Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యేకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్న ఆ అలవాటు... !

బొల్ల బ్రహ్మనాయుడు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే. వినుకొండ మాజీ నాయకుడు. మరి ఆయన ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? అనేది గమనిస్తే వినుకొండ నియోజకవర్గం లోనే ఉంటున్నారు

By:  Tupaki Desk   |   29 Jun 2025 1:00 PM IST
టీడీపీ ఎమ్మెల్యేకు ఇబ్బందులు తెచ్చి పెడుతున్న ఆ అలవాటు... !
X

బొల్ల బ్రహ్మనాయుడు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే. వినుకొండ మాజీ నాయకుడు. మరి ఆయన ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? అనేది గమనిస్తే వినుకొండ నియోజకవర్గం లోనే ఉంటున్నారు. వినుకొండలోనే రాజకీయాలు చేస్తున్నారు. టిడిపిలో ఉన్న చాలా మంది నాయకులు బొల్లా బ్రహ్మనాయుడు కి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వైసిపి హయాంలో తమపై కేసులు పెట్టించి తమను వేధించారనేది టిడిపి నాయకులు చెబుతున్న మాట. నిజంగానే ఇలా జరిగింది.

ఒక టిడిపి నే కాదు.. తన‌ను విమర్శించిన వారిని, తనతో విభేదించిన సొంత పార్టీ నాయకులు పై కూడా బ్రహ్మనాయుడు కేసులు పెట్టించారు. ఆయన‌ కేసులు పెట్టించడమే కాదు.. సొంత పార్టీ వారిని వేధించడం కూడా ఆయనకు వెన్న‌తో పెట్టిన విద్య. అలాంటిది ప్రతిపక్ష నాయకులను మాత్రమే ఎలా విడిచిపెడతారు అనేది ప్రశ్న. కాబ‌ట్టి వారిని కూడా అంతే స్థాయిలో వేధించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సెగ ఏదైతే ఉందో అది ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులకు బాగా తగులుతోంది. దీనికి కారణం ఏంటంటే ఆనాడు తమపై కేసులు పెట్టి వేధించిన బ్రహ్మనాయుడు పట్ల కఠినమైన చర్యలు తీసుకోలేకపోవడం.

ఆయనపై కేసులు నమోదు కాకపోవడం.. ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం.. వంటివే టిడిపి నాయకుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. నిజానికి బ్రహ్మనాయుడును టార్గెట్ చేయాలనేది జీవి ఆంజనేయులుకి కూడా ఉన్నప్పటికీ సౌమ్యుడిగా ప్రజా నాయకుడిగా ఆయన పేరు పొందడంతో పాటు ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం అవసరమైతే సొంత నిధులు ఖర్చు పెట్టడం అంటూ వాటికే ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో ఆయన ఇలాంటి వాటి జోలికి పోవడం లేదు.

కానీ, కార్యకర్తలు.. నాయకులు నుంచి మాత్రం ఒత్తిడి పెరుగుతోంది. వినుకొండ మండలంలోని దాదాపు 30 మంది కార్యకర్తలు వారిలో పది మంది నాయకులు కూడా ఉన్నారు. వీరంతా ఒత్తిడి చేస్తున్నారు. తమను వేధించారని, తమపై కేసులు పెట్టించారని, పోలీసులతో కొట్టించార‌ని ఇప్పుడు ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారంటూ వినుకొండ ఎమ్మెల్యే పై ఒకరకంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో కక్ష సాధింపులు ఉండకూడదని రాజకీయాల్లో కేసుల సంస్కృతి ఉండకూడదని చెబుతున్న జీవి వారందరినీ సర్దుబాటు చేస్తున్నారు.

అయితే ఇది పూర్తి స్థాయిలో ఆయనకు సానుకూలంగా మారే పరిస్థితి కనిపించడం లేదు. అంతర్గతంగా రగిలిపోతున్న కార్యకర్తలను శాంతింప చేసే ప్రక్రియ అయితే చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగని అక్రమంగా కేసులు పెట్టమని వారు కూడా అనడం లేదు. తమపై పెట్టిన కేసులను ఎత్తేయించేలాగా లేకపోతే తమకు ఏదైనా మేలు జరిగేలాగా చేయాలనేది కార్యకర్తలు నాయకులు చెబుతున్న మాట. దీంతో వినుకొండ రాజకీయాల్లో జీవికి ఒక ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. మరి ఆయన దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.