Begin typing your search above and press return to search.

వివేకా కోసం ఓ మాట.. పులివెందుల ఎన్నికల్లో వైరల్ టాపిక్స్

హోరాహోరీగా జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   14 Aug 2025 10:14 PM IST
వివేకా కోసం ఓ మాట.. పులివెందుల ఎన్నికల్లో వైరల్ టాపిక్స్
X

హోరాహోరీగా జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నెల 12న జరిగిన ఎన్నికలకు సంబంధించిన గురువారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఇందులో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి తిరుగులేని విజయం సాధించారు. అయితే దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందుల మండలంలో స్థానిక ఎన్నికలు జరగడంతో ఓటర్లు తమ అభిప్రాయాలను ఓటుతోపాటు వ్యక్తం చేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది.

ఎన్నికల కౌంటింగును వైసీపీ బహిష్కరించింది. కేవలం టీడీపీ నాయకుల సమక్షంలోనే కౌంటింగు జరిగింది. అయితే కౌంటింగ్ సందర్భంగా బ్యాలెట్ పత్రాలతోపాటు చేతితో రాసిన కొన్ని సందేశాలు బయటకు వచ్చాయి. ఒక దాంట్లో ‘‘మా వివేకా సార్ కి న్యాయం చేయండి సార్’’ అంటూ రాయగా, మరో దాంట్లో ‘‘30 ఏళ్ల తర్వాత ఓటు వేయడంతో ఆనందంగా ఉంది’’ అని రాసిన చీటీలు బయటకు వచ్చాయి. ఈ రెండంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గతంలో ఎన్నికల సందర్భంగా ఇలాంటి సందేశాలు తరచూ కనిపించేవి. తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పుకోలేని ఓటర్లు చిన్న కాగితంపై తమ మదిలో ఆలోచనలు, నిరసనలను రాసి ఓటుతోపాటు బ్యాలెట్ బాక్సులో వేసేవారు. కౌంటింగ్ సందర్భంగా సిబ్బంది వాటిని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఇలాంటి అవకాశం లేకుండా పోయింది. అయితే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించడం వల్ల ఓటర్లు తమ అభిప్రాయాలను ఇలా వ్యక్తం చేసే సౌకర్యం కలిగింది.

అయితే పులివెందుల ఓటింగ్ సందర్భంగా ఇద్దరు ఓటర్లు వెలిబుచ్చిన అభిప్రాయాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ రెండు కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆకర్షించడం విశేషం. ఆరేళ్ల క్రితం మాజీ మంత్రి వివేకా హత్య జరుగగా, ఇంతవరకు తమ కుటుంబానికి న్యాయం జరగలేదని వివేకా కుమార్తె సునీత తరచూ మీడియా ముందుకొస్తున్నారు. ఆమెకు మద్దతుగా ఓటర్లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారా? అని తాజాగా బ్యాలెట్ ద్వారా బయటకు వచ్చిన స్లిప్ తో చర్చ మొదలైంది.

ఇక పులివెందులలో చివరిసారిగా 1995లో స్థానిక ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నాలుగు సార్లు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరిగినా ఒక్కసారి కూడా ఎన్నిక జరగలేదు. దీంతో ఓ ఓటరు 30 ఏళ్ల తర్వాత ఓటు వేస్తున్నట్లు తన ఆనందం పంచుకున్నాడని చెబుతున్నారు. మొత్తానికి ఈ ఫొటోలు ఆన్‌లైన్లో వైరల్ గా మారడం ఆసక్తికరంగా చెప్పుకుంటున్నారు.