుతున్నారు.

అయితే దీనిని బలమైన ఒక సామాజిక వర్గం వ్యతిరేకిస్తోంది. ఎందుకు అంటే వైసీపీ మేయర్ హరి వెంకట కుమారి యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. విశాఖ నగరంలో యాదవుల సంఖ్య అధికంగా ఉంది. రాజకీయంగా తమకు సముచితమైన స్థానం కోసం వారు ఎపుడూ డిమాండ్ చేస్తూ ఉంటారు.

విశాఖ ఎంపీ సీటుతో పాటు కనీసనగా రెండు నుంచి మూడు ఎమ్మెల్యే పదవులు తమకు దక్కాలని వారు కోరుతూ ఉంటారు. అయితే వారి రాజకీయ బలం ఇటీవల కాలంలో పెరిగింది. వైసీపీ ఆ సామాజిక వర్గానికి మేయర్ పదవి 2021లో ఇచ్చింది. ఇక జనసేన వంశీకృష్ణ శ్రీనివాస్ ని విశాఖ సౌత్ నుంచి ఎమ్మెల్యేగా చేసి విశాఖ జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించింది.

తెలుగుదేశం పార్టీ గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావుని చేసింది. ఆయనకు ఏకంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చింది. ఇలా చూస్తే కనుక ఇపుడు యాదవులకు రాజకీయంగా విశాఖ నగరంలో మంచి ప్రాధాన్యత దక్కుతోంది. ఈ కీలక సమయంలో విశాఖ మొత్తాన్ని పాలించే మేయర్ పదవిని ఆ సామాజిక వర్గం నుంచి దూరం చేయడమేంటని ఆ సామాజిక వర్గం నేతలు మండిపడుతున్నారు.

తమకు రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఈ విధంగా చేయడం సబబేనా అని అంటున్నారు. ఈ విషయంలో కూటమిలో కీలకంగా ఉన్న పల్లా శ్రీనివాస్ అలాగే వంశీకృష్ణ ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఇద్దరు నాయకులకూ ఇతర సామాజిక వర్గాల్లో బలం ఉన్నా యాదవులు ఫుల్ సపోర్ట్ చేయబట్టే ఈ స్థితిలో ఉన్నారని గుర్తు చేస్తున్నారు.

ఇపుడు సొంత సామాజిక వర్గానికి చెందిన మేయర్ ని దించడానికి అనైతిక చర్యలకు పాల్పడడమేంటి అని యాదవ ఐక్య వేదిక జాతీయ కన్వీనర్ అల్సి అప్పల నారాయణ అంటున్నారు. ఇంతా చేసినా మేయర్ పదవీ కాలం కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అని ఆయన అన్నారు. ఈ మాత్రం దాని కోసం ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు.

విశాఖ మేయర్ గా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారిని తొలగిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన వారికే ఆ పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కూటమిలో పెద్దలుగా ఉన్న పల్లా వంశీ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరోవైపు చూస్తే కూటమి తరఫున మేయర్ పదవికి అభ్యర్థి ఫిక్స్ అయిపోయారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న వారికే ఈ పదవి అని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ మొత్తం అవిశ్వాసం వ్యవహారం దాని కోసం చేసే కసరత్తు అంతా ఆయనే చూసుకుంటున్నారు అని అంటున్నారు. అలాంటపుడు మేయర్ గా యాదవ సామాజిక వర్గానికి ఇవ్వడం అంటే కుదిరేది కాదు.

పైగా కూటమిలో అన్ని పార్టీలూ ఉన్నాయి, అన్ని సామాజిక వర్గాలూ ఉన్నాయి. ఇది ఏ ఒక్క సామాజిక వర్గంలో లేక నాయకుడో తీసుకోవాల్సిన నిర్ణయం కాన కాదు అని అంటున్నారు. అయినా సరే ఈ విషయం మీద మాత్రం యాదవుల నుంచి తీవ వ్యతిరేకత వస్తోంది. రానున్న కాలంలో ఇబ్బందులు ఉంటాయి అవి రాజకీయ సామాజిక పరంగా ఎదురవుతాయని చెబుతున్నారు. చూడాలి మరి మేయర్ సీటు మీద గురి పెట్టిన టీడీపీ కూటమికి ఈ బలమైన సామాజిక వర్గం నుంచి ఏ విధమైన షాకులు ఫ్యూచర్ లో ఎదురవుతాయో.