Begin typing your search above and press return to search.

విశాఖలో ఫిల్మ్ నగర్...బాబు ఓకే !

విశాఖని విశ్వ నగరంగా తాజా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ కొత్త బిరుదు ఇచ్చారు. ఇప్పటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ కి ఆ పేరు ఉంది.

By:  Satya P   |   19 Sept 2026 11:42 PM IST
విశాఖలో ఫిల్మ్ నగర్...బాబు ఓకే  !
X

విశాఖని విశ్వ నగరంగా తాజా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ కొత్త బిరుదు ఇచ్చారు. ఇప్పటిదాకా రెండు తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ కి ఆ పేరు ఉంది. ఎందుకంటే కాస్మోపాలిటన్ కల్చర్ అక్కడ ఉంది. దేశ విదేశాలలోని ప్రజలు అంతా హైదరాబాద్ ని ఇష్టపడతారు. అక్కడ నివసిస్తారు. తమ సొంత ప్రాంతంగా భావిస్తారు. విశాఖకు కూడా ఆ రకమైన అనుకూలత ఉంది. ఈ రోజున ఉన్న పాతిక లక్షల మంది జనాభాలో ఇరవై శాతానికి పైగా దేశంలోని నలుమూలలకు చెందిన వారు అంతా విశాఖలో మకాం ఏర్పరచుకుంటున్నారు. అందుకే విశ్వనగరంగా విశాఖ ఎదుగుతోంది అని చంద్రబాబు కితాబు ఇస్తూ కొనియాడారు.

సినీ రాజధానిగా :

విశాఖ అంటేనే కల్చరర్ కాపిటల్ అంటారు, టూరిజానికి కేరాఫ్ అని చెబుతారు. అలాగే సినీ రాజధానిగా కూడా అభివర్ణిస్తారు. దాంతో పాటు గతంలో ఎన్నో షూటింగులు విశాఖలో జరిగాయి. ఇపుడు కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతో ఏపీలో సినీ పరిశ్రమకు కేంద్ర బిందువుగా విశాఖ ఉంటుందని అంతా అంటున్న సంగతి ఉంది. విశాఖలో రామానాయుడు స్టూడియో సైతం ఉంది. ఇపుడు ఫిల్మ్ నగర్ ని కూడా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి చూస్తే ఇది పాత ప్రతిపాదనే. చంద్రబాబు సీఎం గా ఉన్నపుడు 2014 నుంచి 2019 మధ్యలో విశాఖలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ కి ప్రతిపాదించారు. ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా శంకుస్థాపన చేశారు.

భూ కేటాయింపు కోసం హామీ :

ఆ విధంగా చూస్తే అప్పట్లోనే విశాఖ బీచ్ రోడ్డు ప్రాంతంలో తిమ్మాపురంలో అయిదు ఎకరాల భూమిని కూడా ఫిల్మ్ నగర్ భవనాల నిర్మాణం కోసం నాటి ప్రహ్బుత్వం కేటాయించింది. అయితే ఆ ఉత్తర్వుల్లో కొన్ని సాంకేతిక అంశాలు పేర్కొనక పోవడం వల్ల ఆ ప్రతిపాదన ముందుకు వెళ్లలేదు. దీంతో సాంకేతిక అంశాలు సరి చేస్తూ కొత్త జీఓ ఇవ్వాలని భీమిలీ ఎమ్మెల్యే హోదాలో గంటా శ్రీనివాసరావు గతంలోనే చంద్రబాబు లోకేష్ లను ప్రత్యేకంగా కలిసి కోరారు. ఇక తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి విశాఖ వచ్చిన చంద్రబాబు దృష్టికి ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ భూ కేటాయింపు విషయాన్ని గంటా గుర్తు ఏశారు. దాంతో చంద్రబాబు ఫిల్మ్ నగర్ కోసం వెంటనే భూ కేటాయింపులకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సినీ యాక్టివిటీని పెంచేలా :

ఇదిలా ఉంటే ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ భూ కేటాయింపు జరిగితే భవన నిర్మాణం చేపట్టాలని కూడా తీర్మానించారు. ఈ మధ్యనే ఫిల్మ్ నగర్ కి కొత్త కార్యవర్గం ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గా విశాఖ ఉత్తరం బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఎన్నిక అయ్యారు. అలాగే గంటాతో పాటు కూటమి ప్రజా ప్రతినిధులు కూడా ఫిల్మ్ నగర్ ద్వారా సినీ యాక్టివిటీని విశాఖలో పెంచాలని చూస్తున్నారు. దానికి కూటమి ప్రభుత్వం నుంచి తగిన మద్దతు ఉంది. రానున్న రోజులలో ఫిల్మ్ నగర్ భవనం నిర్మాణం అయితే హైదరాబాద్ తరహాలో విశాఖలో సినీ కార్యకలాపాలు పెద్ద ఎత్తున స్టార్ట్ అవుతాయని అంటున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సైతం విశాఖ రాజమండ్రి తిరుపతి ప్రాంతాలలో సినీ కార్యకలాపాలను పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతూ వస్తున్నారు.