Begin typing your search above and press return to search.

నా సీటెక్కడో చెప్పండి.. బోర్డింగ్ పాసుతో ఫ్లైట్ లోకి కంగారూ.. ప్యాసింజర్ల పరేషాన్

ఈ వీడియోలో ఒక మహిళ విమాన సిబ్బందితో వాదిస్తుండగా.. కంగారూ ఓపికగా నిలబడి ఉంది. ఆ తర్వాత కంగారూ అక్కడి నుండి తన సీటులో కూర్చోవడానికి వెళ్తున్నట్లు కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   5 Jun 2025 4:00 PM IST
నా సీటెక్కడో చెప్పండి.. బోర్డింగ్ పాసుతో ఫ్లైట్ లోకి కంగారూ.. ప్యాసింజర్ల పరేషాన్
X

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వింత వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక ముద్దులొలికే కంగారూ తన వీపుపై బ్యాగును తగిలించుకొని, ముందు కాళ్లతో బోర్డింగ్ పాస్‌ను పట్టుకొని విమానం ఎక్కి, చెక్-ఇన్ అయ్యాక తన సీటులో కూర్చున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన లక్షలాది మంది నెటిజన్లు ఆశ్చర్యపోయారు. "కంగారూలు కూడా విమానం ఎక్కుతున్నాయా?" అని ఆందోళన చెందారు. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ వెతికారు.

'ఇన్‌ఫినైట్ అన్‌రియాలిటీ' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ పేజీ AI- రూపొందించిన జంతువుల క్లిప్‌లను షేర్ చేస్తూ ఉంటుంది. కానీ, ఈ కంగారూ వీడియో మాత్రం అచ్చం నిజమైనదిలా కనిపించింది. ఒక కంగారూ విమానంలో బోర్డింగ్ పాస్‌ను పట్టుకొని ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా, ఈ వీడియో నెటిజన్లలో వినోదం, గందరగోళం రెండింటినీ కలిగించింది.

ఈ వీడియోలో ఒక మహిళ విమాన సిబ్బందితో వాదిస్తుండగా.. కంగారూ ఓపికగా నిలబడి ఉంది. ఆ తర్వాత కంగారూ అక్కడి నుండి తన సీటులో కూర్చోవడానికి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన చాలా మంది ప్రజలు నిజమని నమ్మి గందరగోళానికి గురయ్యారు. ఈ కంగారూ వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించారు. దీనిని మొదట 'ఇన్‌ఫినైట్ అన్‌రియాలిటీ' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ పేజీ ఇంతకు ముందే అనేక జంతువులకు సంబంధించిన ఇలాంటి వీడియోలను సృష్టించింది. విమాన సీటులో కూర్చున్న హిప్పోపొటామస్, విమానం ఎక్కుతున్న జిరాఫీ వంటి వీడియోలను కూడా ఇది సృష్టించి విడుదల చేసింది.