భోగాపురం ఎయిర్ పోర్టుకు తక్కువ ఖర్చుతో ఎలా చేరుకోవచ్చు?
విశాఖ వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే రోజులు దగ్గరకు వచ్చేశాయి.
By: Garuda Media | 30 July 2026 10:40 AM ISTవిశాఖ వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే రోజులు దగ్గరకు వచ్చేశాయి. అధికారికంగా శనివారం నుంచి ప్రారంభం అవుతున్నా.. పూర్తిస్థాయిలో విమానాశ్రయ సేవలు మొదలయ్యేది మాత్రం ఆగస్టు 17 (అంటే ఆగస్టు 16 అర్థరాత్రి 12 గంటల) నుంచి అని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు తలెత్తే వీలుంది. ఇందులో మొదటిది.. విశాఖపట్నం నుంచి భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలంటే ఎంత సమయం పడుతుంది?
దీనికి సమాధానం వెతికితే.. విశాఖపట్నం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు సమయాలు పట్టే వీలుంది. వైజాగ్ నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకోవాలంటే గంట సమయం పుడుతుంది. అదే బీచ్ రోడ్.. రిషికొండ ప్రాంతం నుంచి భీమిలి మీదుగా వెళితే మాత్రం 45 నిమిషాల నుంచి 50 నిమిషాల సమయం పడుతుంది. ఒకవేళ..ఇప్పుడు పాత ఎయిర్ పోర్టు ఉన్న గాజువాక.. స్టీల్ ప్లాంట్ నుంచి కొత్త ఎయిర్ పోర్టుకు చేరుకోవాలంటే మాత్రం 1 గంట 15 నిమిషాల నుంచి నుంచి ఒకటిన్నర గంటల సమయం పడుతుంది. ఇప్పటి వరకు గాజువాక.. స్టీల్ ప్లాంట్ వాసులు మహా అయితే పది నుంచి పదిహేను నిమిషాల్లో పాత ఎయిర్ పోర్టుకు చేరుకునే వారు. కొత్త ఎయిర్ పోర్టుకు మాత్రం వారికి పట్టే సమయం చాలా.. చాలా ఎక్కువని చెప్పక తప్పదు.
రాబోయే రోజుల్లో ఈ దూరభారాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం పలు ప్రణాళికల్ని సిద్ధం చేసింది. అందులో భాగంగా బీచ్ రోడ్ విస్తరణ (ఆరు లైన్ల కనెక్టివిటీ రోడ్ పనులు).. మెట్రో కనెక్టివిటీ లాంటివి. అయితే.. అవన్నీ అందుబాటులోకి రావటానికి కొన్నేళ్లు పడతాయని చెప్పక తప్పదు. మరి.. ఇప్పటి సంగతి ఏంటి? అన్న ప్రశ్నలోకి వెళితే మాత్రం.. కొత్త ఎయిర్ పోర్టుకు చేరుకోవాలంటే దూరంతో పాటు.. కాస్తంత భారమనే చెప్పాలి.
ఎందుకంటే.. విశాఖపట్నం నుంచి భోగాపురం కొత్త ఎయిర్ పోర్టుకు కనిష్ఠ దూరం 36 కి.మీ. అయితే.. గరిష్ఠ దూరం దాదాపు 60-65 కి.మీ. ఉంటుంది. అతి తక్కువ దూరం నగరానికి ఉత్తర భాగాన ఉన్న రుషికొండ..మధురవాడ ఐటీ హిల్స్ పరిసరాలుగా చెప్పాలి. ఇక్కడ నుంచి కొత్త ఎయిర్ పోర్టుకు కేవలం 36 కి.మీ. మాత్రమే. అదే సమయంలో వైజాగ్ సిటీ సెంట్రల్ అంటే.. ద్వారకా నగర్, ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల నుంచి జాతీయ రహదారి 16 మార్గంలో కొత్త ఎయిర్ పోర్టు 43.5 కి.మీ. అదే.. పాత విమానాశ్రయం నుంచి కొత్త ఎయిర్ పోర్టుకు దూరం సుమారు 55కి.మీ. ఉండనుంది. ఇక.. నగరానికి దక్షిణం వైపు ఉండే గాజువాక.. కూర్మన్నపాలెం.. స్టీల్ ఫ్లాంట్ ప్రాంతాల వారికి కొత్త విమానాశ్రయం చాలా దూరం. ఇక్కడ గరిష్ఠంగా 59కి.మీ. నుంచి 65కి.మీ వరకు ఉంటుంది.
ఎయిర్ పోర్టు చేరుకోవటానికి క్యాబ్ బుక్ చేసుకుంటే కనిష్ఠంగా రూ1100, గరిష్ఠంగా రూ.2వేల వరకు ఖర్చు కానుంది. మధురవాడ.. రుషికొండ..భీమిలి ప్రాంతాల నుంచి అయితే మాత్రం రూ.వెయ్యి నుంచి రూ.1200 లోపు ఖర్చు కానుంది. అదే.. ఆర్టీసీ కాంప్లెక్స్.. జగదాంబ.. సిరిపురం లాంటి ప్రాంతాల నుంచి మాత్రం రూ.1200 నుంచి రూ.1500 వరకు ఖర్చు రానుంది. ఒకవేళ గాజువాక.. స్టీల్ ప్లాంట్ వైపు నుంచి కొత్త ఎయిర్ పోర్టుకు క్యాబ్ లో చేరుకోవాలంటే మాత్రం రూ.1600 నుంచి రూ.2వేల వరకు ఖర్చు కానుంది.
ఈ దూర భారాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా వీలైనంత తక్కువ ఖర్చుతో చేరుకునేలా ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా విశాఖ నగర వ్యాప్తంగా 9 ఏసీ లాంజ్ లను ఏర్పాటు చేస్తోంది. భోగాపురం ఎయిర్ పోర్టు కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 20 ఎలక్ట్రిక్ బస్సుల్ని నడపనుంది. ఏరో బస్సుల పేరుతో విశాఖ నుంచి ప్రతి అరగంటకు ఒకటి చొప్పున బయలుదేరేలా ప్లాన్ చేశారు. ప్రయాణికుల మీద భారం తగ్గించేందుకు వీలుగా ఏరో బస్సుల్లో టికెట్ ధర రూ.150 ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే.. లగేజ్ ఎక్కువ ఉన్న వారికి ఏరో బస్సు కంటే క్యాబ్ లోనే ప్రయాణించేందుకు మక్కువ చూపుతారని చెప్పాలి.
విశాఖ నుంచి భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్టు చేరుకోవటానికి చాలా మార్గాలు ఉన్నప్పటికి.. నగరం మధ్యలో నుంచి వెళ్లాలంటే మాత్రం ట్రాఫిక్ చిక్కుల్లో చిక్కుకోవటం ఖాయం. ఆ సమస్యను పరిష్కరించేందుకు జాతీయ రహదారిపై ఒత్తిడి తగ్గించేందుకు పదిహేను ప్రత్యామ్నాయ రహదారులను విస్తరిస్తున్నారు. అందులో తొలుత ఏడు మార్గాల్ని డెవలప్ చేశారు. అన్ని అందుబాటులోకి రావటానికి కాస్తంత సమయం పట్టనుంది. మొత్తంగా మొదట్లో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోక తప్పదు.
