Begin typing your search above and press return to search.

కిలో బియ్యం రూ.వంద, ఎకరం భూమి 99 పైసలు.. విశాఖలో వైసీపీ వినూత్న ప్రచారం

విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ప్రచారం హీట్ పుట్టిస్తోంది. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రజలను చైతన్యం చేసేలా వైసీపీ నేతలు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు

By:  Tupaki Desk   |   24 Oct 2026 7:28 PM IST
కిలో బియ్యం రూ.వంద, ఎకరం భూమి 99 పైసలు.. విశాఖలో వైసీపీ వినూత్న ప్రచారం
X

విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ప్రచారం హీట్ పుట్టిస్తోంది. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రజలను చైతన్యం చేసేలా వైసీపీ నేతలు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. బియ్యం ధర కిలో వంద రూపాయలకు చేరుకుందని అదే సమయంలో విశాఖ నగరంలో ఎకరం భూమిని 99 పైసలకే అప్పగిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అవసరమైన నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని చెప్పడమే కాకుండా ధనవంతులకు కారుచౌకగా భూములు అప్పగించేస్తుందని చాటడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ప్రయత్నాలు చేస్తుండటం విమర్శకులను సైతం ఆకర్షిస్తోందని అంటున్నారు.

పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న వైసీపీ.. ఈ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా మలుచుకోవడంపై విస్తృత చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో నగరపాలక సంస్థను దక్కించుకునేలా విపక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అంటున్నారు. ప్రధానంగా పేద, మధ్య తరగతి ఓటర్ల దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోందని అంటున్నారు. అందుకే స్థానిక సమస్యలు కన్నా, ధరల పెరుగుదలను ప్రధాన అజెండాగా మార్చుకుందని అంటున్నారు. దీనివల్ల నేరుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. అంతేకాకుండా ప్రజల సమస్యలకు తాము పట్టించుకుంటామని చెప్పుకుంటూ వారిలో సానుకూలత పెంచుకునే ఎత్తుగడను అమలు చేస్తోందని విశ్లేషిస్తున్నారు.

తిరిగి పుంజుకునే ప్రయత్నాలు

మున్సిపల్ ఎన్నికల్లో నిత్యావసరాల ధరలను ప్రస్తావించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్న విపక్షం.. ప్రజల మద్దతు పొందే అవకాశం ఉందా అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. గత ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో విశాఖ నగరంపై వైసీపీ జెండా ఎగరేసింది. అయితే అంతకుముందు, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ నగరంలో ఒక్కసీటు కూడా వైసీపీ దక్కించుకోలేకపోయింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో అయితే విశాఖ కార్పొరేషన్ పరిధిలో ఉన్న భీమిలి, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు లక్ష ఓట్ల తేడాతో వైసీపీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల సమస్యను మాత్రమే ప్రచారం చేసి గత ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకుని, తిరిగి అధికార పక్షంపై పైచేయి సాధించే అవకాశం ఉందా? అన్నదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

పెట్టుబడులపై ప్రచారంతో లాభమేనా?

నిత్యావసరాల విషయంలో వైసీపీ ప్రచారాన్ని ప్రజలు నమ్మితే తమకు లాభం జరుగుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారని అంటున్నారు. ఇదే సమయంలో పెట్టుబడుల వ్యతిరేక ప్రచారం వల్ల నష్టం జరగదా? అంటూ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. విశాఖ నగరాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్ తోపాటు విశాఖను ఏఐ, ఐటీ హబ్ గా తీర్చిదిద్దే ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ఇప్పటికే ప్రారంభించాయి. దీనివల్ల నగర వాసులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరిగాయనే టాక్ నడుస్తోంది. ఈ కారణంగా కంపెనీలకు భూములు ఇవ్వడాన్ని వైసీపీ తప్పుపట్టడాన్ని ప్రజలు స్వాగతిస్తారా? అన్నదే సందేహానికి కారణమవుతోందని చెబుతున్నారు.

పెట్టుబడులు ఆకర్షించాలంటే పారిశ్రామిక సంస్థలకు భూములు ఇవ్వాల్సివుందని, ఏ ప్రభుత్వమైనా ఆ విధానం అమలు చేయకతప్పదని అంటున్నారు. మొత్తానికి వైసీపీ చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో హాట్ డిబేట్ కు వేదిక అవుతోంది. అయితే క్షేత్రస్థాయిలో ప్రజలు ఎలా ప్రభావితం అవుతారు అన్నదే ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా ఉందని అంటున్నారు. ధరల పెరుగుదల అంశంపై ఎక్కువగా రియాక్ట్ అయితే వైసీపీకి అనుకూలంగా స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఎల్ నినో కారణంగా దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల ఉండటం వల్ల, స్థానిక ఎన్నికల్లో ఈ అంశం ప్రభావం చూపుతుందా? అన్నదే చూడాల్సివుందని వ్యాఖ్యానిస్తున్నారు.