విశ్వనగరంగా విశాఖ.. చంద్రబాబు ప్రకటన.. విషయం ఏంటంటే!
ఇప్పటికే గూగుల్ డేటా కేంద్రం, ఇన్ఫోసిస్ పెట్టుబడులు, విజయనగరంలో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ ప్రకటన చేశారని అనుకోలేం. దీనికి మరో రీజన్ కూడా ఉంటుంది.
By: Garuda Media | 20 Sept 2026 8:00 AM ISTవిశ్వనగరంగా విశాఖ మారుతుందని.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటుందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. తాజాగా విశాఖలో పర్యటించిన ఆయన..` పేదలకు పట్టాభిషేకం` పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వందలాది మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అయితే.. విశాఖ విషంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఇప్పటికే గూగుల్ డేటా కేంద్రం, ఇన్ఫోసిస్ పెట్టుబడులు, విజయనగరంలో అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం వంటివి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ ప్రకటన చేశారని అనుకోలేం. దీనికి మరో రీజన్ కూడా ఉంటుంది.
ఇటీవల అంతర్జాతీయ సంస్థ.. వెలువరించిన ఓ నివేదికలో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టుబడులకు రవాణాకు కూడా అత్యంత అనుకూలమైన నగరంగా విశాఖను పేర్కొనడం గమనార్హం అదేసమయంలో ఇక్కడ భూములు కూడా అందుబాటులో ఉండడం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా చేరువలోనే(70 కిలో మీటర్ల దూరంలో) ఉండడం వంటివి విశాఖను విశ్వనగరంగా మారుస్తున్నాయని చంద్రబాబు భావిస్తున్నారు. ఈవిషయాన్ని ఆయన ప్రత్యేకంగా చెప్పకపోయినా.. ఆయన అభిప్రాయం మాత్రం ఇదే కావడం గమనార్హం.
ప్రస్తుతం విశాఖ తీరుతెన్నులు ఇవీ..
విశాఖపట్నం దేశంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ హబ్‌గా మారుతోంది. భారీ ఐటీ పార్కులు, కొత్త ఐటీ పార్కుల నిర్మాణం కోసం దాదాపు 1,000 ఎకరాల భూమిని కేటాయించేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇందులో డిఎల్‌ఎఫ్, హిరనందిని వంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయి. ప్రముఖ కంపెనీల విస్తరణ కూడా నగరానికి మరింత పేరు వచ్చేలా చేస్తోంది. గూగుల్ సంస్థ సుమారు 1.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో మెగా డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తుండగా, టీసీఎస్, కాగ్నిజెంట్, ఐబీఎం, డెలాయిట్ వంటి దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.
దీని ద్వారా నగరంలో వేలాది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.ఇక, కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల విషయానికి వస్తే.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.. వైజాగ్ సమీపంలోనే ఉంది. దీని కనెక్టివిటీ కోసం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏడు ప్రధాన మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మిస్తోంది. మెట్రో రైల్, రోడ్ల విస్తరణ: విశాఖ మెట్రో రైల్ ఫేజ్-1 టెండర్ల ప్రక్రియ పురోగతిలో ఉండగా, జాతీయ రహదారి సిక్స్-లేన్ విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతున్నాయి. ఇలా.. విశాఖ నగరంలో జరుగుతున్న అభివృద్ధిని పేర్కొంటూ.. సీఎం చంద్రబాబు విశ్వనగరంగా ఇది అభివృద్ధి చెందుతోందని చెబుతున్నారు.
