Begin typing your search above and press return to search.

హింస అని పిలిస్తే కాల్చేశారు.. మరో బ్లాక్ లైవ్స్ మ్యాటర్?

అమెరికాలో అత్యవసర సేవలకు 911కు కాల్ చేస్తారు. ఇలానే నల్ల జాతీయురాలు నైనీ ఫిన్లేసన్ లాస్ ఏంజెల్స్ లో ఈ నెల 4న డొమెస్టిక్ వయలెన్స్ పై కాల్ చేయగా.. పోలీసులు ఆమె ఉన్న ఇంటికి వెళ్లారు.

By:  Tupaki Desk   |   23 Dec 2023 8:32 AM GMT
హింస అని పిలిస్తే కాల్చేశారు.. మరో బ్లాక్ లైవ్స్ మ్యాటర్?
X

అమెరికా ప్రగతి పథంలో ఎంత ముందుంజలో ఉన్నా.. అక్కడ ఇప్పటికీ వర్ణ వివక్ష తీవ్రమైన అంశం. ప్రపంచం అంతటా.. అగ్ర రాజ్యంలో కొవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో 2020మే నెలలో నల్ల జాతీయుడు, నిరాయుధుడిగా ఉన్న జార్జ్ ఫ్లాయిడ్ ను డెరెక్ చౌవిన్ అనే తెల్లజాతి మిన్నియాపాలిస్ పోలీసు అధికారి చేతిలో ప్రాణాలు కోల్పోవడం ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే. ఫ్లాయిడ్ చేతులను వెనక్కువిరిచి మెడపై తొమ్మిది నిమిషాలకు పైగా కూర్చున్నాడు చౌవిన్. ఈ వీడియో విస్తృతంగా ప్రసారం కావడంతో అమెరికా అట్టుడికింది. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు జరిగాయి. ఫ్లాయిడ్ ఉదంతం.. మరో ఇద్దరు ఆఫ్రికన్ అమెరికన్ల మరణాలను వెలుగులోకి తెచ్చింది. జార్జియాలో అహ్మద్ అర్బరీ, కెంటకీలో బ్రయోన్నా టేలర్ పోలీసుల కాల్పుల్లో చనిపోయినట్లుగా బయటపడింది. మూడు నెలల వ్యవధిలోనే జరిగిన మూడు ఘటనలు.. అమెరికన్ సమాజంలో పాతుకుపోయిన జాత్యహంకారాన్ని చాటాయి.

911కు కాల్ చేస్తే.. మరణం ఎదురొచ్చింది..

అమెరికాలో అత్యవసర సేవలకు 911కు కాల్ చేస్తారు. ఇలానే నల్ల జాతీయురాలు నైనీ ఫిన్లేసన్ లాస్ ఏంజెల్స్ లో ఈ నెల 4న డొమెస్టిక్ వయలెన్స్ పై కాల్ చేయగా.. పోలీసులు ఆమె ఉన్న ఇంటికి వెళ్లారు. కానీ, ఆ తర్వాతే ఘోరం జరిగింది. కాల్పులు చోటుచేసుకుని నల్ల జాతీయురాలు ప్రాణాలు కోల్పోయింది. ఇంతకూ నైనీ కాల్ చేసిన కారణం ఏమిటంటే.. ఆమె బాయ్ ఫ్రెండ్ నుంచి వేధింపులు ఎదుర్కొనడం. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ ఫ్లాట్ కు వెళ్లేసరికి ఘర్షణ వాతావరణం కనిపించింది. దీంతోపాటు ఆ యువతి చేతిలో పెద్ద వంటగది కత్తి ఉంది. తన తొమ్మిదేళ్ల కూతురిని తోసేసినందుకు ప్రియుడిని కత్తితో పొడిచి చంపేస్తానని అరుస్తూ చెబుతోంది. తన ప్రియుడు కూర్చున్న అపార్ట్‌మెంట్ లోపలికి దూసుకెళ్లి ఎనిమిది అంగుళాల కత్తిని పట్టుకుంది. అయితే, ఆ ఘర్షణ మధ్యలో కాల్పులు జరిగాయి. నైనీ తన కుమార్తె ఎదుటనే తూటా గాయాలతో ప్రాణాలొదిలింది.

నైనీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు తెలుస్తోంది. చిన్న కుమార్తె వయసు రెండేళ్లు మాత్రమే. కాగా, ఆమె మాజీ ప్రియుడితో తీవ్ర స్థాయి విభేదాలున్నట్లు.. వారిద్దరూ గొవడపడిన నేపథ్యంలోనే పోలీసులకు ఫోన్ చేసినట్లు స్పష్టమైంది. అయితే, కాల్పులు బ్యాడ్ లక్ కొద్దీ జరిగాయి. మరి..ఫ్లాయిడ్ ఉదంతం నేపథ్యంలోలాగానే ఈసారీ తీవ్ర స్థాయి నిరసనలు వ్యక్తమవుతాయా? అనేది చూడాలి. నైనీ కుటుంబ సభ్యులు పోలీసులు అకారణంగా కాల్పులు జరిపి నైనీని హతమార్చారని ఆరోపిస్తూ కేసు పెట్టారు. ఆమె కుటుంబానికి 30 వేల డాలర్ల ఫండ్ రైజింగ్ చేపట్టారు.