40 ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్ కార్లు! విశాఖలో హోటల్స్ అన్నీ ఫుల్
విశాఖ సీఐఐ సదస్సును ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుపై అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది.
By: Tupaki Political Desk | 8 Nov 2025 7:35 PM ISTవిశాఖ సీఐఐ సదస్సును ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుపై అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వస్తున్న అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సదస్సుకు పక్కా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.. డెలిగేట్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారి హోదాకు తగ్గ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా విశాఖలో ఉన్న ప్రముఖ హోటల్స్ లో 1200 గదులను ప్రభుత్వం బుక్ చేసింది. అంతేకాకుండా విదేశీ వ్యాపారవేత్తలు, అతిథుల కోసం ఆధునాతనమైన వాహనాలను సమకూర్చుతోంది. సుమారు 40 ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్ కార్లను కూడా ప్రభుత్వం సిద్దం చేస్తోంది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 14, 15వ తేదీల్లో సీఐఐ సదస్సు జరగనుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పెట్టుబడుల కోసం తొలిసారిగా నిర్వహిస్తున్న అతిపెద్ద కార్యక్రమం ఇదే. దీంతో సీఎం చంద్రబాబు సదస్సు నిర్వహణను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఏర్పాట్లను స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తుండటంతో అధికారులు భారీస్థాయిలో సౌకర్యాలు సమకూర్చుతున్నారు. సదస్సుకు వచ్చేందుకు ఇప్పటివరకు దాదాపు వెయ్యి మంది డెలిగేట్లు రిజిస్ట్రర్ చేసుకున్నారు. ఈ సంఖ్య రెండు వేలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తోపాటు 33 దేశాల నుంచి వాణిజ్య మంత్రులు ఈ సదస్సుకు వస్తున్నారు. ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి వాణిజ్య మంత్రిత్వశాఖ బృందాలు రానున్నాయి. సదస్సు ముందు రోజు ఈ నెల 13వ తేదీన నోవాటెల్ హోటల్ లో అతిథులకు ముఖ్యమంత్రి విందు ఇవ్వనున్నారు. ఈ నెల 14వ తేదీన సదస్సు ప్రారంభానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తోపాటు మిగిలిన మంత్రివర్గం మొత్తం రెండు రోజులపాటు విశాఖలోనే బస చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
1600 సీటింగ్ సామర్థ్యం
సదస్సు కోసం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మొత్తం 8 హాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి హాలులో డెలిగేట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతారు. రెండో హాలును వివిధ కంపెనీలు ప్రభుత్వశాఖల స్టాళ్ల ఏర్పాటుకు మూడో హాలును డెలిగేట్ల భోజన ఏర్పాట్లకు కేటాయించారు. నాలుగో హాలులో మూడు మినీ హాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ డెలిగేట్లతో ప్రభుత్వ ప్రతినిధుల ముఖాముఖి భేటీలు ఉంటాయి. ఐదో హాలులో ప్రధాన వేదికను 1,600 మంది ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరో హాలులో సీఎం లాంజ్, భద్రత, ఇతర సిబ్బందికి గదులు ఉంటాయి. ఏడో హాలులో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూశ్ గోయల్ కు ప్రత్యేకంగా లాంజ్ ఏర్పాటు చేశారు. 8వ హాలును ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు కేటాయించారు.
