ఫ్యూచర్ ఆఫ్ విశాఖ : సెమీ రింగ్ రోడ్డుతో బంగారు దశ
విశాఖపట్నం ఆసియా ఖండంలోనే శర వేగంగా ఎదుగుతున్న మహా నగరం. విభజన ఏపీలో ఈ రోజున ఉన్న అతి పెద్ద నగరం.
By: Satya P | 10 May 2026 12:00 AM ISTవిశాఖపట్నం ఆసియా ఖండంలోనే శర వేగంగా ఎదుగుతున్న మహా నగరం. విభజన ఏపీలో ఈ రోజున ఉన్న అతి పెద్ద నగరం. విశాఖ సహజ సిద్ధమైన అందాలకు తోడు అభివృద్ధి అభివృద్ధి కూడా జోరు అందుకుంటోంది. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులు విశాఖకు వస్తున్నాయి. దాంతో విశాఖ మరో యాభై ఏళ్ళలో ఊహించని అభివృద్ధిని సాధిచనుంది. దాంతో విశాఖ ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే అనేక కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చేపడుతోంది. అందులో భాగంగా ఏకంగా 102 కిలోమీటర్ల దూరంతో భారీ సెమీ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ బృహత్తర పధకానికి తొందరలోనే శ్రీకారం చుట్టనున్నారు.
విశాఖకి కొత్త డిజైన్ :
ప్రస్తుతం ఉన్న విశాఖ భవిష్యత్తును పునర్నిర్మించనున్న తీరులో 102 కిలోమీటర్ల సెమీ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుంది అని తెలుస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ తెలియచేశారు. ఈ రోజు విశాఖ కోసం కాదు మరో యాభై ఏళ్ల తరువాత భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని తాను భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నామని మంత్రి చెబుతున్నారు. ఇక సెమీ రింగ్ రోడ్డు అన్నది విశాఖపట్నం రాబోయే యాభై ఏళ్ల అభివృద్ధికి తోడ్పడేందుకు ప్రముఖ సాధనం అవుతుందని ఆయన చెప్పారు. ఈ సెమీ రింగ్ రోడ్డు అయితే అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి నుండి విజయనగరం జిల్లాలోని భోగాపురం వరకూ 102 కిలోమీటర్ల దూరంతో విస్తరించి ఉంటుందని ఆయన వెల్లడించారు. దీంతో విశాఖకు భారీ సెమీ రింగ్ రోడ్డుని కూటమి ప్రభుత్వం మంజూరు చేసిందని మంత్రి నారాయణ ప్రకటించారు.
డీపీఆర్ సిద్ధం :
ఇక ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి సంబంధించి డీపీఆర్ ఈ నెలలో సిద్ధం కానుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ తో ఉత్తరాంధ్ర వేగవంతమైన అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. అంతే కాదు ఉమ్మడి ఉత్తరాంధ్ర ప్రగతి దారులు తెరచుకుంటాయని చెప్పారు. ఇక భోగాపురంలో అంతర్జాతీయ స్థాయిలో కొత్త విమానాశ్రయం తొందరలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తుందని దాంతో భోగాపురం ఎయిర్ పోర్టుకు ఏడు అనుసంధాన రహదారుల నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఇందులో ప్రతిపాదిత బీచ్ కారిడార్ కూడా ఉంది. అదే విధంగా విశాఖ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 14 వేల కోట్ల రూపాయలతో తాగునీటి ప్రాజెక్టును కూడా కూటమి ప్రభుత్వం మంజూరు చేసింది. దాంతో విశాఖలో భవిష్యత్తులో తాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ పడుతుందని అంటున్నారు.
