జనసేనకు విశాఖ డిప్యూటీ మేయర్.. టీడీపీ నేతలకు ఇష్టం లేదా?
విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికపై వాడివేడి చర్చ జరుగుతోంది. వైసీపీ ఖాతాలో ఉన్న విశాఖ మేయర్ పీఠాన్ని గత నెలలో కూటమి లాగేసుకుంది.
By: Tupaki Desk | 20 May 2025 1:29 PM ISTవిశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నికపై వాడివేడి చర్చ జరుగుతోంది. వైసీపీ ఖాతాలో ఉన్న విశాఖ మేయర్ పీఠాన్ని గత నెలలో కూటమి లాగేసుకుంది. మేయరుగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సోదరుడు శ్రీనివాసరావు ఎన్నికైన విషయం తెలిసిందే. డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించాలని అప్పట్లోనే ఒప్పందం కుదరింది. అయితే సోమవారం జరగాల్సిన ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. దీనికి ప్రధాన కారణం కూటమిలో టీడీపీ నేతల అసంతృప్తిగా ఉండటమేనని అంటున్నారు.
విశాఖ డిప్యూటీ మేయరుగా డల్లి గోవిందరావు ఎన్నికయ్యారు. సోమవారమే ఎన్నిక జరగాల్సివుండగా, కొందరు టీడీపీ నేతల గైర్హాజరుతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. దీనికి కారణం డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించడం ఒక కారణమైతే.. ఆ పదవిని వైసీపీ నుంచి జనసేనలో చేరిన మహిళా నేతకు ముందుగా కేటాయించడమేనంటున్నారు. టీడీపీ నేతల అసంతృప్తితో ఆ మహిళ నేత బదులుగా గోవిందరావును ఎంపిక చేశారని అంటున్నారు.
విశాఖ కార్పొరేషనులో వాస్తవానికి వైసీపీకే మెజార్టీ ఉండేది. అయితే గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత విశాఖ కార్పొరేషన్ రాజకీయాలు కూడా సమూలంగా మారిపోయాయి. వైసీపీ కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన తీర్థం పుచ్చుకోవడంతో స్టాండింగ్ కౌన్సిల్ పదవులతోపాటు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు టీడీపీ కూటమి ఖాతాలో పడ్డాయి. అయితే మేయర్ ఎన్నిక సమయంలో కలిసికట్టుగా ఉన్న కూటమి నేతలు డిప్యూటీ మేయర్ ఎంపిక విషయంలో మాత్రం తీవ్రంగా విభేదించుకున్నట్లు జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది.
తొలుత డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు, యాదవ సామాజికవర్గానికి కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితే అనుకున్న విధంగా జనసేనకు డిప్యూటీ మేయర్ పదవిని కట్టబెట్టినా, యాదవ సామాజికవర్గ నేతను ఎంపిక చేయకపోవడంపై టీడీపీ నుంచి అభ్యంతరం వ్యక్తమైనట్లు చెబుతున్నారు. విశాఖనగరంలో యాదవ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నందున, ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి నేతలు భావించారని అంటున్నారు.
అయితే జనసేన నాయకత్వం మాత్రం ఆ ప్రతిపాదనను పట్టించుకోకపోవడంతో సోమవారం జరగాల్సిన ఎన్నికకు కొందరు ముఖ్య నేతలు హాజరుకాలేదని అంటున్నారు. అంతేకాకుండా వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యమివ్వడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారంటున్నారు. దీంతో జనసేన తన అభ్యర్థిని మార్చి తొలి నుంచి పార్టీలో ఉన్న గోవిందరావు పేరు ప్రతిపాదించింది. అయితే ఆయన కూడా యాదవ సామాజికవర్గ నేత కాదని టీడీపీ అడ్డు చెప్పగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన ఎమ్మెల్యే వంశీ శ్రీనివాస్ కలగజేసుకుని ఉభయ పార్టీల నేతలను సర్ది చెప్పారంటున్నారు. దీంతో మంగళవారం టీడీపీ నేతలు శాంతించడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా ముగిసిందని అంటున్నారు.
