విశాఖ ‘చర్చ్’లో మిస్టరీ మరణాలు.. అసలేం జరిగింది..?
విశాఖ నగరంలోని ఓ చర్చిలో బాలిక మృతి మిస్టరీగా మారింది. బాలిక మరణించిన వెంటనే ఆమె తల్లి, అమ్మమ్మ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 30 April 2025 10:11 AM ISTవిశాఖ నగరంలోని ఓ చర్చిలో బాలిక మృతి మిస్టరీగా మారింది. బాలిక మరణించిన వెంటనే ఆమె తల్లి, అమ్మమ్మ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. వరుసగా ముగ్గురు మరణించడంతో ‘చర్చ్’లో ఏం జరిగిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటనతో మృతుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు బాలిక మరణానికి కారణమేంటి? బాలిక మరణిస్తే.. తల్లి, అమ్మమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనేది సస్పెన్స్ గా మారింది.
విద్య, వైద్య రంగాల్లో ప్రపంచం ఎంతగా పురోగతి సాధిస్తున్నా, కొందరు మూఢనమ్మకాలను మాత్రం వదలడం లేదని విశాఖ ఘటన తెలియజేస్తోందని అంటున్నారు. జబ్బు చేస్తే డాక్టర్లు వద్దకు వెళ్లాల్సిన వారు తాయెత్తులు కట్టించుకోవడమో.. చర్చ్, మసీదుల్లో ప్రార్థనలు చేస్తే తగ్గిపోతుందనే భ్రమలోనే గడిపేస్తున్నారని అంటున్నారు. ఈ విధంగానే విశాఖలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ బాలికను ప్రార్థన నిమిత్తం చర్చ్ కు తీసుకువచ్చారని చెబుతున్నారు. ఏమైందో కానీ ఆ బాలిక మరణించగా, ఆ వెంటనే తల్లి, అమ్మమ్మ కూడా ప్రాణాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన 11 ఏళ్ల బాలిక విశాఖలోని జ్ఞానాపురం చర్చిలో బలిపీటం దగ్గర మృతి చెందిందని బంధువులు చెబుతున్నారు. ఆ చిన్నారికి గాలి సోకిందనే కారణంతో తల్లి, అమ్మమ్మ కలిసి చర్చికి తీసుకువచ్చారని అంటున్నారు. ఐతే బాలిక ముఖానికి చున్నీ చుట్టి, నోట్లో గుడ్డలు కుక్కిన స్థితిలో మృతదేహం లభించడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో విషయం పోలీసుల వద్దకు వెళ్లడంతో వారు బాలిక తల్లి, అమ్మమ్మను పిలిచి ప్రశ్నించారు. ఈ సమయంలో మీడియా కూడా బాలిక మృతి మిస్టరీపై ప్రశ్నించినా ఆ ఇద్దరు నోరు విప్పలేదు.
ఇది జరిగిన రెండు రోజులకే బాలిక తల్లి, అమ్మమ్మ కొద్దిగా నీళ్లున్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల విచారణకు భయపడి వారు ఆత్మహత్య చేసుకున్నారా? లేక బాలిక మృతి మిస్టరీ వీడుతుందని భయంతో వేరెవరైనా వారిని ఏమైనా చేశారా? అనేది అనుమానిస్తున్నారు. చర్చిలో ఏదో జరిగిందని.. అందుకే బాలిక మరణించిందని కొందరు అంటుండగా, బాలికను అదుపు చేసే ఉద్దేశంతో నోట్లో గుడ్డలు కుక్కి ఉంటారని ఈ క్రమంలో ఊపిరాడక బాలిక మరణించి ఉంటుందని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హఠాత్తుగా మరణించడంపై స్థానికంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.