అదృష్టం అంటే విశాఖ కార్పొరేటర్లదే..
విశాఖ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాసం నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు సాగుతున్నాయి.
By: Tupaki Desk | 10 April 2025 9:34 AM ISTవిశాఖ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాసం నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు సాగుతున్నాయి. అయితే ఈ క్యాంపు రాజకీయాలు దేశం దాటి విదేశాలకు చేరడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అధికార, ప్రతిపక్షాలు రెండూ తమ కార్పొరేటర్లను విదేశాలకు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక మేయర్ పీఠం కోసం కార్పొరేటర్లను విదేశాలకు తరలించడం దేశంలో ఇదే తొలిసారిగా చెబుతుండటం గమనార్హం.
గత నెల 18తో విశాఖ నగర పాలక సంస్థకు నాలుగేళ్ల పదవీ కాలం పూర్తయింది. దీంతో మేయర్ పీఠంపై కన్నేసిన పాలక టీడీపీ కూటమి కార్పొరేటర్లు అవిశ్వాసంపై నోటీసును జిల్లా కలెక్టర్ కు అందజేశారు. విశాఖ కార్పొరేషనులో మొత్తం 98 డివిజన్లు ఉండగా, దాదాపు 70 మంది నోటీసు ఇవ్వడంతో అవిశ్వాసం నెగ్గే అవకాశాలు ఎక్కువయ్యాయి. పాలకవర్గానికి మరో ఏడాదే గడువు ఉన్నప్పటికీ రాష్ట్రంలోనే అతిపెద్ద కార్పొరేషన్ ను చేజిక్కించుకోవాలని కూటమి పార్టీలు నిర్ణయించడంతో అవిశ్వాసం తప్పనిసరైందని అంటున్నారు. ఈ నెల 19న అవిశ్వాసంపై చర్చకు కలెక్టర్ అనుమతి ఇవ్వడంతో పార్టీలు అప్రమత్తమయ్యాయి. మేయర్ పీఠం కాపాడుకోడానికి వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించడంతో కూటమి పార్టీలు క్యాంపు రాజకీయాలు స్టార్ట్ చేశాయి. తొలుత తమకు మద్దతుగా నిలిచిన కార్పొరేటర్లను విశాఖ శివర్లలోని భీమిలి రిసార్టుకు తరలించాయి. అయితే ప్రత్యర్థి పక్షం నుంచి సీనియర్ నేతలు బొత్స, కురసాల కన్నబాబు వంటివారు రంగంలోకి దిగడంతో కార్పొరేటర్లను మలేషియా తరలించినట్లు చెబుతున్నారు.
మరోవైపు వైసీపీ కూడా తమ కార్పొరేటర్లను ముందుగా బెంగళూరు తరలించింది. అయితే కూటమి పార్టీలు కార్పొరేటర్లను మలేషియా తరలించడంతో తమను కూడా వేరే దేశానికి తీసుకువెళ్లాలని వారు డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు. దీంతో వైసీపీ కార్పొరేటర్లను శ్రీలంక, అక్కడి నుంచి థాయిలాండ్ తరలించేందుకు సన్నాహాలు చేశారంటున్నారు. రెండు పక్షాలు తిరిగి ఈ నెల 19న విశాఖకు చేరుకునేలా ప్లాన్ చేశాయని అంటున్నారు. దీంతో ఈ క్యాంపు రాజకీయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
రాజకీయాల్లో క్యాంపులు సహజమే అయినప్పటికీ ఎన్నడూ లేనట్లు ఇలా విదేశాలకు తరలించడమే విశేషంగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మారిన సమయంలో కూడా ఎమ్మెల్యేలతో పక్క రాష్ట్రాలలోనే క్యాంపులు పెట్టేవారని, కానీ ఇంతవరకు ఎవరినీ విదేశాలకు తరలించలేదని చెబుతున్నారు. విశాఖలో మాత్రం కేవలం ఏడాది పదవీ కాలం కోసం కార్పొరేటర్లను విదేశీ క్యాంపులకు తీసుకెళ్లడమే ఆశ్చర్యం గొలుపుతోంది. అయితే ప్రతిష్టాత్మక మేయర్ పీఠం కోసం ఆ మాత్రం వ్యయప్రయాసలు తప్పవని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. మొత్తానికి అవిశ్వాసం పుణ్యమాంటు కార్పొరేటర్లు విదేశాల్లో ఎంజాయ్ చేయడంపై విశాఖ వాసులు ఔరా.. అంటూ నోరెళ్లబెడుతున్నారు.
