Begin typing your search above and press return to search.

విశాఖ రాజధాని...ప్లాన్ బీతో జగన్ దూకుడు

దాంతో ప్లాన్ బీని వైసీపీ అమలు చేయడానికి రెడీ అవుతోంది. విశాఖలో ముఖ్యమంత్రి జగన్ మకాం ఈ విజయదశమి నుంచి మారుస్తారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   7 Sep 2023 3:22 AM GMT
విశాఖ రాజధాని...ప్లాన్ బీతో జగన్ దూకుడు
X

విశాఖను పాలనా రాజధాని చేయాలని వైసీపీ కలలు కంటోంది. అవి సాకారం అయ్యేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తి అవుతోంది. మళ్లీ ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే మూడు రాజధానుల బిల్లుని ప్రవేశపెట్టి చట్టం చేసింది కానీ విపక్షాల తీవ్ర వ్యతిరేకత అమరావతి రైతుల ఉద్యమాల మధ్య కోర్టు దాకా వివాదం వెళ్లింది. దాంతో అమరావతి రాజధానికే అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టులో ప్రభుత్వం కేసు వేసింది. అక్కడ విచారణ సాగుతోంది. అయితే ఎన్నికలలోగా తీర్పు వస్తుందా రాదా అన్నది ఎవరికీ తెలియదు. దాంతో ప్లాన్ బీని వైసీపీ అమలు చేయడానికి రెడీ అవుతోంది. విశాఖలో ముఖ్యమంత్రి జగన్ మకాం ఈ విజయదశమి నుంచి మారుస్తారు అని అంటున్నారు.

ఆ రోజున విశాఖలో తన కొత్త ఇంట్లో నుంచి జగన్ పాలనాపరమైన యాక్టివిటీని స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. రుషికొండ వద్ద కొత్తగా నిర్మిస్తున్న భవనాలలో జగన్ నివాసం ఉంటారు. ఆయన విశాఖ ఎంపీ భవనంలో క్యాంప్ ఆఫీసుని ఏర్పాటు చేసుకుంటారు అని అంటున్నారు.

వారంలో మూడు రోజులు జగన్ విశాఖలో ఉంటూ పాలన సాగిస్తారు అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నుంచి బుధవారం వరకూ జగన్ విశాఖలో ఉంటారని, గురువారం నుంచి శనివారం వరకూ తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసు నుంచి పాలన చేస్తారు అని అంటున్నారు. అలా రెండు చోట్లా రాజధానులను జగన్ ఉనికిలో ఉంచబోతున్నారు. మూడవ రాజధానిగా కర్నూల్ లో ఎన్నికలలోగా న్యాయ శాఖ కార్యాలయాలు కొన్ని అయినా షిఫ్ట్ చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వం అనుకుంటున్న మూడు రాజధానులను మరో విధంగా సాకారం చేయడానికి వైసీపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది అని అంటున్నారు.

ఇక విశాఖలో పాలనా రాజధాని అంటే దానికి అనుగుణంగానే అడుగులు వేగంగా పడుతున్నాయని అంటున్నారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ హోదాను ఒక్కసారిగా పెంచేశారు. ఈ మేరకు హోం శాఖ నుంచి తాజాగా ఉత్తర్వులు వచ్చాయి. ఇప్పటి దాకా ఐజీ ర్యాంక్ హోదాలో ఉన్న విశాఖ కమిషనరేట్ ని అడిషనల్ డీజీ హోదాకు అప్ గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఈ పరిణామంతో విశాఖకు రాజధాని కళ కట్టిందని అంటున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అమరావతి రాజధానిగా చేశారు. ఆ టైం లో విజయవాడ పోలీస్ కమిషనరేట్ ని అడిషనల్ డీజీ హోదాకు పెంచేశారు. ఇపుడు జగన్ కూడా అదే చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిని స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగంలోకి తీసుకుని వచ్చారు.

ముఖ్యమంత్రి ఉన్న సిటీ అంటే పోలీసులకు లా అండ్ ఆర్డర్ కత్తి మీద సాముగా ఉంటుంది. దాంతో పవర్స్ ని పరిధిని పెంచుతూ విశాఖ పోలీస్ కమిషనరేట్ స్టాటస్ ని పెంచారు అని అంటున్నారు జగన్ విశాఖ నుంచి పాలన చేయడం ఖాయమని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయని అంటున్నారు.