Begin typing your search above and press return to search.

సీతమ్మ‌కు తాళి క‌ట్టేసిన వైసీపీ ఎమ్మెల్యే.. ఎక్క‌డ‌? ఎందుకు?

రాములోరి కల్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీరాముడి తరుపున వేదపండితులు సీతమ్మ మెడలో వేయాల్సిన తాళిబొట్టు.

By:  Tupaki Desk   |   8 April 2025 11:07 AM IST
Virupakshi Controversy
X

సీత‌మ్మ‌కు చేయిస్తి.. చింతాకు ప‌త‌క‌ము- అంటూ ఆనాడు రామ‌దాసు పాడుకుంటే... ``సీతమ్మ‌కు క‌ట్టేస్తి.. బంగారు మాంగ‌ళ్యం `` అంటూ.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి బాధ‌ప‌డుతున్నారు. ఒకింత ఆల‌స్యంగా వెలుగు చూసిన ఈ వ్య‌వ‌హారంపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిప‌డుతున్నాయి. దీంతో దిగివ‌చ్చిన ఎమ్మెల్యే విరూపాక్షి.. తెలియ‌క చేసిన త‌ప్పిద‌మంటూ.. ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఏం జ‌రిగింది?

రాములోరి కల్యాణ మహోత్సవంలో భాగంగా శ్రీరాముడి తరుపున వేదపండితులు సీతమ్మ మెడలో వేయాల్సిన తాళిబొట్టు. ఎమ్మెల్యే బి.విరూపాక్షి సీతమ్మ మెడలో వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. క‌ర్నూలు జిల్లా ఆలూరు నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్వగ్రామం చిప్పగిరి. ఇక్క‌డి పురాతన ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఎమ్మెల్యే విరూపాక్షీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రాములోరి కల్యాణోత్సవంతో భాగంగా వేద పండితులు శాస్త్రోక్తంగా మంత్రాలు చదువుతూ, సంప్రదాయబద్ధంగా దేవుడిని ఆవాహనం చేసుకుని శ్రీరాముడి చేతిలో ఉన్న మాంగళ్యాన్ని సీతమ్మకు మెడలో వేసి ఆ దేవి పాదాలను తాకి నమస్కరిస్తారు. శ్రీరామచంద్రుడే సీతమ్మ మెడలో తాళికట్టారని పండితులు వివరిస్తారు. ఇది సంప్రదాయం. ఇందుకు విరుద్ధంగా వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పూజారి మాంగళ్యాన్ని ఇవ్వగానే.. శ్రీరాముడికి చూపించి సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసేశారు. దీనిపై హిందూ సంఘాలు నిప్పులు చెరిగాయి. విరూపాక్షి సీతమ్మ మెడలో మాంగళ్యాన్ని వేయడం మహా ఆపచారమని, ఆయన హిందూ సమాజానికి తక్షణమే క్షమాణ చెప్పాలని విశ్వహిందు పరిషత్ డిమాండ్ చే సింది.

ఎమ్మెల్యే ఏమ‌న్నారంటే..

``శ్రీరామనవమి సందర్భంగా జరిగిన సీతారాముల కల్యాణోత్సవానికి ఓ భక్తుడిగా వెళ్లాను. వేద పండితుడు నాకు మాంగళ్యం ఇచ్చి సీతమ్మ మెడలో వేయమంటేనే వేశాను. పూజారి చెప్పడంతో కాదనలేకపోయాను. జరిగిన సంఘటన తప్పు అయితే హిందూ సమాజం నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను`` అని విరూపాక్షి తాపీగా ఓ వీడియోను విడుదల చేశారు.