Begin typing your search above and press return to search.

విశాఖ ఐటీ హబ్ కు మరో బూస్ట్.. పది ఎకరాలు కావాలని కోరిన దిగ్గజ ఐటీ సంస్థ

విశాఖ ఐటీ హబ్ కు దిగ్గజ పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, అదానీ వంటి సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలు నిర్వహించడానికి రెడీ అయ్యాయి.

By:  Tupaki Desk   |   24 Sept 2025 11:00 PM IST
విశాఖ ఐటీ హబ్ కు మరో బూస్ట్.. పది ఎకరాలు కావాలని కోరిన దిగ్గజ ఐటీ సంస్థ
X

విశాఖ ఐటీ హబ్ కు దిగ్గజ పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్, అదానీ వంటి సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలు నిర్వహించడానికి రెడీ అయ్యాయి. ప్రభుత్వం కూడా ఆయా సంస్థలకు భూ కేటాయింపులు చేసింది. వీటి అనుబంధంగా పలు సంస్థలు విశాఖలో ఆఫీసులు తెరిచేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఐటీ పరిశ్రమల ప్రోత్సాహానికి సత్వర నిర్ణయాలు తీసుకుంటోంది. దీంతో మరో ఐటీ దిగ్గజం కూడా విశాఖలో పెట్టుబడులకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.

విశాఖలో కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రముఖ ఐటీ పరిశ్రమ యాక్సెంచర్ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ సంచలన కథనం రాసింది. సుమారు 12 వేల మందికి ఉపాధి కల్పిస్తామని తమకు తగిన భూమి కేటాయించాలని ఆ సంస్థ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించింది. దీనిపై ప్రభుత్వ ప్రకటన వచ్చేవరకు అధికారికంగా వెల్లడించకూడదని ఆ సంస్థ భావిస్తున్నట్లు చెబుతున్నారు. యాక్సెంచర్ ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

వివిధ దేశాల్లో ఆ సంస్థకు 7.9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో మూడు లక్షల మంది భారతీయులే కావడం విశేషం. అటువంటి సంస్థ విశాఖపట్నం వస్తే భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు. అంతేకాకుండా పలు అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖలో ఇప్పటికే పలు ఐటీ దిగ్గజాలు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అంతేకాకుండా కొన్ని సంస్థలు కొద్ది రోజుల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.

ప్రధానంగా దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ కంపెనీ విశాఖలోని మిలీనియం టవర్స్ లో త్వరలో సర్వీస్ సెంటర్ ప్రారంభించనుంది. విశాఖ కేంద్రంగా దశల వారీగా 12 వేల ఉద్యోగాలు కల్పించేందుకు టీసీఎస్ అడుగులు వేస్తోందని చెబుతున్నారు. 1,370 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో టీసీఎస్ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రకారం రుషికొండ ఐటీ హిల్ పై 21.6 ఎకరాల స్థలాన్ని టీసీఎస్ కు ప్రభుత్వం అప్పగించింది. అదేవిధంగా మరో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా కాపులుప్పాడలో 21.31 ఎకరాలు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించింది. ఈ సంస్థ కూడా 1,582 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. కాగ్నిజెంట్ ద్వారా విశాఖలో కొత్తగా 8 వేల ఉద్యోగాలు రానున్నాయి. 2029 నాటికి కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభించేలా కాగ్నిజెంట్ ప్రయత్నాలు చేస్తోంది.

కోవిడ్ తర్వాత ఐటీ సంస్థలు అన్నీ ద్వితీయ శ్రేణి నగరాలపై ఆసక్తి చూపుతున్నాయి. భూమి తక్కువ ధరకు లభించడం, తక్కువ జీతాలకు నైపుణ్యం ఉన్న యువత అందుబాటులో ఉండటం, ట్రాఫిక్ సమస్యలు లేకపోవడంతో పెద్ద కంపెనీలు విశాఖ వంటి నగరాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేశాయని అంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా ప్రోత్సాహకాలతో ముందుకు రావడంతో ఐటీ సంస్థలు రాష్ట్రానికి ముఖ్యంగా విశాఖకు క్యూ కడుతున్నాయని చెబుతున్నారు.