విశాఖలో భూములు అందుకే చౌకగా !
విశాఖ అంటేనే కాస్ట్లీ సిటీ. పైగా అక్కడ భూముల ధరలకు రెక్కలు వస్తాయి. విశాఖలో భూమి ఉన్న వారు కూడా దానిని కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడతారు అంటే ఉన్న డిమాండ్ అలాంటిది.
By: Satya P | 3 Aug 2025 8:00 AM ISTవిశాఖ అంటేనే కాస్ట్లీ సిటీ. పైగా అక్కడ భూముల ధరలకు రెక్కలు వస్తాయి. విశాఖలో భూమి ఉన్న వారు కూడా దానిని కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడతారు అంటే ఉన్న డిమాండ్ అలాంటిది. ఉమ్మడి ఏపీలోనే విశాఖకు ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇక విభజన ఏపీలో విశాఖ వన్ అండ్ ఓన్లీ నంబర్ వన్ మెగా సిటీగా ఉంది. దాంతో అందరి ఫోకస్ ఆ వైపుగానే ఉంది. ఈ నేపథ్యంలో విశాఖ భూముల మీద ఎపుడూ రాజకీయ రచ్చ సాగుతూనే ఉంటుంది.
కారు చౌకగా కట్టబెడుతున్నారా :
విశాఖలో భూములు ఐటీ కంపెనీలకు చాలా కారు చౌకగా కట్టబెడుతున్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది. భూముల దందా నడుస్తోందని అంటోంది ఐటీ కంపెనీల పేరు చెప్పి విశాఖ భూముల విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. మా విశాఖ భూములు మీకు ఎకరం 99 పైసలకు కనిపిస్తోందా అని వైసీపీ మాజీ మంత్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎవరెవరికో భూములు ఇస్తున్నారని ఇది మంచి విధానం కాదని కూడా హెచ్చరిస్తున్నారు.
ఫైర్ అయిన విశాఖ ఎంపీ :
భూములు ఎవరికీ అప్పనంగా ఇవ్వడం లేదని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అంటున్నారు. విశాఖలో ఐటీ హబ్ ని ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన అని ఆయన చెప్పారు ఆ దిశగానే తమ చర్యలు ఉంటున్నాయని తెలిపారు. టీసీఎస్ ఎక్కడికో వెళ్తూంటే వెంటబడి మరీ విశాఖకు తెచ్చామని ఆయన గుర్తు చేశారు. టీసీఎస్ లాంటి సంస్థ కనుక విశాఖలో వస్తే అనేక ఇతర ఐటీ సంస్థలు కూడా క్యూ కడతాయని అన్నారు. ఈ చిన్న లాజిక్ వైసీపీ నేతలు మిస్ అవుతూ విమర్శలు చేస్తున్నారు అన్నారు.
యువతకు ఉపాధి కోసమే :
ఎక్కడో బెంగళూరు హైదరాబాద్ లలో సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ ఉందని దానిని విశాఖకు తీసుకుని వస్తున్నామని ఆయన అన్నారు. దాని వల్ల యువతకు పెద్ద ఎత్తుల ఉపాధి స్థానికంగానే లభిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఎంత తక్కువ ధరకు భూములు ఇచ్చామన్నది ప్రశ్న కాదని ఎన్ని వందల ఉద్యోగాలు వస్తున్నాయన్నది ప్రధానం అన్నారు. ఈ విషయంలో వైసీపీ నేతలు అంతా వ్యతిరేకంగానే ఆలోచిస్తున్నారు అని మండిపడ్డారు.
డిపాజిట్లు గల్లంతే మరి :
వైసీపీ నేతలు గతంలో చేసిన నిర్వాకం వల్ల ఓటమి భారీ ఎత్తున వచ్చిందని, ఇదే విధంగా వారు వ్యవహరించుకుంటూ పోతే డిపాజిట్లు గల్లంతు అవడం వచ్చే ఎన్నికల్లో ఖాయమని భరత్ జోస్యం చెప్పారు వారి హయాంలో ఎటూ విశాఖ అభివృద్ధి చెందలేదని ఇపుడు కూటమి విశాఖను అభివృద్ధి చేస్తూంటే ఓర్వలేకపోతున్నారు అన్నారు. ఈ విధమైన వైఖరి ఏ మాత్రం మంచిది కాదని ఆయన అన్నారు ఇప్పటికైనా వాస్తవాలు వైసీపీ నేతలు గమనించాలని కోరారు.
