ట్రైన్‌లో పూజలు... క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ
కదులుతున్న రైలులో పూజారి ఆధ్వర్యంలో జరుగుతున్న పూజల విషయమై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది.
By: Ramesh Palla | 13 July 2026 1:00 PM ISTఇటీవల ఒక రైలు బోగీని శోభనం గది మాదిరిగా అలంకరించడం వివాదాస్పదం అయిన విషయం తెల్సిందే. అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోబోతున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే ప్రయాణికుల కోసం అన్ని వసతులు ఏర్పాట్లు చేస్తుందనే ఉద్దేశంతో చేసిన ఆ పని కాస్త వివాదాస్పదం అయింది. ఆ విషయమై సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న సమయంలోనే మరో రైలు వీడియో ఒకటి వైరల్ అయ్యింది. గత రెండు రోజులుగా చాలా స్పీడ్‌గా వెళ్తున్న రైలు కోచ్‌లో పూజలు నిర్వహిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అంత వేగంగా వెళ్తున్న రైలులో ఎలా పూజలు నిర్వహిస్తున్నారు, అసలు ఎలా రైల్వే శాఖ అనుమతులు ఇచ్చిందని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రైల్వే శాఖకు ఆ వీడియోను ట్యాగ్ చేసి అసలు కథ ఏంటి వివరించు అంటూ ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది.
కదులుతున్న రైలులో ప్రత్యేక పూజలు...
కదులుతున్న రైలులో పూజారి ఆధ్వర్యంలో జరుగుతున్న పూజల విషయమై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. కదులుతున్న రైలు బోగీలో పూజా కార్యక్రమాలు జరగడం అనేది వాస్తవం. అయితే అది రెగ్యులర్ ప్రయాణికులు ప్రయాణించే రైలు బోగీ కాదు. ప్రైవేట్ వ్యక్తులు బుక్ చేసుకున్న బోగీ అది, దాన్ని సెలూన్ కార్ అని పిలుస్తారని కూడా రైల్వే అధికారులు చెప్పుకొచ్చారు. పెద్ద మొత్తం చెల్లించి ప్రైవేట్ వ్యక్తులు బుక్ చేసుకునే సెలూన్ కార్ నందు కార్యక్రమాలు, పార్టీలు, అన్ని రకాలుగా వినియోగించుకోవచ్చు అని అధికారులు పేర్కొన్నారు. ముందస్తుగానే అధికారుల నుంచి అనుమతి తీసుకుని ఆ ప్రైవేట్ వ్యక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారని, ఆన్ లైన్ ద్వారా వారు బుక్ చేసుకున్నారని, అందుకు గాను వారు రూ.3 లక్షలకు పైగా అడ్వాన్స్ ను చెల్లించారని కూడా రైల్వే అధికారులు స్పష్టతనిచ్చారు.
ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే రైలు...
జులై 10వ తారీకున ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ ప్రైవేట్ సెలూన్ కార్ జత చేసినట్లుగా వారు తెలియజేశారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదు. అసలు రెగ్యులర్ ప్రయాణికులకు ఈ భోగీతో సంబంధం ఉండదని అధికారులు తెలియజేశారు. అదనపు ఆధాయం కోసం రైల్వే శాఖ ఇలా భోగీలను ప్రైవేట్ పార్టీలకు ఇవ్వడం చాలా కాలంగా నడుస్తూ వస్తుందని, ఇప్పుడు దీని గురించి ప్రత్యేకంగా చర్చ వచ్చింది కనుక వివరణ ఇవ్వాల్సి వచ్చిందని రైల్వే అధికారులు అంటున్నారు. రైల్వే కోచ్ ను అద్దె చెల్లిస్తే ఎవరికి అయినా ఇచ్చేందుకు ఇబ్బంది ఉండదని, ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా రైల్వే అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ఆ పూజలు ఏంటి? ఎందుకు అనే విషయాన్ని మాత్రం రైల్వే అధికారులు తమకు సంబంధం లేని విషయం అన్నట్లుగా చెప్పుకొచ్చారట.
రైలులో హనీమూన్ కోచ్..
హనీమూన్ కోసం విషయం వివాదాస్పదం కావడంతో ఈ వీడియో పై వెంటనే రైల్వే అధికారులు స్పందించారు. రైల్వే శాఖ ప్రయాణికుల భద్రత విషయమై కఠినంగా వ్యవహరిస్తుందని, అన్ని నిబంధనలు నూటికి నూరు శాతం పాటిస్తూ ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తుందని రైల్వే అధికారి ఒకరు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. గత కొన్ని సంవత్సరాలుగా రైల్వే శాఖ బోగీలను అద్దెకు ఇవ్వడం అనే సర్వీస్ ను ప్రారంభించింది. ప్రైవేట్ వ్యక్తులకు మొత్తం ట్రైన్‌ను ఇచ్చేందుకు సైతం అధికారులు వెసులుబాటు కల్పించారు. అందుకోసం సైతం ముందస్తుగా అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. గతంలో పలు కార్యక్రమాలకు ప్రత్యేక రైలును వేయడంతో పాటు, ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు సైతం ప్రత్యేక రైలును కేటాయించారని కొందరు అంటున్నారు. హనీమూన్ కోచ్ విషయమై యాక్షన్ తీసుకున్న అధికారులు ఈ పూజా కోచ్ విషయంలో మాత్రం అన్ని నిబంధనల ప్రకారం జరిగినట్లుగా చెప్పుకొచ్చారు.
