Begin typing your search above and press return to search.

మిడిల్ క్లాస్ కి వీమ్మార్డీయే భారీ గిఫ్ట్ !

ఈ నేపధ్యంలో విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ విఎమ్మార్డీయే మధ్యతరగతి వర్గాల మీద ఆదరణ చూపుతోంది.

By:  Tupaki Desk   |   10 May 2025 3:45 AM
మిడిల్ క్లాస్ కి వీమ్మార్డీయే భారీ గిఫ్ట్ !
X

మధ్యతరగతీ అథోగతీ అని అనుకునే రోజులు ఇవి. ఏ విధంగా చూసినా మధ్యతరగతి వర్గాలకు ఇబ్బందులే తప్ప న్యాయం జరగడం లేదు. కనీసం ఉండేందుకు ఒక సొంత గూడు కూడా లేకుండా పోతోంది. అరకోటి పోస్తే కానీ ఒక స్మాల్ సైజ్ ఫ్లాట్ రావడం లేదు. అంత స్తోమత లేని వారు అంతా అద్దె ఇళ్ళలో ఉంటూ ఆర్థికంగా అన్నీ భరిస్తున్నారు.

ఇక విశాఖలో చిరుద్యోగాలు చేస్తూ పొట్ట పోసుకునే వారు ఈ అద్దెల మద్దెల దరువుకు హాహాకారాలు పెడుతున్నారు. తమకు కూడా సొంతింటి కళను తీర్చాలని ప్రభుత్వాలను కోరుతున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు.

ఈ నేపధ్యంలో విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ విఎమ్మార్డీయే మధ్యతరగతి వర్గాల మీద ఆదరణ చూపుతోంది. టీడీపీ యువ నేత కొత్తగా చైర్ పర్సన్ గా బాధ్య్తలు స్వీకరించిన ప్రణవ్ గోపాల్ అయితే విశాఖలోని మిడిల్ క్లాస్ కోసం ప్రత్యేకంగా అపార్ట్మెంట్లు నిర్మిస్తామని ఒక కీలక ప్రకటన చేశారు.

దాని వల్ల వారు ఆర్ధికంగా బాగా వెసులుబాటు పొందుతారని అదే సమయంలో విశాఖ లాంటి మెగా సిటీలో వారికంటూ ఒక సొంత గూడు దొరుకుందని ఆయన చెబుతున్నారు. ఇది నిజంగా విఎమ్మార్డీయే చేస్తున్న మంచి ప్రయోగం గా చెబుతున్నారు.

నిజానికి ప్రైవేట్ రంగంలో రియల్టర్ల కాంపిటేషన్ ని బాలెన్స్ చేస్తూ సరసమైన ధరలకు ఫ్లాట్లు ప్లాట్లూ దొరికేలా చూడడానికే విఎమ్మార్డీయే వ్యవహరించాల్సి ఉంది. ఇపుడు ఆ పనిని కొత్త చైర్ పర్సన్ చేస్తున్నారు అని అంటున్నారు.

వీటికి బడ్జెట్ హౌసింగ్ అపార్ట్మెంట్లుగా పేరు పెట్టారు. నగర పరిధిలో వీటిని పెద్ద ఎత్తున నిర్మిస్తామని చెబుతున్నారు. ఈ బడ్జెట్ హౌసింగ్ అపార్ట్మెంట్లుజ్ మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకే అని అంటున్నారు. విశాఖ పరిధిలో ఈ బడ్జెట్ హౌసింగ్ అపార్ట్మెంట్ల విషయంలో ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు, వారి ప్రయోజనాలు వారి ఆలోచనలు అవసరాలు సలహాలు సూచనలు తెలుసుకునేందుకు ఒక సమగ్ర సర్వేను విఎమ్మార్డీయే నిర్వహించతలపెట్టింది.

ఈ సర్వే ద్వారా వచ్చిన ఫలితాల మేరకు దానిని అనుగుణమైన విధంగా ప్రణాళికలు విఎమ్మార్డీయే రూపొందిస్తుందని చెబుతున్నారు. ఈ సంగ్ర సర్వే కోసం విఎమ్మార్డీయే క్యూ ఆర్ కోడ్ తో కూడిన ప్రకటన బోర్డులను నగరంలో ముఖ్య కూడలుల్లో ప్రదర్శిస్తుంది. ఆసక్తి కలిగిన ప్రజలు ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే వారికి సర్వే అప్లికేషన్ వస్తుంది,

అందులోనే వారు తమ అభిప్రాయాలను తెలియచేసి తిరిగి అప్ లోడ్ చేయాలని విఎమ్మార్డీయే కోరుతోంది. ఆ మీదట ఒక అవగాహనతో బడ్జెట్ హౌసింగ్ అపార్ట్మెంట్ల నిర్మాణానికి విఎమ్మార్డీయే సిద్ధం అవుతుందని అంటున్నారు. మొత్తానికి విశాఖలోని మిడిల్ క్లాస్ కి ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పాల్సిందే.