Begin typing your search above and press return to search.

విశాఖ రాజధాని ప్రకటన...విపక్షం నుంచి నో రియాక్షన్

ఎన్నికల వేళకు ఉత్తరాంధ్రా నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలెడితే తూర్పు బాగా కలసి వచ్చి రాజకీయంగా అది అంతిమంగా వైసీపీకి మేలు చేకూరుస్తుంది అని ఆయన భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 3:59 AM GMT
విశాఖ రాజధాని ప్రకటన...విపక్షం నుంచి నో రియాక్షన్
X

విశాఖ నుంచి పరిపాలన చేస్తాను అని అంటూ జగన్ చాలా బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది కూడా ఒక కీలక కార్యక్రమంలో మాట్లాడారు. ఎక్కడా ఆయన మనసులో ఏదీ దాచుకోకుండా కుండబద్ధలు కొట్టేశారు. డిసెంబర్ నుంచి నేను విశాఖలోనే ఉంటాను అన్నారు జగన్

విశాఖ రాజధాని అని జగన్ అంటే రీ సౌండ్ వస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ ఇపుడు చూస్తే ఏపీ రాజకీయాలో విపక్షం సైలెంట్ గానే ఉంది. అమరావతి రాజధాని అంటూ ఎపుడూ బిగ్ సౌండ్ చేసే టీడీపీ ఈ విషయంలో పెద్దగా స్పందించకపోవడం వెనక కారణం ఏంటి అన్న చర్చ మొదలైంది.

అదే టైంలో ఇప్పటిదాకా విశాఖ రాజధాని అంటే ఇంతెత్తున ఎగిరిపడే జనసేన ఇతర పార్టీ నేతలు కూడా ఏ మాత్రం పట్టించుకున్నట్లుగా కనిపించడంలేదు. బీజేపీ అయితే ఫుల్ సైలెంట్ గా ఉంది. మరి దీని భావమేమి అన్నట్లుగానే చూడాల్సి వస్తోంది. నిజానికి విశాఖ రాజధాని అని జగన్ చెప్పడం వెనక కూడా చాలా రీజన్స్ ఉన్నాయి.

ఎన్నికల వేళకు ఉత్తరాంధ్రా నుంచి తన రాజకీయ ప్రస్థానం మొదలెడితే తూర్పు బాగా కలసి వచ్చి రాజకీయంగా అది అంతిమంగా వైసీపీకి మేలు చేకూరుస్తుంది అని ఆయన భావిస్తున్నారు. అదే టైం లో మూడు రాజధానులు అన్న వైసీపీ ప్రతిపాదనను ఏ విధంగా అయినా అమలు చేసి చూపించామన్న నమ్మకాన్ని జనంలో కలుగచేయడం, మాట ఇస్తే మడమ తిప్పమని చెప్పుకోవడం వంటివి ఉన్నాయి.

ఇక అమరావతి రాజధాని కాకుండా విశాఖను చేసుకోవడం వల్లనే ఏపీ బాగుపడుతుందని జగన్ చెబుతూ వస్తున్నారు. రెడీ మేడ్ సిటీ అంటున్నారు. తాజాగా ఇంఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెనింగ్ లో సైతం జగన్ ఇదే మాట్లాడారు. ఏపీకి విశాఖ ఒక వరం అన్నట్లుగా కూడా పేర్కొన్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం విశాఖకు రాజధాని వద్దు అని ఏమీ అనలేకపోతున్నారు. ఉత్తరాంధ్రా మీద ఇపుడు ప్రేమ వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. రుషికొండ మీద టూరిజం కట్టడాలు అని చెప్పడం ఎందుకు ముఖ్యమంత్రి కోసం నిర్మాణాలు అని చెప్పవచ్చు కదా అని కూడా అంటున్నారు.

ఇలా విపక్షాలు అన్నీ సైలెంట్ గానో లేక మరో విధంగానో ఉండడానికి కారణం ఏమిటి అన్న చర్చ అయితే వస్తోంది. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఎన్నికలను ముందు పెట్టుకుని విశాఖ రాజధాని సెంటిమెంట్ తో చెలగాటం ఆడడం ఎందుకు అన్నది ఒక కారణం అయితే ఎటూ ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి తుది తీర్పు కోసం వేచి చూడకుండా మధ్యలో ఈ వాదనలు ఎందుకు అన్నది మరో రీజన్ అంటున్నారు.

ఏది ఏమైతేనేం జగన్ విశాఖ నుంచి పాలన అంటే మాత్రం ఏ పార్టీ సరిగ్గా రియాక్ట్ కాలేదు కానీ వామపక్షాలు మాత్రం మండిపోతున్నాయి. సీపీఐ రామక్రిష్ణ దీని మీద ఏకంగా జగన్ మీదనే విమర్శలు కురిపించారు. రాష్ట్ర రాజధాని అంశం సుప్రీంకోర్టులో విచారణలో వుండగా, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేయడం తగదని ఆయన అన్నారు.

జగన్ కి కోర్టులంటే లెక్కలేనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సిఎం వ్యక్తిగత నివాసాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అవకాశం వుందని, అయితే రాజధాని అంశం సుప్రీంకోర్టులో విచారణలో వుండగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులున్న రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఇలా సీపీఐ నుంచి మాత్రమే రాజధాని అంశం మీద విమర్శలు వచ్చాయి. మొత్తానికి చూస్తే జగన్ అనుకున్నది అనుకున్నట్లుగా విశాఖకు మకాం మార్చేందుకు మాత్రం అంతా సిద్ధంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది.