Begin typing your search above and press return to search.

ప్ర‌చార ఖ‌ర్చు తేల్చండి: అభ్య‌ర్థుల‌కు కొత్త క‌ష్టాలు

అభ్య‌ర్థులు నిబంధ‌న‌లను అతిక్ర‌మించి మ‌రీ ఖ‌ర్చు పెట్టార‌ని.. ఎవ‌రెవ‌రు ఎంతెంత ఖ‌ర్చు పెట్టారో తేల్చాల‌ని.. వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలని కోరారు.

By:  Tupaki Desk   |   29 Nov 2023 5:16 AM GMT
ప్ర‌చార ఖ‌ర్చు తేల్చండి:  అభ్య‌ర్థుల‌కు కొత్త క‌ష్టాలు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం పూర్త‌యింది. మైకులు మూగ‌బోయాయి. అభ్య‌ర్థులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఇప్పుడు కొన్ని ప్ర‌జాసంఘాలు ఎన్నిక‌ల సంఘాన్ని ఆశ్ర‌యించాయి. అభ్య‌ర్థులు నిబంధ‌న‌లను అతిక్ర‌మించి మ‌రీ ఖ‌ర్చు పెట్టార‌ని.. ఎవ‌రెవ‌రు ఎంతెంత ఖ‌ర్చు పెట్టారో తేల్చాల‌ని.. వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలని కోరారు. దీంతో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం.. అనూహ్యంగా అభ్య‌ర్థుల ఖ‌ర్చుపై దృష్టి పెట్టింది. వాస్త‌వానికి ఎన్నిక‌లు పూర్త‌య్యాక‌.. ఫ‌లితం వ‌చ్చాక‌.. ఖ‌ర్చుల‌పై దృష్టి పెడ‌తారు. దానిపై వివ‌ర‌ణ కోర‌తారు. ఇది ఎక్క‌డైనా ఉన్న‌దే.

కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని పండుగ‌లా నిర్వ‌హించిన నేప‌థ్యంలో అభ్య‌ర్థులు ఎన్నిక‌ల సంఘం విధించిన ఖ‌ర్చును దాటేశార‌నేది ప్ర‌ధాన విమ‌ర్శ‌. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని గ‌మ‌నించినా.. ఇది నిజ‌మేన‌ని ప‌రిశీల‌కులు కూడా చెబుతున్నారు. జ‌నాల‌ను త‌ర‌లించ‌డం.. భారీ బ‌హిరంగ స‌భ‌లు నిర్వ‌హించ‌డం.. ఉద‌యం 5 గంట‌ల నుంచి రాత్రి 10 వ‌ర‌కు ప్ర‌చారాలు నిర్వ‌హించ‌డం.. రోడ్ షోలు, వాహ‌నాలు, బ్యాన‌ర్లు, క‌టౌట్లు.. క‌ర‌ప‌త్రాల పంపిణీ.. ఇలా.. ఒక్క‌టేమిటి.. అన్ని ప్ర‌ధాన పార్టీల అభ్యర్థులూ.. పోటా పోటీగా ప్ర‌చారం చేశారు.

ఖ‌ర్చుకు ఎక్క‌డా వెనుకాడ‌లేదు. ప్ర‌త్య‌ర్థి ప‌ది రూపాయ‌లు ఖ‌ర్చుపెడుతున్నాడ‌ని తెలియ‌డంతో ఇటువైపు ఉన్న అభ్య‌ర్థి.. రూ. 100 చొప్పున ఖ‌ర్చు చేసేశారు. అప్పులు చేసిన వారు కూడా ఉన్నారు. రొక్ఖం పెట్టిన‌వారు ఉన్నారు. మొత్తానికి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని దుమ్ము రేపారు. ఇక‌, ఆన్‌లైన్ చానెళ్లు, పెయిడ్ ఆర్టిక‌ల్స్‌.. పెయిడ్ ఇంట‌ర్వ్యూల‌కు కూడా కొద‌వ‌లేదు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హార‌మే వారికి సంక‌టంగా మారింది. పోలింగ్ మ‌రో 24 గంట‌ల్లో జ‌ర‌గ‌నుంద‌న‌గానే ఖ‌ర్చుల లెక్క‌లు తేల్చాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు ఉత్త‌ర్వులు పంపించింది.

అయితే.. క‌లెక్ట‌ర్లు మ‌రోవైపు.. ఎన్నిక‌ల పోలింగ్ నిర్వ‌హ‌ణ‌లో బిజీగా ఉన్నారు. దీంతో వారు ఈ విష‌యాన్ని మ‌రో రెండు మూడు రోజుల వ‌ర‌కు వాయిదా వేసే అవ‌కాశం ఉంది. కానీ.. అభ్య‌ర్థుల‌కు మాత్రం ప్ర‌చార‌వేడి త‌గ్గక‌ముందే.. ఈ విష‌యంపై ఎన్నిక‌ల సంఘం ఆరా తీయ‌డంతోఇబ్బందిగా మారింది. అభ్య‌ర్థులు, వారి అనుచ‌రుల‌ఫోన్ల ద్వారా జ‌రిగిన లావాదేవీలు, బ్యాంకు ఖాతాల వివ‌రాల‌ను కూడా ఇప్పుడే స‌మ‌ర్పించాల్సి ఉంటుంద‌ని వారు త‌ల్ల‌డిల్లుతున్నారు. ఇక‌, నిబంధ‌న‌ల మేర‌కు ఎమ్మెల్యే అభ్య‌ర్థి త‌న సెగ్మెంట్‌లో గ‌రిష్ఠంగా 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చుచేయాలి. కానీ.. ఇక్క‌డితో అభ్య‌ర్థులు స‌రిపెట్టుకోలేదు. కోట్ల‌కు కోట్లు ఖ‌ర్చు చేశార‌నే అంచ‌నాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వులు.. క‌లెక్ట‌ర్లు తీసుకునే అడుగులు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.