భయపెట్టిన వైరల్ వీడియో.. పరుగులు తీసిన ప్రకాశం పోలీసులు
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు రావడంతో పోలీసులు హై అలర్డ్ గా ఉంటున్నారు.
By: Tupaki Desk | 17 Sept 2025 3:37 PM ISTసోషల్ మీడియా ఎంత శక్తివంతమైనదో తెలియజెప్పే సంఘటన ఇది.. సక్రమంగా వినియోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని నిస్సందేహంగా చెప్పేందు ఇంతకు మించిన ఉదాహరణ ఉండదేమో.. భార్యపై భర్త దాడి చేసిన ఓ వీడియో వైరల్ కాగా, ప్రకాశం జిల్లా పోలీసులు ఆఘమేఘాలపై స్పందించి నిందితుడిని అరెస్టు చేసిన సంఘటన మహిళలను కదిలించింది. భార్యపై అనుమానంతో ఆమెపై భర్త చేసిన పాశవిక దాడిని సోషల్ మీడియాలో వెలుగులోకి తెచ్చింది. ఆ వీడియోలో బాధితురాలి రెండు చేతులు కట్టేసి భర్త దాడి చేయడం, ఆమె రక్షించండి అంటూ కేకలు వేయడం చూసిన వారి గుండెలను పిండేసింది. దీంతో ఆ వీడియో పోలీసులకు చేరే వరకు షేర్ చేయడంతో నిందితుడు గంటల వ్యవధిలోనే ఏడు ఊసులు లెక్కపెట్టాల్సివచ్చింది.
మహిళలపై దాడులు అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి మహిళలపై హింసను అణచివేయడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంది. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు చేసిన వారు ఎవరైనా వదిలి పెట్టకుండా అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో సొంత పార్టీ అయిన వారైనా తప్పు చేస్తే క్షమించేది లేదని ఐటీడీపీ కార్యకర్త కిరణ్ అరెస్టు సందర్భంగా తేల్చిచెప్పింది. దీంతో సోషల్ మీడియాలో మహిళల విషయంలో పోస్టు చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు రావడంతో పోలీసులు హై అలర్డ్ గా ఉంటున్నారు. దీనికి తాజా ఉదాహరణే ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటనగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లా తుర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తం తన భార్య రెండు చేతులు కట్టేసి బెల్టుతో దాడి చేశాడు. భర్త కొడుతున్న దెబ్బలకు బాధతో ఆ భార్య విలవిల్లాడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడి తక్షణ అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు.
ఎస్పీ ఆదేశాలతో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణతోపాటు ఇద్దరు సీఐలు, మరికొందరు ఎస్ఐలు ప్రత్యేక బృందంగా ఏర్పడి బాధితురాలిని గుర్తించారు. వెంటనే ఆమెకు వైద్య సహాయం అందజేయడంతోపాటు బాధితురాలి భర్త బాలాజీ, అతడికి సహకరించిన మరొకరిని అరెస్టు చేశారు. నిందితుడు బాలాజీకి 12 ఏళ్ల క్రితం వివాహం కాగా, భార్యపై అనుమానం పెంచుకుని తరచూ కొడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఓ బేకరిలో పనిచేస్తున్న బాధితురాలిని ఈ నెల 13న రాత్రి 9.30 సమయంలో మద్యం మత్తులో ఉన్న బాలాజీ తీవ్రంగా గాయపరిచాడు. బెల్టుతో ఇష్టానుసారం కొట్టడంతో ఆమె గగ్గోలు పెట్టింది. బాధితురాలి రోదనలు విన్న స్థానికులు మద్యం మత్తులో ఉన్న బాలాజీని అదుపు చేయలేకపోయారు. ఇదే సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్ అయింది. దీనిపై పోలీసులు స్పందించడం, నిందితుడిని అరెస్టు చేయడంపై సోషల్ మీడియాలో అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
