ఇదేం డిజిటల్ ఇండియా? ఫించన్ పైసల కోసం 9కి.మీ. నడక
ఏసీ గదుల్లో కూర్చొని అర్థంపర్థం లేని నిబంధనల్ని చూపిస్తూ.. సామాన్యులకు చుక్కలు చూపించే బ్యాంకుల తీరు రోజురోజుకు పెరుగుతోంది.
By: Garuda Media | 25 May 2026 3:00 PM ISTఏసీ గదుల్లో కూర్చొని అర్థంపర్థం లేని నిబంధనల్ని చూపిస్తూ.. సామాన్యులకు చుక్కలు చూపించే బ్యాంకుల తీరు రోజురోజుకు పెరుగుతోంది. పేరుకు డిజిటల్ ఇండియా అంటూ భారీ ఎత్తున ప్రచారం చేసుకునే కేంద్ర సర్కార్ తీరుకు భిన్నంగా వాస్తవ పరిస్థితులు ఉంటున్నాయి. ఇచ్చే కొద్దిపాటి పైసల కోసం గ్రామీణ ప్రాంతాల్లోని వారి కష్టాలు ఒకలా ఉంటే.. గిరిజన ప్రజల ఇబ్బందులు మరోలా ఉంటున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసినోళ్లు ఎవరైనా అయ్యో పాపం అనుకోకుండా ఉండలేని పరిస్థితి. అదే సమయంలో సామాన్యుల విషయంలో అర్థం లేని నిబంధనలు పెట్టి.. వారికి చుక్కలు చూపిస్తున్న బ్యాంకుల తీరుపై కోపం రాక మానదు. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఒక కోడలు తన తొంభై ఏళ్ల అత్త పింఛన్ డబ్బుల కోసం.. ఆమెను వీపు మీద మోస్తూ.. దాదాపు తొమ్మిది కిలోమీటర్లు కొండలు.. గుట్టలు దాటుకుంటూ బ్యాంక్ కు వచ్చిన వైనం కన్నీళ్లు పెట్టించక మానదు. దీనికి సంఒంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డిజిటల్ భారత్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకునే దానికి భిన్నంగా వాస్తవ పరిస్థితులు ఉన్న విషయాన్ని తాజా ఉదంతం చెప్పకనే చెప్పిందంటున్నారు. దీనికి తోడు అర్థంలేని నిబంధనల పేరుతో గిరిజన ప్రాంతాల్లోని వారిని.. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్థిదారులకు బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం ఇచ్చే చిల్లర పైసల కోసం.. కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ బ్యాంకులకు చేరుకుంటున్న వారికి.. ఆ కష్టాన్ని తొలగించేలా నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ ఇప్పుడు పెరుగుతోంది.
తాజా ఉదంతంలోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజ జిల్లా మైన్ పట్ ప్రాంతానికి చెందిన యాభై ఏళ్ల సుఖ్మణియా బాయి అత్తకు తొంభై ఏళ్లు. ఆమెకు ప్రతి నెలా పింఛన్ కింద రూ.500 వస్తోంది. అయితే.. ఆ చిరు మొత్తాన్ని విడుదల చేయాలంటే లబ్ధిదారులు వేలిముద్ర కాని గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలన్న రూల్ ను బ్యాంక్ కు పెట్టారు. దీంతో.. పింఛన్ పైసలు కావాలంటే అత్తను బ్యాంక్ కు తీసుకురావాలని సిబ్బంది తేల్చేశారు.
దీంతో.. రవాణా సౌకర్యం లేని నేపథ్యంలో తొంభై ఏళ్ల అత్తను వీపున కట్టుకొని తొమ్మిది కిలోమీటర్లు నడుచుకుంటూ బ్యాంక్ కు చేరుకుంది. గతంలో పింఛన్ ను స్థానికంగా ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్లేవారని.. ఇప్పుడు అలాంటి సౌకర్యం లేకుండా బ్యాంక్ కు రావాల్సిందేనని ఆమె వాపోయింది. ఆమె కష్టాన్ని స్థానికులు ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అది కాస్తా వైరల్ గా మారింది. దీంతో.. బ్యాంకులు.. కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కేంద్రం చెబుతున్న డిజిటల్ ఇండియా మాటలకు.. వాస్తవానికి మధ్య పొంతన ఉండటం లేదని వారు విమర్శిస్తున్నారు. గ్రామీణ.. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది.
ఈ ఉదంతంలో బ్యాంక్ తీరుపైనా విమర్శలు వెల్లువెత్తటంతో.. సదరు బ్యాంక్ దిగి వచ్చి వివరణను ఇచ్చింది. కేవైసీ ప్రక్రియలో లోపాల కారణంగా బ్యాంక్ కు రావాల్సి ఉంటుందని.. జనవరి వరకు బాధితురాలికి ఇంటి వద్దే పెన్షన్ అందించామని.. తాజాగా మారిన నిబంధనలో భాగంగా ఆమె బ్యాంక్ కు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత నాలుగు నెలల పింఛన్ ను ఒకేసారి ఆమెకు ఇచ్చి పంపినట్లుగా పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి సుఖ్మణియా అత్తగారికి ఇంటి వద్దే పింఛన్ అందిస్తామని బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని.. కేవైసీ లాంటి ప్రక్రియను పెద్ద వయస్కులకు ఇంటి వద్దే తీసుకునేలా ఎందుకు చర్యలు తీసుకోరు? అన్నది అసలు ప్రశ్న.
