విశాఖ ఎంపీ సీటు మూడు ముక్కలు...కూటమి ఆశలకు రెక్కలు !
కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి తాజాగా చేసిన సూచనల మేరకు పెద్ద లోక్ సభ నియోజకవర్గాలను రెండూ లేదా మూడు ముక్కలు చేయనున్నారు.
By: Satya P | 13 Jun 2026 3:00 PM ISTకేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి తాజాగా చేసిన సూచనల మేరకు పెద్ద లోక్ సభ నియోజకవర్గాలను రెండూ లేదా మూడు ముక్కలు చేయనున్నారు. దాంతో విశాఖ వంటి పెద్ద పార్లమెంట్ సీట్లు ఇక మీదట మూడుగా మారనున్నాయని అంటున్నారు. ప్రస్తుతం చూస్తే 22 లక్షల ఓటర్లు 27 లక్షల మంది జనాభా విశాఖ ఎంపీ సీటు పరిధిలో ఉన్నారు. కొత్త జనాభా లెక్కలతో మరింత స్పష్టత వస్తుంది. ఆ మీదట 2029 నాటికి జనాభా ఇంకా పెరుగుతుంది అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి సిఫార్సుల మేరకు విశాఖ లాంటి పెద్ద సీట్లు మూడు ముక్కలు అవడం ఖాయంగా కనిపిస్తోంది.
సహేతుకమైన విభజన :
విశాఖ ఎంపీ సీటు 1952 తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి కూడా కొనసాగుతూ వస్తోంది. మొదట్లో నాలుగైదు లక్షలతో ఉండే ఈ నియోజకవర్గం 2024 లోక్ సభ ఎన్నికల నాటికి ఏకంగా 22 లక్షలకు పైగా ఓటర్లతో పెద్ద సీటుగా మారింది. ఒక ఎంపీ ఇన్ని లక్షల మంది ప్రజలకు ప్రతినిధిగా వ్యవహరించడం అంటే చాలా క్లిష్టమైన సమస్యగానే చూడాల్సి ఉంటుంది. ఎనిమిది లేదా తొమ్మిది లక్షల మంది ఓటర్లకు ఒక ఎంపీ అన్నది సూత్రప్రాయమైన విభజనగా ఉంటుందని అది సహేతుకమని అంటున్నారు. ఈ లెక్కన రానున్న రోజులలో మరింతగా పెరగనున్న విశాఖ సీటుని మూడుగా చేస్తేనే బెటర్ అని అంటున్నారు. ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి ప్రతిపాదనలలో కూడా విశాఖను మూడు చేయాలని ఉంది అని అంటున్నారు.
అదే జరిగితే కనుక :
విశాఖ ఎంపీ సీటు మీద చాలా మందికి కన్ను ఉంటుంది. అదే విధంగా అన్ని పార్టీలూ ఇక్కడ నుంచి పోటీ చేసి గెలవాలని చూస్తాయి. ఇక ఏపీలో టీడీపీ కూటమి విషయం తీసుకుంటే మూడు పార్టీలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ నుంచి పోటీ చేయాలని అనుకుంది. టీడీపీతో పొత్తు ఉన్నప్పుడల్లా బీజేపీ ఈ సీటుని తీసుకునేది. కానీ 2024 ఎన్నికల్లో బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ పోటీ చేయాలనుకోవడంతో బీజేపీకి అనకాపల్లిని కేటాయించారు. అయితే కొత్త ఫార్ములాతో డీలిమిటేషన్ జరిగితే కనుక 2029 ఎన్నికల్లో ఈ సీటు మూడుగా మారుతుంది అని అంటున్నారు. దాంతో కూటమిలోని మూడు పార్టీలకూ ఎంతో అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే జనసేన కూడా విశాఖ నుంచి పార్లమెంట్ కి పోటీ చేయాలని 2024 ఎన్నికల సమయంలో ఆశలు పెట్టుకుంది అని గుర్తు చేస్తున్నారు.
ఈ విధంగా ఉండొచ్చు :
ఇక విశాఖ ఎంపీ సీటు విభజన అంటూ జరిగితే ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది. తూర్పు, భీమునిపట్నంలతో ఒక ఎంపీ సీటు, అలాగే విశాఖ దక్షిణం, నార్త్ అసెంబ్లీ విశాఖ పశ్చిమం ఒక సీటుగా, గాజువాక , పెందుర్తిలోని కొంత భాగం, ఎస్ కోటల అసెంబ్లీ సీటు కలుపుకుని మూడవ సీటు రావచ్చు అని లెక్క వేస్తున్నారు. అపుడు విశాఖ సెంట్రల్ పార్లమెంట్, భీమునిపట్నం ఎంపీ సీటు, అలాగే ఎస్ కోట ఎంపీ సీటుగా పేర్లు పెట్టే చాన్స్ ఉండొచ్చు అని కూడా అంటున్నారు. అయితే ఇందులో మహిళా రిజర్వేషన్ కూడా ఉంటుంది. అలాగే జనాభా ప్రాతిపదికన కులాలు ఎన్ని ఉన్నాయన్నది కూడా చూస్తారని చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే విశాఖ ఎంపీ సీటు మూడు ముక్ఖలు అయితే మాత్రం ఆశావహులకు జాక్ పాట్ తగిలినట్లే అని అంటున్నారు.
