Begin typing your search above and press return to search.

ఫ్లాష్ బ్యాక్ ట్రాజడీ: బాంబుల దాడితో భీతిల్లిన విశాఖ

ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే విశాఖపట్నం, కాకినాడ తీర ప్రాంత పట్టణాల మీద జపాన్ సైన్యం మెరుపు దాడులు చేసి బాంబులు కురిపించింది.

By:  Satya P   |   6 April 2026 4:33 PM IST
ఫ్లాష్ బ్యాక్ ట్రాజడీ: బాంబుల దాడితో భీతిల్లిన విశాఖ
X

సరిగ్గా ఇదే రోజు 1942 ఏప్రిల్ 6న రెండవ ప్రపంచ యుద్ధం సాగుతున్న సమయం. నాడు అంతర్జాతీయంగా బలంగా ఉంది బ్రిటిష్ ప్రభుత్వం. భారత్ సహా అనేక దేశాలలో తన పాలన చేస్తోంది. ఆ సమయంలో జపాన్ సైన్యానికి బ్రిటిష్ వారికి మధ్య జరిగిన సమరంలో బ్రిటిష్ ఏలుబడిలో ఉన్న దేశాల మీద నగరాల మీద జపాన్ సైన్యం పెద్ద ఎత్తున బాంబులతో దాడి చేసింది. అలా భారత్ లో పలు చోట్ల బాంబుల వర్షం కురిపించింది. ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే విశాఖపట్నం, కాకినాడ తీర ప్రాంత పట్టణాల మీద జపాన్ సైన్యం మెరుపు దాడులు చేసి బాంబులు కురిపించింది.

అంతా చెల్లా చెదురు :

విశాఖలో నాడు అనూహ్యంగా జరిగిన జపాన్ సైన్యం బాంబు దాడులతో ప్రజానీకం అంతా భయ భ్రాంతులు అయ్యారు. అంతా ఎక్కడివారు అక్కడ ఆందోళనతో విశాఖను వదిలి ఇతర ప్రాంతాలకు పరుగులు తీశారు. అలా సమీపంలోని అనకాపల్లి. అలాగే విజయనగరం, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ బాంబుల దాడితో విశాఖ నగరం జన వాసాలు లేకుండా నిర్మానుష్యం అయిపోయింది. అలా కొంత కాలం వరకూ అదే భయం జనాలను పట్టి పీడించింది. విశాఖ రావాలంటేనే హడలిపోయిన నేపథ్యం ఉంది. ఆనాటి జపాన్ బాంబుల దాడిలో విశాఖలో కొంత మేర ఆస్తులకు నష్టం వాటిల్లింది, అలాగే అనేక మంది ప్రజలు ఈ బాంబుల దాడిలో మరణించారు. ఈ యుద్ధం సద్దుమణిగాక తిరిగి జనాలు అంతా మెల్లగా విశాఖ చేరుకుని తన జీవితాలను కొనసాగించారు. అలా ఆనాడు ఒక చిన్న పట్టణంగా ఉన్న విశాఖ ఈ రోజున మహా నగరం స్థాయికి చేరుకుంది అని గత జ్ఞాపకాలను అంతా నెమరేసుకుంటారు.

తరలిపోయిన ఏయూ :

విశాఖ మీద బాంబుల దాడి నేపధ్యంలో సురక్షితం కాదని భావించి అప్పటికి 16 ఏళ్ళ పాటు కొనసాగుతున్న ఏయూని గుంటూరుకు తరలించారు. ఏ క్షణం ఏమి జరుగుతుందో అన్న భయంతో గుంటూరులోనే ఏయూని ఏకంగా మూడేళ్ళ పాటు నడిపారు. తిరిగి 1945లో ఏయూ విశాఖకు రావడం తన కార్యకలాపాలను అదే చోట నుంచి మరింత వేగంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ రోజున ప్రపంచ ప్రమాణాలతో సాగుతున్న విశ్వవిద్యాలయాలలో ఏయూ ఒకటిగా ఉంది. ఇక ఆనాడు జపాన్ సైన్యం జరిపిన బాంబు దాడిని ఎదుర్కోవడానికి బ్రిటిష్ సైన్యం ఏయూని మిలటరీ క్యాంపులుగా మార్చుకుంది. అక్కడ నుంచి విశాఖ రక్షణ బాధ్యతతో పాటు ఈ బాంబు దాడులను ఎదుర్కొని జపాన్ సైన్యం మీదకు తిరిగి దాడి చేసింది. అలా ఏయూ నాడు ఒక సైనిక స్థావరంగా కూడా మారింది అని గుర్తు చేస్తున్నారు.

నాటి గురుతులు అలా :

విశాఖ మీద జరిగిన బాంబు దాడి ఆనాడు జపాన్ ప్రయోగించిన బాంబులు వాడిన ఆయుధాలు ఇవన్నీ విశాఖ మ్యూజియంలో నేటికీ పదిలంగా ఉన్నాయి. అంతే కాదు ఈ బాంబుల దాడిలో మరణించిన వారి పేర్లు వివరాలు కూడా అందులో నిక్షిప్తం చేశారు. ఈ బాంబుల దాడి తరువాతనే కోస్తా తీరంలో కీలకమైన పట్టణంగా ఉన్న విశాఖకు రక్షణ కల్పించేందుకు నాటి బ్రిటిష్ ప్రభుత్వం విశాఖ భీమిలీ మధ్యలో పటిష్టమైన ఎయిర్ ఫీల్డ్ ని ఏర్పాటు చేసింది. తరువాత కాలంలో తూర్పు నావికా దళంగా ఇది విస్తరించింది. విశాఖకు దుర్భేధ్యమైన రక్షణ కవచంగా తూర్పు నావికా దళం ఈ రోజున పెద్ద ఎత్తున విధులను నిర్వహిస్తోంది. వీటి సంగతి పక్కన పెడితే ఈ రోజుకి 84 ఏళ్ళు గడచినా విశాఖ మీద బాంబుల దాడి జరిగిన ఏప్రిల్ 6ని ఎవరూ మరచిపోరు. గత జ్ఞాపకాలను తమ పూర్వీకులు చెప్పిన విషయాలను గుర్తు చేసుకుని ఒకింత త కలవరపాటుకు గురి అవుతారు.