Begin typing your search above and press return to search.

విశాఖ తీరంలో రాజకీయ వేడి !

దాంతో విశాఖలో ఎన్నడూ లేనంతగా పొలిటికల్ హీట్ రాజుకుంది. గతంలో చూస్తే మేయర్ మీద అవిశ్వాసం ప్రకటించిన సందర్భాలు అయితే లేవు.

By:  Tupaki Desk   |   18 April 2025 7:57 PM IST
విశాఖ తీరంలో రాజకీయ వేడి !
X

విశాఖకు ప్రథమ పౌరుడు ఎవరో మరి కొద్ది గంటలలో తేలిపోతుంది. దానికి సంబంధించిన కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు విశాఖ జీవీఎంసీ హాల్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ మేయర్ మీద కూటమి కార్పోరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాసం మీద చర్చిస్తారు.

వైసీపీ మేయర్ ని అవిశ్వాసం ద్వారా గద్దె దించాలంటే అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 78 ఓట్లు రావాలని అంటున్నారు. ఆ భారీ అంకె కంటే కూడా ఎక్కువ నంబరే తమకు ఉందని కూటమి చెబుతోంది. తామే గెలిచి తీరుతామని అంటొంది. అయితే ఇంకా రెండు అంకెల దూరంలో కూటమి ఉందని అందువల్ల తమ మేయర్ ని దించే చాన్స్ లేదని వైసీపీ నేతలు అంటున్నారు.

ఈ నేపధ్యంలో విశాఖ మేయర్ ఎన్నిక అత్యంత ఉత్కంఠగా ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. విశాఖ మేయర్ గా ఉన్న హరి వెంకట కుమారి స్థానంలో టీడీపీ మేయర్ ని ప్రతిష్టించాలన్నది కూటమి వ్యూహంగా ఉంది. కలసికట్టుగా కూటమి పార్టీల నాయకులు అవిశ్వాస తీర్మానం మీద ముందుకు కదులుతున్నారు. ఏ చిన్న విషయంలోనూ ఏమరుపాటుకు గురి కాకుండా పూర్తి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

మరో వైపు చూస్తే కనుక ఇప్పటి దాకా దేశ విదేశాలలో ప్రత్యేక క్యాంపులకు వెళ్ళిన కార్పోరేటర్లు నగరానికి చేరుకున్నారు. వారిని నగరంలోని ఒక ప్రముఖ హొటల్ లో ఉంచుతున్నారు. వారితో పాటు కూటమికి చెందిన ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా అదే హొటల్ లో బస చేస్తారు. వీరంతా శనివారం ఉదయం పదకొండు గంటలకు జీవీఎంసీ హాల్ కి కలసి వస్తారు.

ఇక ఒకే ఒక తీర్మానం మీద చర్చ సాగుతుంది. మేయర్ మీద విశ్వాసం ఉందా లేక అవిశ్వాసమా అన్నదే అజెండా. ఇక ఈ అవిశ్వాస తీర్మానానికి వైసీపీకి చెందిన మొత్తం కార్పోరేటర్లు బాయ్ కాట్ చేస్తున్నట్లుగా ఇప్పటికే వైసీపీ జిల్లా ప్రెసిడెంట్ ప్రకటించారు. దాంతో మేయర్ మీద విశ్వాసం అంటూ ఓటింగ్ జరిగేది ఉండదు. దాంతో అవిశ్వాసానికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న దాని మీదన ఫలితం ఆధారపడి ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా ఓట్లు వస్తే కనుక వైసీపీ మేయర్ పదవి కోల్పోతారు.

దాంతో విశాఖలో ఎన్నడూ లేనంతగా పొలిటికల్ హీట్ రాజుకుంది. గతంలో చూస్తే మేయర్ మీద అవిశ్వాసం ప్రకటించిన సందర్భాలు అయితే లేవు. 2005లో జీవీఎంసీ ఏర్పాటు అయ్యాక 2007లో జరిగిన ఎన్నికల్లో తొలి మేయర్ పదవి కాంగ్రెస్ కి దక్కింది. బొటాబొటీ మెజారిటీతో కాంగ్రెస్ మేయర్ పదవిని అయిదేళ్ళూ చేపట్టింది. బలమైన ప్రతిపక్షంగా ఉన్నా కూడా టీడీపీ ఆనాడు మేయర్ పదవిని ఆశించలేదు. అయితే ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం కూడా కలసివచ్చింది.

ఇక 2000 నుంచి 2005 వరకూ విశాఖ కార్పోరేషన్ లో కాంగ్రెస్ మేయర్ ఉండగా ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. అపుడు కూడా టీడీపీకి మంచి నంబర్ కార్పోరేషన్ లో ఉంది. అయినా కానీ మేయర్ మీద అవిశ్వాసం ప్రవేశపెట్టలేదు. దాని కంటే ముందు 1995 నుంచి 2000 వరకూ మేయర్ గా కాంగ్రెస్ నాయకుడే ఉన్నారు. అపుడు కూడా టీడీపీ ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉంది. అయినా అయిదేళ్ళూ కాంగ్రెస్ పాలన కార్పోరేషన్ లో జరిగింది.

ఇక 1987లో టీడీపీ మేయర్ గెలిచిన రెండేళ్ళకు కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో అధికారంలోకి వచ్చింది. అపుడు కూడా కాంగ్రెస్ నేతలు టీడీపీ మేయర్ మీద అవిశ్వాసం ప్రకటించలేదు. ఇక 1979లో విశాఖ కార్పోరేషన్ ఏర్పాటు అయింది. ఆనాడు తొలి మేయర్ గా బీజేపీకి చెందిన ఎన్ ఎస్ ఎన్ రెడ్డి గెలిచారు. ఆనాడు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా అవిశ్వాసం ఊసు తేలేదు. అయిదేళ్ళూ బీజేపీనే పాలించింది. మొత్తానికి చూస్తే కనుక విశాఖ కార్పోరేషన్ చరిత్రలో మొదటి సారి ఒక మేయర్ మీద అవిశ్వాసం ప్రవేశపెడుతున్నారు. మరి ఇందులో ఓడినా గెలించా అది రికార్డుగానే ఉంటుంది. జీవీఎంసీ చరిత్రలో ముఖ్య భాగం అవుతుంది.