తండ్రి జెర్సీ.. తన జెర్సీ.. కోహ్లికి 18 అలా గుర్తుగా ఉండిపోయిందంతే
1988లో పుట్టిన కోహ్లి జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఈ 18 అంకె ముడిపడి ఉండడం గమనార్హం. ఇంతకూ ఆ విశేషాలు ఏమిటో చూద్దామా..?
By: Tupaki Desk | 4 Jun 2025 5:00 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ లో మంగళవారం నాటి ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయం సాధించడంతో అందరూ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి 18వ నంబరుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తున్నారు. లోతుగా చూస్తే..
1988లో పుట్టిన కోహ్లి జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఈ 18 అంకె ముడిపడి ఉండడం గమనార్హం. ఇంతకూ ఆ విశేషాలు ఏమిటో చూద్దామా..?
2008లో కోహ్లి అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ లో ఆడాడు. అప్పుడు అతడికి తొలిసారిగా 18వ నంబరు జెర్సీ వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చాక కూడా ఇది కొనసాగింది. ఇక కోహ్లి తొలుత 2008లో శ్రీలంక టూర్ కు ఎంపికయ్యాడు. ఆ సిరీస్ లో తన తొలి వన్డే ఆగస్టు 18నే ఆడాడు.
కోహ్లి తండ్రి పేరు ప్రేమ్ కోహ్లి. ఈయన కూడా ఓ స్థాయి వరకు క్రికెట్ ఆడారు. ఆ సమయంలో ప్రేమ్ కోహ్లి జెర్సీ నంబరు కూడా 18 కావడం గమనార్హం. 2006 డిసెంబరు 18న ఆయన అకస్మాత్తుగా చనిపోయారు. ఆ సమయంలో కోహ్లి ఢిల్లీ తరఫున కర్ణాటకపై రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. తండ్రి చనిపోయిన విషయం తెలిసినా.. జట్టు కష్టాల్లో ఉండడంతో కోహ్లి ఇన్నింగ్స్ కొనసాగించి మ్యాచ్ డ్రా అయ్యేలా చేశాడు.
ఇక కోహ్లి టీమ్ ఇండియాలోకి వచ్చాక కూడా 18వ నంబరు జెర్సీతోనే పాపులర్ అయ్యాడు. తిరిగి వెనక్క చూసుకోవాల్సిన అవసరం లేనంతగా దూసుకెళ్లాడు. దీంతో ఇదే నంబరు కలిసొచ్చేలా వన్ 8 (18)తో బ్రాండ్ ను నెలకొల్పాడు. ఇదే పేరుతో బెంగళూరులోనూ ఓ పబ్ ను తెరిచాడు.
తాజాగా కోహ్లి 18వ సీజన్ లో ఐపీఎల్ టైటిల్ అందుకున్నాడు. నిన్న మ్యాచ్ జరిగిన తేదీ కూడా 03-06-2025. అన్నీ కలిపితే 18 వస్తుంది.
కోహ్లి వన్డేల్లో అత్యధిక స్కోరు 183. ఈ స్కోరును 2012 మార్చి 18న పాకిస్థాన్ పై ఆసియా కప్ లో ఢాకా వేదికగా చేశాడు.
2016 మే 18న కోహ్లి పంజాబ్ కింగ్స్ పై చిన్నస్వామి స్టేడియంలో సెంచరీ బాదాడు.
కొసమెరుపు: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కోహ్లి అద్భుతంగా రాణించాడు. 657 పరుగులు చేశాడు. ఈ మొత్తం (6+5+7) కూడినా 18 వస్తుంది. అందుకే 18 అంటే కోహ్లికి చాలా స్పెషల్.
