పహల్గాం ఉగ్రదాడి.. వైరల్ వీడియో ఆ జంటది కాదు!
తాజాగా.. పహల్గామ్‌లో మరణించిన నేవీ అధికారి వినయ్ నర్వాల్, ఆయన భార్యకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది.
By: Tupaki Desk | 25 April 2025 6:31 AMపహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడంతో దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన అనేక వార్తలు, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి విషాదకర సమయంలో కూడా కొందరు బాధ్యతారాహిత్యంగా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. తాజాగా.. పహల్గామ్‌లో మరణించిన నేవీ అధికారి వినయ్ నర్వాల్, ఆయన భార్యకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది. కానీ, ఆ వీడియోలో ఉన్నది వేరే జంట అని తేలింది.
పహల్గామ్‌లో ఉగ్రదాడిలో మరణించిన నేవీ అధికారి వినయ్ నర్వాల్, ఆయన భార్య కాశ్మీర్ ప్రకృతి అందాల మధ్యలో ఇద్దరూ ఆనందంగా డ్యాన్స్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెళ్లయిన ఆరు రోజులకే వినయ్ ప్రాణాలు కోల్పోవడంతో ఇది వారు మరణించడానికి ముందు చివరిగా చేసిన వీడియో అంటూ చాలా మంది షేర్ చేశారు. భర్త మృతదేహం వద్ద భార్య రోదిస్తున్న దృశ్యాలు కూడా వైరల్ కావడంతో ఈ వీడియో మరింత వైరల్ అయింది.
అయితే ఆ వీడియోలో ఉన్నది వినయ్ నర్వాల్, ఆయన భార్య కాదని తేలింది. ఆ వీడియోలో ఉన్నజంట తమకు జరిగిన ఈ ప్రచారంపై స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. తాము క్షేమంగా ఉన్నామని.. తమ పై ఉగ్రదాడి జరిగిందని తన భర్త చనిపోయాడని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని వారు స్పష్టం చేశారు. తన భర్త నేవీ అధికారి కాదని కూడా ఆమె చెప్పుకొచ్చారు. తమ పాత వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తూ తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తంచేశారు. మీడియా సంస్థలు ఇకనైనా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకుండా ఆపాలని వారు విజ్ఞప్తి చేశారు.