Begin typing your search above and press return to search.

విశాఖకు పల్లె బెంగ...జడ్పీ చింత

ఏపీలో ఏ జిల్లాకూ లేని ఇబ్బంది విశాఖ జిల్లాకు ఏర్పడింది. ఇది 2022లో అప్పటికి 13గా ఉన్న జిల్లాలను 26 జిల్లాలుగా మార్చినప్పుడే గ్రామీణం అంతా చెల్లాచెదురైంది.

By:  Satya P   |   7 April 2026 9:00 AM IST
విశాఖకు పల్లె బెంగ...జడ్పీ చింత
X

ఏపీలో ఏ జిల్లాకూ లేని ఇబ్బంది విశాఖ జిల్లాకు ఏర్పడింది. ఇది 2022లో అప్పటికి 13గా ఉన్న జిల్లాలను 26 జిల్లాలుగా మార్చినప్పుడే గ్రామీణం అంతా చెల్లాచెదురైంది. అత్యధిక భాగం అనకాపల్లి జిల్లాకు వెళ్ళిపోయింది. దాంతో విశాఖలో పల్లె ప్రాంతాలు పంచాయతీలు మండలాలు ఏవీ అని వెతుక్కోవాల్సి వచ్చింది. అయితే నిన్నటి దాకా కొనసాగిన జిల్లా పరిషత్తు ఉమ్మడి విశాఖ జిల్లాతోనే ఉండడంతో పెద్దగా ఇబ్బంది రాలేదు.

అయితే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విశాఖ జిల్లా పరిషత్ ఉంటుందా లేదా అన్న కొత్త చర్చ అయితే స్టార్ట్ అయింది అని అంటున్నారు.

అంతా అర్బన్ ఏరియా :

ఇదిలా ఉంటే విశాఖ జిల్లా 2022 దాకా ఏపీలో రెండవ పెద్ద జిల్లాగా భౌగోళికంగా ఉండేది. అలాగే సగానికి పైగా గ్రామీణ ప్రాంతం కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉండేది. అయితే జిల్లాల పునర్విభజన తరువాత చూస్తే కనుక జిల్లాలో ఏకంగా జీవీఎంసీ విస్తరించి అంతటా ఉంది. దాంతో ఏకంగా 89 శాతం దాకా పట్టణమే ఉంది. కేవలం 11 శాతం మాత్రమే గ్రామీణ ప్రాంతం ఉంది. అంటే కేవలం పది శాతం అన్న మాట. జీవీఎంసీ అయితే నానాటికీ విస్తరిస్తోంది.

బృహత్ విశాఖగా :

జీవీఎంసీ అయితే చాలా పంచాయతీలను మండలాలను తనలో కలిపేసుకుంది. దాంతో ఒకనాడు 72 వార్డులు గా ఉన్న జీవీఎంసీ ఇపుడు 120 వార్డులుగా ఎదగబోతోంది. ఇంకా జీవీఎంసీని విస్తరించాలని భావించి ఆ మిగిలిన పల్లె ప్రాంతాలను పంచాయతీలను కలపాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతాలోనే గూగుల్ డేటా సెంటర్ లాంటివి వచ్చాయి. దాంతో వాటికి సిటీ ఫ్లేవర్ అద్దాలన్న ఉద్దేశ్యంతో జీవీఎంసీలో విలీనం చేయాలని స్థానిక రాజకీయ నేతలు ప్రజా ప్రతినిధులు కోరుతున్నారు.

విలీనం మీద చర్చ :

ఈ క్రమంలో జీవీఎంసీలో 79 గ్రామ పంచాయతీల విలీనం చేయాలని కూడా ప్రతిపాదనలు వెళ్ళాయి. అందులో విశాఖ జిల్లాలోని భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ జీవీఎంసీలో విలీనం చేస్తే బృహత్ విశాఖ ఆవిర్భవిస్తుందని అంటున్నారు. అయితే అసలు పల్లె ఒక్కటి కూడా విశాఖ జిల్లాలో లేకుండా పోతుందన్న ఆందోళన మరో వైపు ఉంది. ఇక చూస్తే ఈ విలీనం చేయాలంటున్న నాలుగు మండలాల్లో సుమారు నాలుగైదు లక్షల జనాభా ఉంది. వీరిని అందరినీ జీవీఎంసీలో విలీనం చేయాలని చూస్తున్నారు.

జిల్లా పరిషత్తు లేనట్లే :

ఇలా విలీనం కనుక జరిగితే ఏపీలో జిల్లా పరిషత్తు లేని ఏకైక జిల్లాగా విశాఖ రికార్డు సృష్టించబోతోంది అని అంటున్నారు. అన్ని జిల్లాలకు మండలాలు పంచాయతీలు ఉంటే విశాఖ ఆ విషయంలో జీరో నంబర్ కి చేరుకుంటుంది అని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి పంచాయతీల విలీనం ఆగినా 2027 జనాభా గణన తర్వాత అయినా తిరిగి ఈ డిమాండ్ వస్తుంది అని అంటున్నారు. ఒక వేళ అలా కాకుండా విడిచిపెట్టినా కేవలం నాలుగు మండలాల్తో విశాఖ జిల్లా పరిషత్తు ఏర్పాటు సాధ్యపడుతుందా అన్నది కూడా ఉంది. అతి చిన్న జిల్లా పరిషత్ గా కొనసాగిస్తారా లేదా అన్నది కూడా కొత్త చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.